New Zealand vs Sri Lanka: శ్రీలంక చెత్త బ్యాటింగ్.. 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం

ABN , First Publish Date - 2022-10-29T17:40:45+05:30 IST

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్, శ్రీలంక మ్యాచ్‌లో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న..

New Zealand vs Sri Lanka: శ్రీలంక చెత్త బ్యాటింగ్.. 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం

సిడ్నీ: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో (T20 World Cup) భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన న్యూజిలాండ్(New Zealand), శ్రీలంక(Sri Lanka) మ్యాచ్‌లో న్యూజిలాండ్ (New Zealand Won) 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 102 పరుగులకే ఆలౌట్ (Sri Lanka Allout) అయి కుప్పకూలింది. న్యూజిలాండ్ జట్టు ఓపెనర్లు అలెన్, కాన్వే చెరొక పరుగుకే చేతులెత్తేశారు. కెప్టెన్ విలియంసన్ కూడా 8 పరుగులకే రజిత బౌలింగ్‌లో మెండిస్‌గా క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. కానీ.. ఒక్కడు మాత్రం చివరి వరకూ నిలబడి లంక బౌలర్లతో తలపడ్డాడు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అతను మరెవరో కాదు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips). 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టి 104 పరుగులతో సెంచరీతో (Glenn Phillips Century) సత్తా చాటాడు. ఈ ఒక్కడి కష్టంతో న్యూజిలాండ్ జట్టు చెప్పుకోతగిన స్కోర్ చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఆది నుంచే తడబడింది.

తొలి ఓవర్‌లోనే నిషంక (0) వికెట్, రెండో ఓవర్‌లో కుషాల్ మెండిస్ (4) వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. ధనంజయ డి సెల్వ కూడా బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా డకౌట్ అయ్యాడు. చరిత్ అసలంక 4 పరుగులకే చేతులెత్తేశాడు. ఆ తర్వాత.. రాజపక్స 34 పరుగులు, శనక 35 పరుగులు చేసినా మిగిలిన వారంతా ఫెయిల్ కావడంతో శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌ 4 వికెట్లతో రాణించగా, సాంట్నర్, ఇష్ సోది చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. టిమ్ సౌథీ, ఫెర్గ్యూసన్ చెరో వికెట్ తీశారు. శ్రీలంక బౌలర్లలో రజిత రెండు వికెట్లతో రాణించగా, తీక్షణ, హసరంగ, కుమార, ధనంజయ డి సెల్వ తలో వికెట్‌ తీశారు. సెంచరీతో అదరగొట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.

Updated Date - 2022-10-29T17:45:09+05:30 IST