మొత్తానికి అనుకున్నది సాధించిన యువతి.. తనను తానే పెళ్లి చేసుకుని హనీమూన్‌కు కూడా..
ABN , First Publish Date - 2022-06-09T18:40:57+05:30 IST
గుజరాత్‌కు చెందిన క్షమా బిందు అనే యువతి వివాహం కొన్ని రోజులుగా దేశంలో హాట్ టాపిక్‌గా మారింది.

గుజరాత్‌కు చెందిన క్షమా బిందు అనే యువతి వివాహం కొన్ని రోజులుగా దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే క్షమా బిందు తనను తానే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అలా తనను తానే పెళ్లి చేసుకోవడం హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకమంటూ బీజేపీకి చెందిన ఓ నాయకుడు స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇతర పార్టీలు కూడా క్షమా బిందు వివాహం గురించి స్పందించాయి.
ఇది కూడా చదవండి..
భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక.. మూడేళ్లుగా కొండని తవ్వుతున్న భర్త.. చచ్చేలోపు సాధిస్తానంటూ..
తన వివాహం వివాదాలకు కేంద్రంగా మారుతోందని గ్రహించిన క్షమా బిందు అనుకున్న సమయం కంటే ముందుగానే పెళ్లి వేడుకను పూర్తి చేసింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మెహిందీ, హల్దీ వేడుకలను నిర్వహించి మరీ తనను తాను పెళ్లి చేసుకుంది. నిజానికి ఈ నెల 11న క్షమా బిందు వివాహం జరగాల్సి ఉంది. అయితే రాజకీయ వివాదాల కారణంగా తన పెళ్లికి అవాంతరాలు వస్తాయేమోనని భయపడి ముందుగానే పెళ్లి వేడుక పూర్తి చేసింది. ఆ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా తెలియజేసింది.
`నా నిర్ణయానికి మద్దతు ఇచ్చి, నాకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు`అని బిందు పేర్కొంది. `సెల్ఫ్-మ్యారేజ్ అంటే షరతులు లేకుండా మనల్ని మనం ప్రేమించుకోవడమే. నీకు నువ్వు భరోసాగా నిలబడడమే. నిజానికి ప్రజలందరూ తాము ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటాను. నాకు నేనంటే చాలా ఇష్టం. అందుకే సెల్ఫ్-మ్యారేజ్ చేసుకున్నాన`ని బిందు తెలిపింది. ఒంటరిగానే హనీమూన్‌కు వెళుతున్నట్టు పేర్కొంది.