Titanic Movie: అంత గొప్ప టైటానిక్ సినిమాలోనూ ఓ బిగ్ మిస్టేక్.. ఆ ఒక్క సీన్‌ వల్ల వచ్చిన విమర్శలెన్నో..!

ABN , First Publish Date - 2022-12-19T18:12:11+05:30 IST

టైటానిక్ సినిమాలో దొర్లిన ఒక పొరబాటు గురించి అప్పట్లో కొంత చర్చ కూడా రేగింది. ఆ పొరబాటు తెలియాలంటే, ఆ సినిమాలో ఒక సంభాషణ ప్రస్తావించుకోవాలి.

Titanic Movie: అంత గొప్ప టైటానిక్ సినిమాలోనూ ఓ బిగ్ మిస్టేక్.. ఆ ఒక్క సీన్‌ వల్ల వచ్చిన విమర్శలెన్నో..!

టైటానిక్ విడుదలై నేటికి పాతికేళ్లు

పాతికేళ్ల క్రితం ఇదేరోజున రిలీజైన 'Titanic' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్నో బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాశాడు దర్శకుడు James Cameron. 1912లో ఉత్తర అట్లాంటా మహాసముద్రం (North Atlantic Ocean) లో RMS Titanic మునిగిపోయింది. దాని ఆధారంగా కథ అల్లుకొని, ఆ ఫిక్షనల్ కథని 'Titanic' పేరిట తెరకెక్కించాడు జేమ్స్ కామెరూన్. డిసెంబర్ 19, 1997లో విడుదలైన ఈ సినిమాకి నేటితో పాతికేళ్లు నిండాయి.

టైటానిక్ సినిమాలో దొర్లిన ఒక పొరబాటు గురించి అప్పట్లో కొంత చర్చ కూడా రేగింది. ఆ పొరబాటు తెలియాలంటే, ఆ సినిమాలో ఒక సంభాషణ ప్రస్తావించుకోవాలి. వైట్ స్టార్ లైన్ (White Star Line) చైర్మన్, టైటానిక్ ఓడ యజమాని అయిన బ్రూస్ ఇస్మే (Joseph Bruce Ismay), 'The Unsinkable Molly Brown' గా గుర్తించబడిన మార్గరెట్ (Margaret T Brown), కథానాయిక రోజ్ (Rose DeWitt Bukater) మధ్య నడిచిన ఒక సరదా సంభాషణ:

మార్గరెట్ టి బ్రౌన్: (ఓడకి) ‘టైటానిక్’ అనే పేరుని ఎవరు ఆలోచించారు? అది నువ్వేనా బ్రూస్?

జె. బ్రూస్ ఇస్మే: అవును, దాని భారీతనాన్ని అర్థం కావాలనే అలా పేరు పెట్టాను. పెద్ద సైజు- సైజులో ఉందంటే అదొక ధీమా, సుఖం, అన్నింటినీ మించి గొప్ప బలం.

రోజ్: ఇస్మే! మీకు డా. ఫ్రాయిడ్ తెలుసా? సైజు గురించి మగాళ్ల వ్యసనం మీద ఆయన ఆలోచనలు పట్ల బహుశా మీకు ప్రత్యేకమైన మోజు అనుకుంటా.

****

Titanic-Movie-1.jpg

ఏమిటా ఫ్రాయిడ్ సిద్ధాంతం:

డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన న్యూరాలజిస్టు, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త (psychoanalyst). మనో వైజ్ఞానిక శాస్త్ర (psychoanalysis) రచనల ద్వారా ప్రపంచప్రఖ్యాతి పొందిన ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని - పై సంభాషణలో హీరోయిన్ రోజ్ ప్రస్తావిస్తుంది వెక్కిరింపుగా. మగవాళ్లు వెంపర్లాడే ఈ భారీతనం- వాళ్ల పురుషాంగాల సైజుకి విలోమ నిష్పత్తిలో ఉంటుందని ఫ్రాయిడ్ సూత్రీకరణ. మగవాడు తన అంగ పరిమాణం ఎంత చిన్నదైతే అంత పెద్ద న్యూనతతో, ఆ గిలిని దాటే యావతో అంతకంత భారీ పరిమాణాల కోసం అంగలార్చుతాడంటాడు ఫ్రాయిడ్. గ్రీకుల భారీ కట్టడాలు, పెద్ద శిల్పాలు, మహాప్రాసాదాలు వగైరాల వెనక గ్రీకు మగధీరుల అంగప్రమాణం చాలా చిన్నది కావడమే అని ఆ సిద్ధాంత సారాంశం. ఈ సిద్ధాంతాన్నే రోజ్ తమ సంభాషణలో ఎగతాళిగా ప్రస్తావిస్తుంది.

