భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక.. మూడేళ్లుగా కొండని తవ్వుతున్న భర్త.. చచ్చేలోపు సాధిస్తానంటూ..

ABN , First Publish Date - 2022-06-09T18:19:39+05:30 IST

మంచినీళ్ల కోసం భార్య పడుతున్న కష్టాన్ని అతను చూడలేకపోయాడు.. ఆమె కష్టాన్ని తీర్చేందుకు ఎంతో కష్టమైన పనికి శ్రీకారం చుట్టాడు.

భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక.. మూడేళ్లుగా కొండని తవ్వుతున్న భర్త.. చచ్చేలోపు సాధిస్తానంటూ..

మంచినీళ్ల కోసం భార్య పడుతున్న కష్టాన్ని అతను చూడలేకపోయాడు.. ఆమె కష్టాన్ని తీర్చేందుకు ఎంతో కష్టమైన పనికి శ్రీకారం చుట్టాడు.. దాదాపు మూడేళ్లు కష్టపడి స్వయంగా 60 అడుగుల లోతు బావి తవ్వాడు.. అయితే అది కొండ ప్రాంతం కావడంతో అంత సులభంగా నీళ్లు పడవు.. అయినా అతను నిరాశపడకుండా తన పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు.. తను చనిపోయే లోపు ఎలాగైనా బావిని మరింత లోతుగా తవ్వి నీటిని అందుబాటులోకి తెస్తానని చెబుతున్నాడు.. మధ్యప్రదేశ్‌లోని సిధీకి చెందిన హరిసింగ్ తన భార్య కోసం ఈ కష్టసాధ్యమైన పనిని తలకెత్తుకున్నాడు. 


ఇది కూడా చదవండి..

మీ ఆయన ఆస్పత్రిలో ఉన్నాడంటూ ఇంటికి వచ్చి చెప్పిన భర్త స్నేహితులు.. కంగారుగా కారు ఎక్కిన భార్య.. పెళ్లయిన 4 నెలల్లోనే..


హరిసింగ్ తన భార్య సియావతితో కలిసి ఓ కొండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. వారు ఉండే ప్రాంతంలో నీటి వసతి లేదు. మంచినీరు కావాలంటే దాదాపు 2 కి.మి. నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకోవాలి. భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక హరిసింగ్ తమకు దగ్గర్లోనే ఓ బావి తవ్వాలని మూడేళ్ల క్రితం నిర్ణయించుకున్నాడు. ఇప్పటివరకు 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతైన బావిని తవ్వేశాడు. కొద్దిపాటి నీరు రావడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కొండ ప్రాంతం కావడంతో మరో 60 అడుగులు తవ్వితే తప్ప నీరు సమృద్ధిగా రాదు. 


హరిసింగ్ ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు. తను చనిపోయే లోపు ఎలాగైనా పనిని పూర్తి చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. `మొదట్లో ఈ పని చేయడం చాలా కష్టమనిపించింది. ఎందుకంటే మొత్తం రాయితో నిండిపోయిన ప్రాంతాన్ని తవ్వడం చాలా కష్టం. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఈ ప్రపంచంలో అసాధ్యమనేది లేదు. నేను చనిపోయే లోపు ఎలాగైన ఈ పని పూర్తి చేస్తాన`ని హరి సింగ్ పేర్కొన్నాడు.  

Updated Date - 2022-06-09T18:19:39+05:30 IST