Savitri Birth Anniversary: అదే సావిత్రికి మొదటి ఎదురుదెబ్బ.. చివరి రోజుల్లో ఇల్లు, ఆస్తులను ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందంటే..

ABN , First Publish Date - 2022-12-06T17:42:55+05:30 IST

‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు’ అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత మహానటి సావిత్రికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె ఉత్ధానంలో అన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలున్నాయి. ..

Savitri Birth Anniversary: అదే సావిత్రికి మొదటి ఎదురుదెబ్బ.. చివరి రోజుల్లో ఇల్లు, ఆస్తులను ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందంటే..
Savitri

(మరపురాని సుందర స్వప్నం మహానటి సావిత్రి జయంతి నేడు)

savitri22.jpg

‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు’ అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత మహానటి సావిత్రికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె ఉత్ధానంలో అన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలున్నాయి.

కొమ్మారెడ్డి సావిత్రి 1935లో డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరులో పుట్టారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, గురవయ్య. తండ్రిగారు సావిత్రి పుట్టిన ఆరు నెలలకే చనిపోయారు. దాంతో పెద్దమ్మ దుర్గాంబ, పెదనాన్న వెంకటరామయ్యల వద్ద విజయవాడలో పెరిగింది. చిన్నప్పటి నుంచి నాట్యంమీద, నటన మీద ఆసక్తి ఏర్పడడంతో ఆమె చదువు ఎనిమిదవ తరగతి వరకే సాగింది. సావిత్రికి అప్పట్లోనే అంజలీదేవి అంటే అభిమానం. 1948లో వచ్చిన ‘బాలరాజు’ చిత్రంలో అంజలీదేవి ‘తీయని వెన్నెలరేయి’ పాటకు చేసిన నాట్యంఆమెకు ఎంతగా నచ్చిందంటే, తను ఇచ్చే నాట్య ప్రదర్శనల్లో ఆ పాటను తప్పనిసరిగా అభినయించి, అందరి మెప్పు పొందుతూ ఉండేది.

విజయవాడలో కళాభిమాని సుంకర కనకారావుగారి ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ నాట్యమండలి వారి సాంస్కృతిక ప్రదర్శనల్లో సావిత్రి రెగ్యులర్గా పాల్గొంటూ ఉండేది. అప్పట్లో ప్రముఖ నటుడు జగ్గయ్యగారు తమబృందంతో పాటు సావిత్రిని కూడా కాకినాడలో జరిగిన అఖిల భారత నృత్య నాటిక పోటీలకు తీసుకెళ్లారు. 1948లో జరిగిన ఆ పోటీలకు ప్రసిద్ధ హిందీ నటులు పృధ్వీరాజ్ కపూర్ ముఖ్య అతిథిగా హాజరై సావిత్రికి బహుమతి ప్రదానం చేస్తూ ఆమెను మెచ్చుకోవడం కళాకారిణిగా తన జీవితంలోని ప్రధాన ఘట్టంగా భావించే వారు సావిత్రి.

savitri4.jpg

తిరస్కార ఘట్టాలు

నాటకాల్లో నటిస్తున్న వారు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆరోజుల్లో సావిత్రిని కూడా సినిమాల్లో నటింప చేయాలని ఆమె పెదనాన్న మద్రాసు తీసుకెళ్లారు. జెమిని స్టూడియో వారు ఆరోజుల్లో ముమ్మరంగా సినిమాలు తీస్తూ కొత్తవారిని ఎంపికచేస్తూ ఉండేవారు. సావిత్రి పెదనాన్న ఆమెను అక్కడికి తీసుకు వెళ్లారు. అక్కడ కేస్టింగ్ విభాగం (నటీనటులను ఎంపిక చేసే శాఖ)లో జెమిని గణేశన్ ముఖ్యుడు. సావిత్రి జెమిని గణేశన్ను మొట్టమొదటిసారిగా చూసింది అక్కడే. (అతనే ఆ తర్వాత తన జీవితంలో ప్రవేశించి, పతనానికి ముఖ్య కారకుడవుతాడని ఆమెకు తెలియదు!) జెమిని గణేశన్ ఆమెను చూసి, సినిమాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయని ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడాడు. అయితే తనకు చూపిన ఫొటోలు బాగాలేవని, మద్రాసులో ఆర్.ఎన్. నాగరాజారావు అనే స్టిల్ ఫొటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లి ఫొటోలు తీయించుకుని బాగా వచ్చిన ఫొటోల వెనక అడ్రసు రాయించి, నిర్మాణ సంస్ధలకు ఇవ్వవలసిందిగా తగిన సూచనలు చెప్పి పంపించాడు గణేశన్. అతను చెప్పిన ప్రకారం సావిత్రి - ఆర్.ఎన్. నాగరాజారావు వద్దకు వెళ్లి ఫొటోలు తీయించుకుని, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది.

