India Vs Bangladesh: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే.. ఎవరెవరిపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయంటే?

ABN , First Publish Date - 2022-12-13T18:05:50+05:30 IST

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. అంతకుముందు

India Vs Bangladesh: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే.. ఎవరెవరిపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయంటే?
KL Rahul

చాతోగ్రామ్: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత జట్టు (Team India) 1-2తో ఓటమి పాలైంది. టెస్టు ఫార్మాట్ విషయానికి వస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. కాబట్టి ఫైనల్‌కు చేరాలంటే మిగతా ఆరు టెస్టుల్లోనూ భారత జట్టు విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టులు భారత్‌కు కీలకంగా మారాయి.

బొటనవేలి గాయంతో బాధపడుతున్న టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. షమీ భుజం గాయంతో జట్టుకు దూరం కాగా, మోకాలికి అయిన శస్త్రచికిత్స నుంచి జడేజా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు అంచనా

* కేఎల్ రాహల్‌తో కలిసి శుభమన్ గిల్ (Shubman Gill) బ్యాటింగును ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడిన గిల్ 579 పరుగులు సాధించాడు.

* రాహుల్‌ (KL Rahul)పై కెప్టెన్సీ బాధ్యత కూడా ఉంది కాబట్టి ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటడంతోపాటు అటు కెప్టెన్‌గా రోహిత్ లేని లోటును పూడ్చాల్సి ఉంటుంది. కాబట్టి అతడిపై కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

* మూడో నంబరులో బ్యాటింగ్‌కు దిగనున్న చతేశ్వర్ పుజారా (Cheteswar Pujara) భుజాలపై చాలా బాధ్యత ఉంది. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో అతడు కూడా ఒకడు. అంతేకాకుండా వైస్ కెప్టెన్ కూడా. టెస్టు స్పెషలిస్ట్ అయిన పుజారాపై చాలా అంచనాలే ఉన్నాయి.

* ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (Virat Kohli) రోజురోజుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఆసియా కప్ తర్వాతి నుంచి కోహ్లీలో కొత్త బ్యాటర్ కనిపిస్తున్నాడు. అంతకుముందుతో పోలిస్తే మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు.

* రైట్ హ్యాండెడ్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Ayyar) ఇటీవల మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. 5 మ్యాచుల్లో అతడి సగటు 46.88.

* ఇండియా టెస్టు క్రికెట్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant0 మ్యాచ్ విన్నర్‌గా పేరు సంపాదించుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ టెస్టుల్లో మాత్రం అతడికి మంచి పేరే ఉంది.

* నిలకడైన ప్రదర్శనతో అక్షర్ పటేల్ (Axar Patel) జట్టులో క్రమంగా ముఖ్యమైన ఆటగాడిగా మారుతున్నాడు. గాయపడిన రవీంద్ర జడేజాకు అక్షర్ పటేల్ చక్కని రీప్లేస్‌మెంట్.

* టెస్టు క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) ప్రత్యేకమైన ఆటగాడు. ఆసియా పిచ్‌లపై అశ్విన్ చెలరేగిపోతాడు. అతడు తన బౌలింగ్ శైలితో ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారుతాడు. అవసరమైతే బ్యాట్‌తోనూ చెలరేగడం అశ్విన్‌కు వెన్నతో పెట్టిన విద్య.

* భారత జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఒకడు. బంతితో బ్యాటర్లను భయపెట్టలగడు. బ్యాట్‌తో బౌలర్లలో గుబులు పుట్టించగలడు.

* టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ (Mohammed Siraj)పై చాలా బాధ్యతలున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ లేని లోటును పూడ్చాల్సిన బాధ్యత సిరాజ్‌పైనే ఉంది.

* మహమ్మద్ షమీ స్థానం కోసం వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ (Umesh Yadav), లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat) పోటీ పడుతున్నారు. అయితే, ఉనద్కత్‌తో పోలిస్తే టెస్టు క్రికెట్‌లో ఉమేశ్ యాదవ్‌కు ఉన్న అనుభవం కారణంగా అతడికి చోటు దక్కే అవకాశం ఉంది.

Updated Date - 2022-12-13T18:05:52+05:30 IST