New Zealand vs Pakistan: కివీస్‌ను కట్టడి చేసిన పాక్ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే..
ABN , First Publish Date - 2022-11-09T15:36:30+05:30 IST
పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (Pakistan vs New Zealand) టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తొలి సెమీ ఫైనల్‌లో (Semi Final) న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో..
పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ (Pakistan vs New Zealand) టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తొలి సెమీ ఫైనల్‌లో (Semi Final) న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పాకిస్థాన్ (Pakistan) జట్టు ముందు 153 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఇది ఓ మోస్తరు లక్ష్యమేనని చెప్పక తప్పదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నంత కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్‌లో విలియమ్సన్ (Kane Williamson) జట్టు రాణించలేకపోయింది. పాక్ బౌలర్లు (Pak Bowlers) ఈ మ్యాచ్‌లో అదరగొట్టారు. కివీస్ బ్యాటింగ్‌ను (Kiwis Batting) కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్లు అలెన్, కాన్వే 4, 21 పరుగులకే చేతులెత్తేశారు. కాన్వే రనౌట్‌గా వెనుతిరగగా, షాహీన్ అఫ్రీదీ బౌలింగ్‌లో అలెన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ 46 పరుగులు, మిచెల్ 53 పరుగులతో రాణించారు. ఈ టోర్నీలో మంచి ఫామ్‌తో అదరగొట్టిన గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో మాత్రం 6 పరుగులకే ఔట్‌గా వెనుదిరగడం న్యూజిలాండ్ అభిమానులను నిరాశపరిచింది. మొత్తంగా చూసుకుంటే.. పాకిస్థాన్ బౌలర్లలో ఏ ఒక్కరూ బౌలింగ్ చేసిన నాలుగు ఓవర్లలో 33 పరుగులకు మించి పరుగులు రాకుండా కట్టడి చేశారు.
షాహీన్ అఫ్రీదీ రెండు వికెట్లతో రాణించాడు. ఈ రెండూ కీలక వికెట్లే కావడం గమనార్హం. మహ్మద్ నవాజ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్ బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయలేం. న్యూజిలాండ్ నిర్దేశించిన టార్గెట్ కూడా మరీ అంత తీసేసే విధంగా ఏం లేదు. పాక్ గెలవాలంటే 120 బంతుల్లో 153 పరుగులు చేయాలి. పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజమ్ రాణిస్తే ఈ టార్గెట్‌ను కొట్టడం పెద్ద కాని పనేం కాదు. అయితే.. ఈ ద్వయం ఎంత వరకూ రాణిస్తుందో సందేహమే.
ఈ వరల్డ్ కప్‌లో పాక్ సాధించిన విజయాల్లో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌లకు ఎలాంటి భాగస్వామ్యం లేకపోయింది. టీ20 ఫార్మాట్‌లో ఈ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లయినప్పటికీ ఫామ్ లేమితో ఒత్తిడిలో ఉన్నారు. బంగ్లాపై 128 పరుగుల ఛేదనలో కూడా విఫలమయ్యారు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో వారి బ్యాట్లు గర్జిస్తే మాత్రం కివీస్ బౌలర్లకు కష్టకాలమే. మిడిలార్డర్‌లో ఇఫ్తికార్, షాన్ మసూద్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. పాక్ మాదిరే కివీస్ బౌలర్లు కూడా ప్రత్యర్థి జట్లపై చెలరేగుతున్నారు. ఇదే మైదానంలో ఆసీస్, శ్రీలంక టాపార్డర్‌ను పేసర్లు బౌల్ట్, సౌథీ కుప్పకూల్చి జట్టుకు సునాయాస విజయాలనందించారు. ఇదే తరహాలో ఫామ్‌లో లేని పాక్ ఓపెనర్లను దెబ్బతీసి ఆదిలోనే ఒత్తిడిలోకి నెట్టాలనుకుంటున్నారు. లోకీ ఫెర్గూసన్ కూడా పదునైన బంతులతో వికెట్ల వేట కోసం ఎదురుచూస్తున్నాడు.