‘అగ్నిపరీక్ష’ అనే సినిమా నిర్మాతలు ఆ చిత్రంలోని ఓ వ్యాంప్ పాత్రకు సావిత్రిని చూసి, ఆ పాత్ర పోషణకు ఆమె వయసు సరిపోదని పంపించి వేశారు. అయితే తర్వాతా చిత్ర నిర్మాణమూ కొనసాగలేదు. అది వేరే కథ.

1950లో సాధనా ఫిలింస్వారి ‘సంసారం’ చిత్రంలో నటించే అవకాశం సావిత్రికి లభించింది. అది ఎన్టిఆర్, అక్కినేని కలిసి నటించిన తొలి చిత్రం. నాగేశ్వరరావు తొలిసారి సాంఘిక చిత్రంలో హీరోగా పరిచయం కావడం ఆ చిత్రంతోనే. ఈ నేపథ్యంలో ఆయన సరసన నటించే అవకాశం సావిత్రికి రావడం విశేషమే. కానీ దురదృష్టం ఏమిటంటే తొలిసారి ఆమె కెమెరా ముందు నిలబడి, చుట్టూ జనం అందరూ చూస్తూ ఉండగా, నటించడం అనేసరికి ఆమె కంగారుపడిపోయింది. బిగుసుకుపోతూ, డైలాగ్ చెబుతూ ఉండేసరికి నటనలో సహజత్వం కనిపించడం లేదని చిరాకుపడ్డారు దర్శకులు ఎల్.వి. ప్రసాద్. ఆ సినిమాలోనే సావిత్రికి స్నేహితురాళ్లుగా కొందరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్లలో పుష్పలత అనే అమ్మాయి హుషారుగా ఉంటూ, చలాకీగా డైలాగులు చెబుతూ ఉంది. దాంతో ఆమెను అక్కినేనికి జంటగా ఎంపికచేసి, సావిత్రిని స్నేహితురాళ్లలో ఒకరిగా మార్చేశారు. ఆ సినిమాలో ‘టకుటకు బండి టమకుల బండి’ అనే పాటలో అలా సావిత్రి కనిపిస్తారు. అలాగే అక్కినేనితో ‘అచ్చం నాగేశ్వరరావులా ఉన్నావే’ అని సావిత్రి ఒకే ఒక డైలాగు చెబుతుంది. ఆవిధంగా ఆ చిత్రం ఆమెకు ఓ చేదు/ తీపి అనుభవాన్ని మిగిల్చింది. తిరస్కారానికి గురికావడం చేదు అనుభవమైతే, ఆ సినిమా ఛాన్స్ దక్కడం ఆమెలో పట్టుదల రేకెత్తించడం తీపి అనుభవం. తనకు అక్కినేని సరసన నాయికగా నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం సావిత్రికి ఎంతో ఉక్రోషాన్ని కలిగించింది. కొన్నిరోజులపాటు ఒంటరిగా ఏడుస్తూ కూర్చునేది. ఆ తర్వాత తనేమిటో నిరూపించుకోవాలనే తపన మొదలైంది. అద్దం ముందు గంటల తరబడి కూర్చుని చలాకీగా డైలాగులు చెప్పడం, భావోద్వేగాలను అభినయించడం ప్రాక్టీసు చేసేది.

