Mangalampalli Balamuralikrishna: రైల్లో మంగళంపల్లికి షాకింగ్ అనుభవం.. నువ్వెవరైతే నాకేంటంటూ సీట్లోంచి లేపి..

ABN , First Publish Date - 2022-11-22T12:08:16+05:30 IST

ఆ పెళ్ళిలో మంగళంపల్లి వారు కచేరీ కూడా చేసారు. ఆ తరువాత మమత హోటల్ లో కాసేపు గడిపి రాత్రి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ కు వెళ్ళారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్లాటు ఫారం మీద సిద్ధంగా వుంది. ఆ ట్రైను టీసీ మంగళంపల్లివారిని చూడగానే గుర్తుపట్టి..

Mangalampalli Balamuralikrishna: రైల్లో మంగళంపల్లికి షాకింగ్ అనుభవం.. నువ్వెవరైతే నాకేంటంటూ సీట్లోంచి లేపి..

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కొన్ని జ్ఞాపకాలు: ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

(నవంబరు 22 మంగళంపల్లి వారి వర్ధంతి)

మంగళంపల్లి వారు మంచి స్నేహశీలి. బెజవాడతో వారికి మంచి అనుబంధం. ఈ రెంటినీ తెలియచెప్పడానికే ఈ చిరు ప్రయత్నం.

మూడుపదుల వయస్సు దాటేవరకూ బాలమురళీ కృష్ణ బెజవాడ సత్యనారాయణపురంలోని తన సొంత ఇంట్లోనే వుండేవారు. వారి తండ్రి పట్టాభి రామయ్య గారు కట్టించిన ఇల్లది. మద్రాసులో స్థిరపడి, సంగీతంలో ఖండాంతర ఖ్యాతి పొందిన తరువాత కూడా ఆయన బెజవాడలోని తన ఇంటిని అట్టే పెట్టుకోవడం ఆ వూరు మీద ఆయనకున్న మమకారాన్ని తెలియచేస్తుంది. ఒకసారి విజయవాడ పురపాలక సంఘం వాళ్ళు మంగళంపల్లివారికి పౌర సన్మానం చేసారు. ఆయన ఇల్లు వున్న వీధికి ‘మంగళంపల్లి వీధి’ అని పేరు పెడుతూ సంఘం చేసిన తీర్మానాన్ని ఆ సభలో చదివి వినిపించారు.

మంగళంపల్లి వారు చాలాయేళ్ళు బెజవాడ రేడియో స్టేషన్లో సంగీత ప్రయోక్తగా పనిచేసారు. అలాగే బెజవాడలో ఏర్పాటు చేసిన సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్ కూడా మంగళంపల్లివారే. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆయన మద్రాసుకు మకాం మార్చారు.

ఒకసారి బెజవాడ వచ్చి కచేరీ చేశారు. ఆయన అరవ కీర్తనలు పాడడం ఒకాయనకు నచ్చలేదు. ఆ సంగతి మంగళంపల్లివారి చెవిన పడింది. ఇక ఆ రోజు పూనకం పట్టినట్టు వర్ణం నుంచి మంగళం వరకు (కచేరీ మొదలు అయిన దగ్గరి నుంచి చివరి వరకు) తమిళ కీర్తనలే పాడి కచేరీ ముగించారు. తమిళులకి సంగీతం పట్ల యెనలేని గౌరవం వుందని, తనకు ఇన్ని పేరుప్రఖ్యాతులు రావడంలో తమిళ అభిమానుల పాత్ర వుందని చెబుతుండేవారు. అసలు సిసలు సంగీతం కావేరీ ఒడ్డునే ఉందనే వారు.

వారి గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. బెజవాడ గాంధీ నగరంలో నవయుగ ఫిలిమ్స్, అద్దంకి శ్రీరామమూర్తి ఇంటి దగ్గరలో పంతులుగారి నివాసం. బాలమురళీకృష్ణ అక్కడ వుండే సంగీతం నేర్చుకున్నారు. వారికి వయోలిన్ అంటే ఆసక్తి. వయోలిన్ విద్యాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడి బాణీ అంటే చెవికోసుకునేవారు. ఆయన్ని అనుకరిస్తూ వయోలిన్ వాయిస్తూ ఒకసారి గురువుగారి కంట పడ్డారు. ‘వయోలిన్ ‘సంగతి’ సరే! ముందు నీ ‘సంగతి’ చూసుకో అని గురువు గారు మెత్తగా మందలించారు. (సంగతి అనేది సంగీత పరిభాషలో ఒక పదం). ఆనాటి నుంచి మంగళంపల్లి వారు అనుకరణకు పూర్తిగా స్వస్తి పలికారు.

1985 ప్రాంతంలో కాబోలు, బెజవాడలో డి.ఎల్.నారాయణగారి అమ్మాయి వివాహానికి మంగళంపల్లి వారు మద్రాసు నుంచి వచ్చారు. ఇద్దరికీ మంచి స్నేహం. ఆ స్నేహాన్ని పురస్కరించుకునే ఆ పెళ్ళిలో మంగళంపల్లి వారు కచేరీ కూడా చేసారు. ఆ తరువాత మమత హోటల్ లో కాసేపు గడిపి రాత్రి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ కు వెళ్ళారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్లాటు ఫారం మీద సిద్ధంగా వుంది. ఆ ట్రైను టీసీ మంగళంపల్లివారిని చూడగానే గుర్తుపట్టి సెకండ్ ఏసీ బోగీలో ఒక బెర్తు మీద కూర్చోబెట్టి, ‘ఇప్పుడే వస్తాను, కూర్చోండి, వచ్చి మీకు బెర్తు ఇస్తాను’ అని చెప్పి వెళ్లి పోయాడు. ఈ లోగా ఒక బెంగాలీ బాబు ప్లాటు ఫారం మీద ఇడ్లీలు పార్సెల్ కట్టించుకుని, ఇడ్లీల మీద పోసిన జారుడు చట్నీ కారిపోతుండగా ఆ బోగీలోకి వచ్చాడు. వచ్చి బాలమురళితో అది తన బెర్తని, అక్కడినుంచి లేవమని అన్నాడు. తానొక సంగీతకారుడిననీ, పేరు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అనీ పరిచయం చేసుకోబోయారు. అయినా ఆ బెంగాలీబాబు పట్టించుకోలేదు. సరికదా! “అయితే ఏమిటట” (వాట్ ఇఫ్) అనేసాడు. మంగళంపల్లివారు చిన్నబుచ్చుకుని టీసీ వచ్చేవరకు ఆగకుండా బండి దిగి, మళ్ళీ హోటల్ కు వచ్చేసారు. తనవెంట వున్న మిత్రుడితో ఇలా అన్నారు. ‘చూడు కృష్ణారావు. మనల్ని కావాలని కోరుకునేవాళ్ళు ఎంతోమంది వున్నారని అనుకుంటాం. మన వెర్రి కాని అది పూర్తిగా నిజం కాదు. మన అసలు స్థాయి ఏమిటన్నది ఆ బెంగాలీ వాడు మనకు చెప్పాడు’

ఆయన మాటల్లో బాధ లేదు. ఒక సత్యం బోధపడిన భావన కనిపించింది.


bhandaru-srinivasarao.jpg

భండారు శ్రీనివాసరావు

(సీనియర్ పాత్రికేయులు, రచయిత)

9849130595

Updated Date - 2022-11-22T12:08:26+05:30 IST

Read more