రాత్రిపూట మిస్డ్ కాల్స్.. తెలీని నెంబర్లు కదా అని వదిలేశాడు.. తీరా చూస్తే రూ.50 లక్షలు మటాష్..!

ABN , First Publish Date - 2022-12-13T19:22:35+05:30 IST

మన మొబైల్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఇతరులతో పంచుకున్నప్పుడే మనం మోసపోతుంటామని ఇప్పటివరకు అనుకుంటున్నాం. అయితే OTPని షేర్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం మిస్డ్ కాల్స్ వల్ల కూడా సైబర్ క్రైమ్‌లు జరుగున్నాయనే షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ తరహా స్కామ్ ద్వారా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.50 లక్షలు డ్రా అయిపోయాయి.

రాత్రిపూట మిస్డ్ కాల్స్.. తెలీని నెంబర్లు కదా అని వదిలేశాడు.. తీరా చూస్తే రూ.50 లక్షలు మటాష్..!

మన మొబైల్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఇతరులతో పంచుకున్నప్పుడే మనం మోసపోతుంటామని ఇప్పటివరకు అనుకుంటున్నాం. అయితే OTPని షేర్ చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం మిస్డ్ కాల్స్ వల్ల కూడా సైబర్ క్రైమ్‌లు (Cyber Crime) జరుగుతున్నాయనే షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ తరహా స్కామ్ ద్వారా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా రూ.50 లక్షలు మాయం అయిపోయాయి. ఈ తరహా స్కామ్ సైబర్ నిపుణులనే ఆశ్చర్యపరుస్తోంది.

దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బాధితుడికి కొన్ని రోజుల క్రితం రాత్రి 7 నుంచి 8.45 గంటల మధ్య వరుసగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. అతడు కొన్ని కాల్స్ పట్టించుకోలేదు. చివరికి అతడు ఒక కాల్ ఎత్తాడు. అప్పుడు అవతలి వైపు నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. దీంతో ఫోన్ పెట్టేశాడు. కొంత సమయం తర్వాత బాధితుడి ఫోన్‌కు వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. RTGS ద్వారా మొత్తం రూ.50 లక్షలు విత్‌డ్రా అయినట్టు గుర్తించి బాధితుడు షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక దర్యాఫ్తు చేసిన పోలీసులు ఆ స్కామ్ ఝార్ఖండ్‌లోని జమ్తారా (Jamtara) కేంద్రంగా జరిగినట్టు గుర్తించారు. ఈ కేసులో సైబర్ మోసగాళ్లు సిమ్ స్వాప్ (SIM Swap) చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. RTGS బదిలీని పూర్తి చేయాలంటే కావాల్సిన OTPని స్కామర్‌లు సిమ్ స్వాప్ ద్వారా పొంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

సిమ్ స్వాప్ (SIM Swap) అంటే ఏమిటి?

సిమ్ స్వాప్ అంటే ఒకే నెంబర్‌పై మరో సిమ్ కార్డు తీసుకోవడం. అంటే ఆ నెంబర్ కలిగి ఉన్న వినియోదారుకు తెలియకుండా అతని ఫోన్ నెంబర్‌తో ఇంకో సిమ్ తీసుకోవడం. సోషల్ మీడియా ద్వారా లేదా ఫిషింగ్ మెయిల్స్ ద్వారా మోసగాళ్లు మీ అసలు పేరు, పుట్టిన రోజు, అడ్రస్, ఫోన్ నెంబర్లు తెలుసుకుంటారు. ఆ తర్వాత సిమ్ పోయిందని సర్వీస్ ప్రొవైడర్ దగ్గరకు వెళ్లి మీ నెంబర్‌తో కొత్త సిమ్ కోసం అప్లై చేసుకుంటారు. అప్పటికే సేకరించిన వివరాలు వారికి సరిగ్గా చెప్పడంతో సర్వీస్ ప్రొవైడర్లు వారికి మీ నెంబర్ మీద కొత్త సిమ్ ఇచ్చేస్తారు. ఇక, అప్పటి నుంచి మీ మొబైల్‌కు రావాల్సిన మెసేజ్‌లు స్కామర్ దగ్గర ఉన్న సిమ్‌కు వెళతాయి. అలా ఓటీపీ తెలుసుకునే స్కామర్ మీ అకౌంట్ నుంచి సులభంగా డబ్బులు తీసుకోగలడు. సిమ్ స్వాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డ్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలను సులువుగా తెలుసుకోగలరు. ఈ తరహా మోసాలతో ఇప్పటికే బాధితులు రూ.200 కోట్ల వరకు నష్టపోయారని అంచనా.

సిమ్ స్వాప్ బారిన పడకుండా ఉండాలంటే..

సిమ్ స్వాప్ బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ( two-factor authentication) చేసుకోవాలి. అలాగే ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మీరు బ్యాంకు లేదా ఇతర ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించే ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో అందరికీ కనిపించేలా డిస్‌ప్లే చేయకూడదు. అలాగే మీ నెట్‌వర్క్ తరచుగా ఆగిపోతున్నా కూడా సిమ్ స్వాప్ జరుగుతున్నట్టు అనుమానించి సర్వీస్ ప్రొవైడర్లకు ఫిర్యాదు చేయాలి.

Updated Date - 2022-12-13T19:24:32+05:30 IST