BAN vs IND: క్రికెట్ మజా చూపించిన ‘బంగ్లాదేశ్’ బ్యాటింగ్.. టీమిండియా ముందు తక్కువ టార్గెట్ ఏం లేదుగా..!

ABN , First Publish Date - 2022-12-07T16:17:33+05:30 IST

టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మహ్ముదుల్లా, మెహిదీ హసన్‌ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు. మెహిదీ హసన్ టీమిండియా బౌలర్లకు..

BAN vs IND: క్రికెట్ మజా చూపించిన ‘బంగ్లాదేశ్’ బ్యాటింగ్.. టీమిండియా ముందు తక్కువ టార్గెట్ ఏం లేదుగా..!

ఢాకా: టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మహ్ముదుల్లా, మెహిదీ హసన్‌ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు. మెహిదీ హసన్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ODI కెరీర్‌లోనే తొలి సెంచరీ నమోదు చేశాడు. 83 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, 8 ఫోర్లతో 100 పరుగులతో సత్తా చాటాడు. మహ్ముదుల్లా 77 పరుగులతో రాణించాడు. ఆరంభంలో అదరగొట్టిన భారత బౌలర్లు ఆరో వికెట్ తర్వాత నుంచి మాత్రం పేలవ బౌలింగ్‌తో నిరాశపరిచారు. బంగ్లాదేశ్ 69 పరుగులు చేసే సమయానికి 6 వికెట్లను కోల్పోగా.. ఆ తర్వాత ఏడో వికెట్ పడే సమయానికి 217 పరుగులు చేసింది.

మహ్ముదుల్లా, మెహిదీ హసన్ కలిసి 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 69 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ జట్టు 150 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని టీమిండియా అభిమానులు భావించారు. కానీ.. బంగ్లా బ్యాటింగ్ అనూహ్యంగా పుంజుకుని 271 పరుగులు చేసి టీమిండియాకు పెద్ద సవాలే విసిరింది. ఒక్క వికెట్ పడగొట్టడానికి దాదాపు 150 పరుగులు సమర్పించుకున్న టీమిండియా బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. తొలి వన్డేలో కూడా 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న బంగ్లాదేశ్ ఒక్క వికెట్ తేడాతో టీమిండియాపై గెలిచి సత్తా చాటింది.

టీమిండియాకు జీర్ణించుకోలేని ఓటమిని మిగిల్చింది. రెండో వన్డేలో కూడా బంగ్లాదేశ్ ఓపెనర్లు ఫెయిల్ అయినప్పటికీ మిడిలార్డర్ రాణించింది. టీమిండియా తొలి వన్డేలో 186 పరుగులకే కుప్పకూలింది. రెండో వన్డేలో ఓపెనర్లు రాణిస్తే కానీ 272 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేమని చెప్పక తప్పదు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 73 పరుగులు సమర్పించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 10 ఓవర్లకు 37 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లతో రాణించాడు. ఉమ్రాన్ మాలిక్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 58 పరుగులు ఇచ్చుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే.. టీమిండియా బౌలింగ్ మాత్రం కలవరపెడుతోంది. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారనుకునేలోపే అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఒక్క వికెట్ తీయడానికి నానా తంటాలు పడుతున్నారు. రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ.. ఈ ముగ్గురూ రాణిస్తేనే టీమిండియాను గెలుపు వరిస్తుంది.

Updated Date - 2022-12-07T16:18:32+05:30 IST