కొన్నాళ్ల తర్వాత ‘పాతాళ భైరవి’ (1951)లో ఓ నాట్యానికి సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి, సావిత్రి వాహినీ స్టూడియోకు వెళ్లి అక్కడ దర్శకుడు కె.వి. రెడ్డి గారిని కలుసుకుంది. ఇప్పటి ధోరణిలో చెప్పాలంటే ఆ పాట ఓ ఐటమ్ సాంగ్ నేను రానంటే రాను అని ప్రారంభమయ్యే ఆ పాటలో నర్తించడానికి సావిత్రి ఎంపికైంది. ఆ చిత్రం విడుదలైన తర్వాత ఆ నాట్య సన్నివేశంలో ‘ఎవరీ మెరుపుతీగ’ అన్నట్లుగా ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. 1951లోనే ‘రూపవతి’అనే చిత్రంలో సావిత్రి వ్యాంప్గా నటించింది. కానీ ఆ చిత్రం అపజయం పాలైంది.

savitri.jpg

జయాపజయాలు

తొలిరోజుల్లో సావిత్రి అవకాశాల కోసం విశేషంగా ప్రయత్నాలు చేస్తూవచ్చారు. విజయావారు ఎన్టీఆర్ హీరోగా ‘పెళ్లిచేసి చూడు’ తీస్తున్నారని తెలిసి, గతంలో ఆమె ‘పాతాళ భైరవి’లో నృత్య సన్నివేశంలో నటించడాన్ని గుర్తుచేస్తూ మరో అవకాశాన్ని కోరారు. గమ్మత్తేమిటంటే ‘పెళ్లిచేసి చూడు’ చిత్రానికి దర్శకుడు అంతకు ముందు ఆమెను ‘సంసారం’లో రిజెక్ట్ చేసిన ఎల్వి ప్రసాద్గారే. అయితే ఈసారి ఆయన కఠినంగా వ్యవహరించలేదు. ఆ చిత్రంలో ఉప కథానాయిక వేషం ఇచ్చి సావిత్రిని ప్రోత్సహించారు. ఈ చిత్రం తమిళంలో కూడా ‘కల్యాణం పణ్గిపార్’ పేరుతో తయారవడం వల్ల సావిత్రి తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.

అప్పట్లోనే ‘ఆదర్శం’, తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘పల్లెటూరు’, త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో ‘ప్రియురాలు’, వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘శాంతి’, సి.పుల్లయ్యగారి దర్శకత్వంలో ‘సంక్రాంతి’ చిత్రాల్లో నటించినా అవి సావిత్రికి అంతగా పేరు తీసుకురాలేదు. 1953లో సావిత్రి చలనచిత్ర జీవితంలో మంచి మలుపు తీసుకొచ్చిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి వినోదా వారి ‘దేవదాసు’. మొదట ఆ చిత్రంలో పార్వతి పాత్రకు షావుకారు జానకి ఎంపికయ్యారు. కానీ చివరి నిమిషంలో ఆమెను తొలగించి ఆ పాత్రకు సావిత్రిని ఎన్నుకున్నారు. ఆ చిత్రం తమిళ వెర్షన్లోనూ సావిత్రే నటించారు. భవిష్యత్లో మహానటి అనిపించుకోవడానికి పునాది అనదగ్గ చిత్రంగా ‘దేవదాసు’ రూపొందింది. ఒకనాడు ఏ హీరో సరసన తాను నాయికగా నటించడానికి వీలు కాలేదో, అదే హీరో సరసన ఆమె ‘దేవదాసు’, ‘బతుకుతెరువు’ చిత్రాల్లో నటించి చిత్రసీమ దృష్టి తనవైపు మళ్లేలా చేసుకున్నారు సావిత్రి. ఈ సంవత్సరంలోనే ఆమె కాంతారావు సరసన జానపద చిత్రం ‘ప్రతిజ్ఞ’లో నాయికగా నటించి రాణించారు.