అయితే, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆ సిద్ధాంతాన్ని 'Beyond the Pleasure Principle (Jenseits des Lustprinzips)' అనే వ్యాసంలో ప్రకటించింది 1920లో. కానీ, ‘టైటానిక్’ ఓడ మునిగిపోయింది 1912లో. ఆ ఓడ మీద ప్రయాణం చేసిన 17 ఏళ్ల రోజ్ కి ఫ్రాయిడ్ రచనలు తెలియడం ఒక విచిత్రమైతే, ఆయన మరో 8 ఏళ్ల తర్వాత గాని ప్రకటించని సిద్ధాంతాన్ని గురించి ముందే మాట్లాడటం మరింత అసంబద్ధమని విమర్శించారు సినీ పండితులు.

అంతా Anachronism అనేద్దామా ?

Anachronism అంటే- కాలవ్యత్యాసంగా చెప్పడం. అంటే భవిష్యత్తులో జరిగిన దాన్ని వర్తమానంతో ముచ్చటగా ముడేయడం అన్నమాట. Period piece films లో అంటే ఒక ప్రత్యేక కాలానికి సంబంధించి తీసే పీరియడ్ డ్రామాలో అందమైన అలంకారంగా ఉండే ‘anachronism’ గా కూడా ‘టైటానిక్’ సినిమాలో రోజ్ డైలాగుని పరిగణించకూడదని అన్నారు విమర్శకులు.

Titanic-Movie--3.jpg

‘విప్రనారాయణ’ సినిమాలో విప్రనారాయణుడు (అక్కినేని నాగేశ్వరరావు)ని వశంచేసుకోడానికి దేవదేవి (భానుమతి) ‘సావిరహే తవదీనా రాధా... ’ అంటూ భక్త జయదేవుడి అష్టపది పాడుతుంది. విప్రనారాయణుడంటే 12 మంది ఆళ్వారులలో ఒకరైన- తొండరప్పొడి ఆళ్వార్; ఆయన కాలానికి కనీసం 400 ఏళ్ళ తర్వాతి వాడు భక్త జయదేవుడు. వారి సంభాషణలో జయదేవుడి గురించి కూడా మాట్లాడుకుంటారు నాయికానాయకులు. అదొక అందమైన anachronism అంటారు.

అంతేగానీ, 13వ శతాబ్దపు కాలం నాటి Braveheart సినిమాలో 17వ శతాబ్దం తర్వాత గాని కనిపెట్టబడిన రంగురంగుల ధోవతులు (Kilts) చుట్టుకోవడం ... కంబళ్ళు ( Tartans) కప్పుకోవడం, 16వ శతాబ్దం నాటి అన్నమయ్య- 20వ శతాబ్దానికి గాని మనదేశానికి రాని Sunflowers పొలంలో డ్యూయెట్లు పాడటం (‘అన్నమయ్య’ – సినిమా) anachronisms అని వెనకేసుకురాకూడదు. ఇటీవల విడుదలై విజయవంతమైన ‘సీతారామం’ సినిమా కూడా ఒక పీరియడ్ డ్రామా. 1964లోని ఒక ఇంగ్లీష్ పేపర్ చూపిస్తారు, 'ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) సంకీర్ణ ప్రభుత్వానికి సిద్ధం' అని ఉంటుంది అందులో ఒక హెడ్డింగ్. ఫరూఖ్ అబ్దుల్లా రాజకీయాల్లోకి వచ్చిందే 1982లో. కాబట్టి, వీటిని తప్పిదాలని అనాలి తప్ప, anachronism అనకూడదు.

‘టైటానిక్’ సినిమాలో కూడా ఫ్రాయిడ్ సిద్ధాంత ప్రస్తావన కూడా anachronism కాదన్నారు సినీ క్రిటిక్స్. ‘టైటానిక్’ ఓడ మునిగిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత 1920లో గాని ఫ్రాయిడ్ తన సిద్ధాంతాల్ని ప్రకటించలేదు కాబట్టి ‘టైటానిక్’ సినిమాలో ఫ్రాయిడ్ ని ప్రస్తావించడం పెద్ద తప్పిదం అని తేల్చేశారు.

Updated Date - 2022-12-19T18:33:42+05:30 IST