Discrimination: గర్భం దాల్చానని చెప్పగానే మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన కంపెనీ.. చివరకు..

ABN , First Publish Date - 2022-12-30T17:34:12+05:30 IST

ప్రకృతి సహజమైన నెలసరి, గర్భధారణ విషయంలో సంస్థలు మహిళ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి. లేని పక్షంలో ఇదిగో ఈ కంపెనీ లాగే ఎప్పుడో ఒకప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదు.

Discrimination: గర్భం దాల్చానని చెప్పగానే మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన కంపెనీ.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి సహజమైన నెలసరి, గర్భధారణ విషయంలో సంస్థలు మహిళా ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా నడుచుకోవాలి. లేని పక్షంలో ఇదిగో ఈ కంపెనీ లాగే ఎప్పుడో ఒకప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదు. గర్భం దాల్చిన ఉద్యోగినిని సాంకేతిక కారణాలతో విధుల నుంచి తొలగించిన(Sacked) ఓ కంపెనీపై కోర్టు ఏకంగా 15 లక్షల జరిమానా విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంగ్లాండ్‌లో(England) ఎసెక్స్ ప్రాంతంలోగల(Essex) ఓ సెక్యూరిటీ ఉత్పత్తుల సంస్థలో షార్లెట్ లీస్ట్(34) 2021 ఆగస్ట్‌లో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా చేరింది. ఆ తరువాత కొంత కాలానికి ఆమె గర్భం(Pregnancy) దాల్చడంతో ఆ విషయాన్ని మహిళా మేనేజర్‌కు తెలిపింది. గతంలో తనకు ఎనిమిది సార్లు గర్భస్రావం జరిగిందని, ఈ మారు కూడా అలా జరుగుతుందేమో అని టెన్షన్‌గా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అయితే.. ఆమె మేనేజర్ మాత్రం షార్లెట్(Charlotte Leitch) ఉద్యోగ ఒప్పంద పత్రంపై అప్పటికి ఇంకా సంతకం చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. ఒప్పందంలో ఉన్న అంశాలపై అభ్యంతరాల కారణంగా గతంలో షార్లెట్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయకపోవడాన్ని గుర్తు చేసింది. ఫలితంగా.. షార్లెట్‌కు సంస్థ ఉద్యోగిగా అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేసిన ఆమె..మాతృత్వ సెలవులు మంజూరు చేయడం కుదరదని చెప్పింది. ఆ రోజు సాయంత్రం లేదా ఆ మరుసటి రోజో ఉద్యోగాన్ని వీడాలంటూ డెడ్‌లైన్ విధించింది.

మరుసటి రోజు షార్లె్ట్ తన మేనేజర్‌కు, కంపెనీ డైరెక్టర్‌కు ఈ మెయిల్ చేసింది. ఆ సమావేశం తరువాత తాను ఎంతో వేదనకు గురయ్యానని, తన కడుపులోని బిడ్డకు అసలు విలువేలేదన్న భావన కలిగిందని చెప్పుకొచ్చింది. తాను వివక్షకు గురయ్యాయని(Discrimination), సంస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని హెచ్ ఆర్ వమ్ము చేసిందని ఈ మెయిల్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తరువాత.. షార్లెట్‌ను తొలగిస్తున్నట్టు కంపెనీ మరో ఈమెయిల్‌లో తేల్చి చెప్పింది. ఒప్పంద పత్రంపై సంతకం చేయనందుకు షార్లెట్‌ను తొలగించాలని అంతకుమునుపే నిర్ణయం తీసుకున్నట్టు తేల్చింది. దీంతో.. షార్లెట్ కోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువడింది. ప్రెగ్నెన్సీకి సంబంధించి కారణాలతో సంస్థ షార్లెట్‌ను విధుల నుంచి తొలగించినట్టు కోర్టు నిర్ధారించింది. ఇందుకు పరిహారంగా కంపెనీ ఆమెకు 15 వేల పౌండ్ల(రూ. 15 లక్షలు) పరిహారం(Compensation) చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.

Updated Date - 2022-12-30T17:41:37+05:30 IST