actor-savitri.jpg

సావిత్రి జీవితంలో జెమిని గణేశన్

‘మనం పోలెమాంగల్యం’ అనే తమిళ చిత్రంలో సావిత్రి కథానాయిక. ఆ చిత్రంలో హీరో ఎవరో కాదు - సావిత్రి తొలిరోజుల్లో మద్రాసు వచ్చినపుడు జెమిని స్టూడియోలో తనతో ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడిన ఆ యువకుడే జెమిని గణేశన్. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరోజుల్లో సావిత్రి మనో స్ధితి స్థిమితంగా లేదనే చెప్పాలి. సినిమాల్లో తనకు సంబంధించిన లావాదేవీలు, డేట్లు తదితర వ్యవహారాల్లో పెద్దమ్మ, పెదనాన్నల ధోరణి రానురాను ఇబ్బందికరంగా పరిణమించడం మొదలైంది. తల్లిగారికైతే ఈ వ్యవహార పరిజ్ఞానం బొత్తిగా లేదు. అలాంటి పరిస్ధితుల్లో తన భవిష్యత్ను సజావుగా నడిపించుకోకపోతే, కెరీర్ ఏమవుతుందోననే కలవరం ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయంలో జెమిని గణేశన్ దగ్గరై ఆమెను జీవిత భాగస్వామిగా స్వీకరిస్తాననేసరికి ఆమె ముందు వెనక ఆలోచించ లేదు. అప్పటికే అతనికి పెళ్లయిందని, పిల్లలు ఉన్నారని రెండవ భార్యగా నటి పుష్పవల్లి (హిందీ నటి రేఖ తల్లి) ఉందని తెలిసి కూడా అతనికి మూడవ భార్యగా జీవితం సాగించడానికి సిద్ధపడ్డారు సావిత్రి. అయితే ఆ నిర్ణయమే ఆ తర్వాత కొంతకాలానికి ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేయగలదని ఆమె ఊహించలేక పోయింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి తమ వివాహాన్ని కొంతకాలం పాటు రహస్యంగా ఉంచాలని అనుకున్నారు సావిత్రి.

savitri4.jpg

పరభాషల్లో విజయాలు

తొలిరోజుల్లో సావిత్రి తమిళ ఉచ్ఛారణను జెమిని గణేశన్ ఎగతాళి చేసేవారు. దాంతో ఆమె ఒక ట్యూటర్ను పెట్టుకుని, సీరియస్గా తమిళం నేర్చుకుని ఆ భాషలో మంచి పట్టు సాధించారు.

సావిత్రి నటించిన చాలా చిత్రాలు తమిళంలో కూడా తయారయ్యేవి. ఉదాహరణకు 1955లో వచ్చిన ‘మిస్సమ్మ’. ఆ చిత్రంలో మొదట భానుమతి కధానాయికే అయినా చక్రపాణితో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఆమెను ఆ చిత్రం నుంచి తొలగించి సావిత్రిని ఆ పాత్రకు ఎంపికచేశారు. ‘సంసారం’లో సావిత్రిని తొలగించిన ఆ ఎల్వి ప్రసాద్గారే ఆమెను ‘మిస్సమ్మ’ తెలుగు తమిళ భాషల్లో డైరెక్ట్ చేశారు.

పాత్రలో వైవిధ్యం ఉంటే అది నెగటివ్ ధోరణి పాత్ర అయినా ఆమె అంగీకరించడానికి వెనకాడే వారు కాదు. అందుకు ఉదాహరణగా ఎన్టిఆర్ నటించిన ‘చంద్రహారం’, ఎఎన్ఆర్ నటించిన ‘వదిన’ చిత్రాల్లో ఆమె ధరించిన వ్యాంప్ పాత్రలు. అలాగే ‘కన్యాశుల్కం’ చిత్రంలో ఆమె మధురవాణి పాత్ర ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘చంద్రహారం’, ‘వదిన’ తమిల వెర్షన్స్లోనూ సావిత్రి నటించారు.

‘అర్ధాంగి’, ‘దొంగరాముడు’, ‘భలేరాముడు’, ‘చరణదాసి’ ‘తోడికోడళ్లు’, ‘మాయాబజార్’, ‘మాంగల్యబలం’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘నమ్మినబంటు’, ‘వెంకటేశ్వర మహత్యం’, ‘చివరకు మిగిలేది’, ‘వెలుగు నీడలు’, ‘కలసిఉంటే కలదు సుఖం’, ‘ఆరాధన’, ‘మంచి మనసులు’, గుండమ్మకథ, రక్తసంబంధం, ఆత్మబంధువు, చదువుకున్న అమ్మాయిలు, నర్తనశాల, మూగమనసులు, డా. చక్రవర్తి, దేవత, మనుషులు మమతలు, శ్రీకృష్ణ పాండవీయం, నవరాత్రి, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, మరో ప్రపంచం, కోడలు దిద్దిన కాపురం, దేశోద్ధారకుడు మొదలైన చిత్రాల్లో సావిత్రి భిన్న విభిన్నమైన పాత్రలు ధరించి ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు. వీటిలో పారితోషికం ప్రమేయం లేకుండా విభిన్న తరహా చిత్రం కావడం వల్ల తక్కువ పారితోషికంతో నటించిన ‘చివరకు మిగిలేద’, ‘మరో ప్రపంచం’, ‘తీర్పు’ వంటివి ఉన్నాయి. ఎన్నో చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించినా, తనకు నచ్చిన చిత్రాలనేసరికి ప్రధమ తాంబూలం జి.రామినీడు తీసిన ‘చివరకు మిగిలేది’కి ఇచ్చేవారు సావిత్రి. అలాగే తన అభిమాన నటీమణులుగా అంజలీదేవి, నర్గీస్, మీనాకుమారిలను ఆమె పేర్కొనేవారు. పైన పేర్కొన్న చిత్రాల్లో చాలా చిత్రాలు తమిళంలో తీసినప్పుడు కధానాయికగా సావిత్రి నటించారు. తమిళ ప్రేక్షకులు చాలా మంది నేటికీ సావిత్రి తమిళ నటీమణి అనే అనుకుంటారు.

