Pingali Nagendra Rao: ఎన్టీఆర్ సినిమాల్లోని ఆ రెండు పాటలు.. పింగళి రచనా శైలికి మచ్చుతునకలు..!

ABN , First Publish Date - 2022-12-29T16:37:35+05:30 IST

నిజం చెప్పాలంటే, జనం కోరింది పింగళి రాయలేదు; తాము కోరుకున్నదే ఆయన రాశారని జనం అనుకునేలా చేసిన అసాధారణ ప్రజ్ఞాశాలి పింగళి.

Pingali Nagendra Rao: ఎన్టీఆర్ సినిమాల్లోని ఆ రెండు పాటలు.. పింగళి రచనా శైలికి మచ్చుతునకలు..!

‘పాతాళ భైరవి (Pathala Bhairavi) ’ సినిమాలో నేపాళ మాంత్రికుడు తన శిష్యుడ్ని అడుగుతాడు:

"జనం అడిగింది మనం సేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?"

పాపులర్ సినిమాలు తీసేవాళ్లని వేధించే సమస్యే ఇది. అయితే, ఈ డైలాగ్ రాసిన పింగళి నాగేంద్రరావు (Pingali Nagendra Rao) తనదైన చమత్కారంతో ఆ ఊగిసలాటకి ఒక పరిషారం చెప్పేశారు అదే సన్నివేశంలో- "మన కన్నే... మన చెవే... మన మాటే... మన జనం" అంటాడు శిష్యుడు. అద్భుతమైన అనేకానేక సినిమాలకి పాటలు, మాటలు అందించిన ప్రతిభావంతమైన సినీకవి అయిన పింగళి (Pingali )- తన సినీ రచనల్లో పాటించింది, ప్రయోగించింది అదే మెళకువ.

నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?

నిజం చెప్పాలంటే, జనం కోరింది ఆయన రాయలేదు; తాము కోరుకున్నదే ఆయన రాశారని జనం అనుకునేలా చేసిన అసాధారణ ప్రజ్ఞాశాలి పింగళి. ఆయన ప్రజ్ఞ, ప్రతిభల గురించి ఎన్నో గ్రంథాలు వచ్చాయి, మరెన్నో పుస్తకాలకు సరిపడా సమాచారం ఉంటుంది కూడా. సినీకవులలో తన సీనియర్స్, తన సమకాలీకులు, తర్వాత తరాలకు లేని ప్రత్యేకమైన శైలి పింగళి సొంతం. ఏమిటది? అదేమిటో తెలుసుకోవాలంటే రెండు సినీగీతాల గురించి ప్రస్తావించుకోవాలి.

Pingali-2.jpg

1. ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao - NTR), ఏయన్నార్ (Akkineni Nageswara Rao- ANR), సావిత్రి, జమున, ఎస్వీ రంగారావు నటించిన సినిమా ‘మిస్సమ్మ (Missamma Movie)’. 1955లో వచ్చిన ‘మిస్సమ్మ’ లో ఓ పాట: "ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా..."

రుసరుసలాడుతూ ఉండే కథానాయికలో తొలిసారిగా ప్రేమ అంకురిస్తుంది. అప్పటివరకూ కలగని భావాలేవో కలుగుతుంటాయి.

"వినుటయె కాని వెన్నెల మహిమలు

అనుభవించి నేనెరుగనయా

నీలో వెలసిన కళలు కాంతులు

లీలగ ఇపుడే కనిపించెనయా ..." అని పాడుతుంది.

అంతకంటే ముఖ్యం: 'చెలిమికోరుతూ ఏవో పిలుపులు /నాలో నాకే వినిపించెనయా.. / ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా...' అంటుంది.

2. 1962లో విడుదలైన ‘మహామంత్రి తిమ్మరుసు’ సినిమాలో- నాయకుడు (శ్రీకృష్ణ దేవరాయలు- ఎన్టీఆర్ చిత్తరువు గీసి "మోహన రాగమహా... మూర్తిమంతమాయె" అనే హృద్యమైన పాట పాడుతుంది హీరోయిన్ (తిరుమలదేవి – దేవకి). "నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా...." అని రాశారు పింగళి ఆ పాట చరణంలో.

