IND vs NZ: ఏం తిని వెళ్లావన్నా.. సెంచరీతో కుమ్మేసిన సూర్యా‘భాయ్’.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-11-20T14:28:28+05:30 IST

టీమిండియాకు ప్రస్తుతం అతనొక ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ఓపెనర్లు విఫలమైన ప్రతిసారి ఆ భారాన్నంతా తన భుజాన వేసుకుని టీమిండియాకు భారీ స్కోర్‌ను..

IND vs NZ: ఏం తిని వెళ్లావన్నా.. సెంచరీతో కుమ్మేసిన సూర్యా‘భాయ్’.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..

టీమిండియాకు ప్రస్తుతం అతనొక ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ఓపెనర్లు విఫలమైన ప్రతిసారి ఆ భారాన్నంతా తన భుజాన వేసుకుని టీమిండియాకు భారీ స్కోర్‌ను అందిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. సూర్యకుమార్ యాదవ్ అనే ఒక్కడు నిలబడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లపై సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీ20 కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. ఏడు సిక్స్‌లు, 11 ఫోర్లతో 51 బంతుల్లో 111 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా SKY పుణ్యాన మంచి స్కోరే చేసింది.

రిషబ్ పంత్ ఓపెనర్‌గా దిగి ఆరు పరుగులకే ఔట్ అయి నిరాశపరిచాడు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. టాస్ కూడా పడకుండానే తొలి టీ20 మ్యాచ్ కథ ముగించేసిన వర్షం రెండో టీ20 మ్యాచ్‌కు కూడా అంతరాయం కలిగించింది. ఒక వికెట్ నష్టానికి 6.4 ఓవర్లకు 50 పరుగులు చేసి క్రీజులో ఇషాన్ కిషన్(28), సూర్యకుమార్ యాదవ్(6) ఆడుతుండగా వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. కారు మేఘాలు కమ్ముకుని వర్షం కురుస్తుండంతో మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేశారు. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి సౌథీకి క్యాచ్‌గా చిక్కి 6 పరుగులకే వెనుదిరిగాడు.

పంత్ ఆటతీరుపై టీమిండియా అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 36 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ హార్థిక్ పాండ్యా చెరో 13 పరుగులకే చేతులెత్తేశారు. 20వ ఓవర్‌లో పరుగులు రాబట్టుకోవడంలో టీమిండియా పూర్తిగా విఫలమైంది. సౌథీ బౌలింగ్ చేసిన 20వ ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే సాధించి వరుస బంతుల్లో మూడు వికెట్లను కోల్పోయింది. మూడో బంతికి హార్థిక్ పాండ్యా, నాలుగో బంతికి దీపక్ హుడా, ఐదో బంతికి వాషింగ్టన్ సుందర్ ఔట్ కావడం గమనార్హం. సౌథీకి హ్యాట్రిక్ వికెట్లు దక్కాయి. ఫెర్గ్యూసన్ 2 వికెట్లు, ఇష్ సోధీ ఒక వికెట్ తీశారు. టీమిండియా 191 పరుగులు చేసినప్పటికీ న్యూజిలాండ్ జట్టును అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలెన్, కాన్వే కూడా నిలదొక్కుకున్నారంటే ఆ టార్గెట్‌ను ఫినిష్ చేసినా చేస్తారు. టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను కట్టడి చేస్తే టీమిండియాకు గెలుపు సునాయాసమవుతుంది.

Updated Date - 2022-11-20T14:28:56+05:30 IST