savitri3.jpg

అగ్ర తమిళ హీరోలతో సావిత్రి

తమిళంలో ప్రసిద్ధులైన శివాజీగణేశన్, ఎంజిఆర్, జెమిని గణేశన్ వంటి హీరోలతో ఎ.భీమ్సింగ్, బిఆర్ పంతులు, ఎంవి రామన్, ఎపి నాగరాజన్, కెఎస్ గోపాలకృష్ణన్, దాదా వరాసి, ఆర్.సుందరం, ఎస్పి ముత్తురామన్ వంటి డైరెక్టర్ల దర్శకత్వంలో నటించారు. ప్రముఖ హాస్యనటుడు చంద్రబాబు ప్రయోగాత్మకంగా తీసిన తమిళచిత్రం ‘తట్టుంగళ్ తిరక్కపడుమ్’ (తట్టండి.. తలుపు తెరుచుకుంటుంది అని అర్ధం) లో కూడా నటించి ప్రయోగాలకు తానెప్పుడూ సుముఖమే అని నిరూపించుకున్నారు.

హిందీలో కూడా సావిత్రి ‘బహుత్ దిన్ హుయే’, సితారోంసో ఆగే, ఘర్ బసాకే దేఖో, గంగాకి లహరే (ధర్మేంద్ర హీరో), ‘బలరామకృష్ణ’ వంటి చిత్రాల్లో నటించారు. కన్నడంలో మూడు, మలయాళంలో రెండు చిత్రాల్లోనూ నటించారు. ఆమె అన్ని భాషల్లోనూ కలిపి సుమారు 300 చిత్రాల్లో నటించి ఉంటుందని ఓ అంచనా.

SAVITRI5.jpg

పతనావస్ధ ఎలా మొదలైంది?

జెమిని గణేశన్తో పెళ్లయిన నాలుగు సంవత్సరాల తర్వాతే ఆ విషయాన్ని బహిరంగ పరిచారు. 1958 డిసెంబర్ 2న ఆమెకు విజయ చాముండేశ్వరి పుట్టారు. 1965లో కుమారుడు సతీష్కుమార్ పుట్టాడు. 1958 నాటికే ఆమె ఉచ్ఛదశలో ఉండడంతో మద్రాసులోని టి.నగర్లో సొంత ఇల్లు, విశాలమైన భవంతిని కట్టుకున్నారు. ఆమెకు రేసుకోర్సులకు వెల్లే అలవాటు ఉందనే వారు. ఖరీదైన బంగారు ఆభరణాలను కొనుక్కోవడం ఆమెకున్న సరదాల్లో ఒకటి. ఒకవిధంగా అప్పట్లో ఆమె విలాసవంతమైన జీవితం గడిపేవారు.

జెమిని గణేశన్ ఆమెకు సరదాగా మద్యం తీసుకునే అలవాటు చేశాడని అప్పట్లో చిత్రపరిశ్రమలో చెప్పుకునేవారు. నిజానికి కొందరు నటీమణులకు ఆ అలవాటు ఉన్నా, అది కెరీర్ను దెబ్బతీసేంత తీవ్రంగా ఉన్న దాఖలాలు లేవు.