‘మిస్సమ్మ’ (Missamma Movie Songs) లో ఆమెలో ఆమెకే వినిపించే పిలుపులు, ‘మహామంత్రి తిమ్మరుసు’లో ఆమెలో ఆమెకే తెలియకుండా సాగిన ఆలాపనలు- అటువంటి హృదయ రాగ... తాళ... పదగతులని పసిగట్టగలిగిన నిశితమైన దృష్టి, సునిశితమైన హృదయం ఉంది కాబట్టే పింగళికి మిగతా ఎవ్వరికీ సాధ్యం కాని ప్రత్యేక శైలి అలవడింది.

మరుగున పడ్డ మాటలకి జీవం పోసి..

'మన కన్నే... మన చెవే... మన మాటే... మన జనం..' - అన్నట్టు ఆయన మాటని మన పాట చేసేశారు పింగళి. అంతేకాదు, పాతగ్రంథాలకే పరిమితమయ్యి, జనబాహుళ్యంలో వాడకంలో లేక మరుగునపడిపోయిన ఎన్నో పదాలని తన పాటల ద్వారా వెలుగులోకి తెచ్చారు, మాటలతో కొత్త కొత్త పదాలు పుట్టించారు (‘అస్మదీయులు’కి వ్యతిరేకంగా- ‘తసమదీయులు’ - అని పదం సృష్టించి, ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి, వేసుకో వీరతాడు- అనిపించారు ‘మాయాబజార్ ‘ (Mayabazar Movie) ఘటోత్కచుడు – ఎస్వీఆర్ తో (SVR) )

Pingali-3.jpg

‘అరమర’ - అనే పదం అటువంటి మరుగైపోతున్న పదాలలో ఒకటి. ‘మాయాబజార్’ లో ‘సుందరి నీవంటి దివ్యస్వరూపము ఎందెందు వెదకిన లేదుకదా !’ అనే పాటలో ఉత్తరకుమారుడు (రేలంగి) పెళ్ళికి ముందే విరహ తాపంతో తొందరపడుతుంటే మాయ శశిరేఖ( సావిత్రి) ‘రేపటిదాకా ఆగాలి,’ అంటుంది. ‘ ఆగుమంటు సఖియ అరమరలెందుకె ? సొగసులన్ని నాకు దక్కెగదా ? మన పెళ్లి వేడుకలింక రేపె గదా !’ అంటూ పాడతాడు. ‘అరమర’ అంటే ‘భేదం’, ‘సందేహం’ అనే అర్థాలు ఉన్నాయి.

అలాగే, ‘వైళము... వయిళము’ - అనే పదాలు. ఎన్టీఆర్, ఏయన్నార్ నటించిన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ లో 'స్వాముల సేవకు వెళాయె... ' పాట ఉంది. "స్వాముల సేవకు వెళాయె... వైళమరారే చెలులారా..." లో ‘వైళము’ అనే పదం అర్థమేమిటి? అసలు ఎక్కడిదా పదం?

"ఓలేమ యేతదవనీ, పాలక సంభావితార్థ పరికల్పనకున్, జాలిన నిలుమిట లేదా, వైళమ చనుమింక మసల వలవదటనినన్..." అని అయ్యలరాజు నారాయణామాత్యుడి 'హంసవింశతి 'లో ఉందట. ఎప్పుడో 300 ఏళ్ల నాటి ప్రయోగం - "స్వాముల సేవకు వెళాయె... వైళమరారే చెలులారా..." అని వాడేశారు పింగళి. ‘వైళము... వయిళము’ అంటే తొందరగా, శీఘ్రంగా అని అర్థం కాబట్టి, దాన్ని సినిమా పాటలో ప్రయోగించి 'మన కన్నే... మన చెవే... మన మాటే... మన జనం..' చేసేశారు పింగళి.

( పింగళి నాగేంద్రరావు జయంతి (డిసెంబర్ 29, 1901) సందర్భంగా..)

Updated Date - 2022-12-29T16:41:44+05:30 IST