Cheteshwar Pujara: తన కోసం సెలక్టర్లే దిగి వచ్చేలా చేశాడు.. యువ ఆటగాళ్లకు పుజారా ఓ ఉదాహరణ: కైఫ్

ABN , First Publish Date - 2022-12-13T16:41:08+05:30 IST

టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) తన కోసం సెలక్టర్లే దిగివచ్చేలా చేశాడని, యువ ఆటగాళ్లు

 Cheteshwar Pujara: తన కోసం సెలక్టర్లే దిగి వచ్చేలా చేశాడు.. యువ ఆటగాళ్లకు పుజారా ఓ ఉదాహరణ: కైఫ్
Chateswar Pujara

న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) తన కోసం సెలక్టర్లే దిగివచ్చేలా చేశాడని, యువ ఆటగాళ్లు అతడినో ఉదాహరణగా తీసుకోవాలని టీమిండియా మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) పేర్కొన్నాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న పుజారా ఈ ఏడాది మొదట్లో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌కు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత కసిగా ఆడి ఇటు దేశవాళీ క్రికెట్‌లోను, అటు కౌంటీ క్రికెట్‌లోను పరుగుల వరద పారించడంతో ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు (రీ షెడ్యూల్డ్) కోసం పుజారాకు మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. జట్టులో స్థానం కోల్పోయినా పుజారా ఆశలు ఎన్నడూ వదులుకోలేదని, పట్టుదలగా ఆడి మళ్లీ జట్టులో స్థానం సంపాదించాడని పేర్కొన్నాడు.

పుజారాను పక్కనపెట్టి సెలక్టర్లు తప్పు చేశారని కైఫ్ చెప్పుకొచ్చాడు. పుజారా తన ఆటతీరుతో సెలక్టర్లు సరెండర్ (దిగివచ్చేలా) చేశాడని అన్నాడు. సెలక్టర్లు పక్కనపెట్టాక పుజారా పరుగుల వరద పారించాడని, జట్టులో మళ్లీ స్థానం ఎలా సంపాదించాలన్న దానికి పుజారా ప్రత్యక్ష ఉదాహరణ అని కైఫ్ ప్రశంసించాడు. జట్టులో స్థానం కోల్పోయాక కౌంటీ క్రికెట్‌ ఆడాడని, నాలుగు రోజుల మ్యాచులు, వన్డే మ్యాచుల్లో సెంచరీలు సాధించాడన్నాడు. దీంతో సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు అందిందన్నాడు. అతడు తన ఆట తీరుతో సెలక్టర్లను సరెండర్ చేసుకున్నాడని పేర్కొన్నాడు.

పేసర్లు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ట్రాక్‌లపై దీటుగా బ్యాటింగ్ చేయగల పుజారా లాంటి బ్యాటర్లు ఇండియన్ టీమ్‌ (Team India)కు అవసరమని కైఫ్ పేర్కొన్నాడు. నైపుణ్యం అవసరమైన ఆటలో వయసు అనేది నంబరు మాత్రమేనని అన్నాడు. ఫుట్‌బాల్ లాంటి క్రీడల్లో అయితే అలుపెరగకుండా పరిగెడుతూ ఉండాలని పేర్కొన్న కైఫ్.. నిజానికి వయసు అనేది క్రికెట్‌లో ప్లస్సే అవుతుందన్నాడు. బోల్డంత అనుభవం వస్తుందని, దాంతో మరింతగా పరిణితి సాధించవచ్చన్నాడు. ఇందుకు పుజారా, కోహ్లీ, రోహిత్ శర్మ ఉదాహరణగా నిలుస్తారని అన్నాడు. టెస్టు క్రికెట్ అనేది నైపుణ్య ప్రధాన ఫార్మాట్ అని కైఫ్ వివరించాడు. ఇక్కడ రోజుల తరబడి ఆడాల్సి ఉంటుందని, అందుకు బోల్డంత అనుభవం కావాలని అన్నాడు.

కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. బొటన వేలి గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టుకు సారథ్యం వహించనుండగా, పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

Updated Date - 2022-12-13T16:41:09+05:30 IST