1968లో అందరూ మహిళలే కలిసి ఒక సినిమా తీయాలని ప్లాన్ చేసినప్పుడు ఆ సినిమాని డైరెక్ట్ చేయవలసిందిగా సావిత్రిని కోరారు. చివరికి ఆ సినిమా బాధ్యత అంతా ఆమె నెత్తిమీదే పడేసరికి, ఆ లావాదేవీల్లో నష్టపోవడం ఆమెకు మొట్టమొదట తగిలిన ఎదురుదెబ్బ. ఆ చిత్రమే ‘చిన్నారిపాపలు’. ఈ చిత్రంలో సావిత్రితోపాటు షావుకారు జానకి, జమున, జగ్గయ్య మున్నగు వారు నటించారు.

అప్పటికే సావిత్రి లావాదేవీల్లో అజమాయిషీ చేసే జెమిని గణేశన్ ఆమె దర్శకత్వం వహించడం, నిర్మాణ బాధ్యతలు స్వీకరించడం వంటి పనులు ఇష్టం ఉండేవి కావు. బహుశా ఇలాంటి విషయాల్లో ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి ఉండడం వల్ల కాబోలు 1969లో ఇద్దరూ విడిపోయారు. 1970లో సావిత్రి తల్లిగారు కాలధర్మం చెందారు. అది సావిత్రిని మానసికంగా మరింత క్రుంగదీసింది. 71లో సావిత్రి చేసిన మరో పెద్ద పొరపాటు ‘మూగమనసులు’ చిత్రాన్ని తమిళంలో ‘ప్రాప్తం’పేరుతో నిర్మించడం. అది పెద్ద ఫ్లాప్ కావడంతో చాలా డబ్బు నష్టపోయి, ఇల్లు, కొన్ని ఆస్తులూ అమ్మేయాల్సి వచ్చింది.

SAVITRI6.jpg

ఇలా దెబ్బమీద దెబ్బ తగులుతూ ఉంటే, ఆమె ఆ విచారాన్ని మరచిపోవడానికి మద్యానికి దాసురాలు కావడం, ఆహార నియమాలేవీ సరిగా పాటించక పోవడంతో బాగా లావైపోయి, ఆమెకు కారెక్టర్ రోల్స్ కూడా తగ్గిపోవడం జరుగుతూ వచ్చింది.

‘నిండైన విగ్రహం/ నటనలో నిగ్రహం/ అభినేత్రి సావిత్రి / రాజ్ఞి సినీధాత్రి’ అనిపించుకున్న సావిత్రి క్రమ క్రమంగా దుస్ధితికి చేరువ అవుతూ వచ్చారు. దానికితోడు ఇన్కమ్ టాక్స్ లీగల్ సమస్యలు వంటివి అదనంగా తోడయ్యాయి. ఆమెను ఆదుకునే వారు కరవయ్యారు. అయినా సినిమాల్లో నటిస్తూ సమస్యల నుంచి బయటపడడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించారు. అయినా మద్యం తీసుకోకపోతే ఉండలేని పరిస్ధితి, తీసుకుంటే డైలాగులు చెప్పలేని పరిస్ధితి.. అందరూ ఆమెను చూసి జాలిపడడం ఆమెకు మరింత దారుణంగా అనిపించేది.

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే!

అదీ చివరి రోజుల్లో సావిత్రి జీవితం. 18 నెలలు కోమాలో ఉన్న తర్వాత పరిస్ధితి మరింత క్షీణించింది. 1981లో డిసెంబర్ 26న మద్రాసులోని లేడీ వెల్లింగ్టన్ నర్సింగ్ హోమ్లో 46 ఏళ్లకే సావిత్రికి నూరేళ్లు నిండాయి.

సావిత్రి నటనా ప్రతిభ ఆమె నటించిన సినిమాల్లోని హావభావాలు, చూపిన వైరుధ్యాలు, వర్ధమాన కళాకారులకు పాఠ్యాంశాల్లాంటివి. ఆమె జీవితాన్ని అనుసరించిన తీరును చూస్తే, క్రమశిక్షణ, దూరదృష్టి, శక్తియుక్తులు లోపించినప్పుడు పతనం ఎలా చేరువ అవుతుందో చెప్పే పాఠంగా అనిపిస్తుంది. ఏది ఎలా ఉన్నా అందరూ అధ్యయనం చేయవలసిన కథ - సావిత్రి జీవితం.

BK-ESWAR.jpg

- బి.కె. ఈశ్వర్

(సీనియర్ సినీ పాత్రికేయులు, రచయిత)

Updated Date - 2022-12-06T19:37:10+05:30 IST