Triple Talaq: కట్నంగా కారు ఇవ్వలేదని ఆగ్రహం.. భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..!

ABN , First Publish Date - 2022-10-15T21:18:40+05:30 IST

ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుంచి రక్షణ కల్పించేందుకు చట్టం ఏర్పడినా ఇంకా ఆ దురాచారం పూర్తిగా ఆగడం లేదు.

Triple Talaq: కట్నంగా కారు ఇవ్వలేదని ఆగ్రహం.. భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..!

ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుంచి రక్షణ కల్పించేందుకు చట్టం ఏర్పడినా ఇంకా ఆ దురాచారం పూర్తిగా ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక మూల ట్రిపుల్ తలాక్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. కట్నంతో పాటు కారు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి వదలించుకున్నాడు. దీంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తతో సహా ఐదుగురిపై ఆ మహిళ ఫిర్యాదు చేసింది.


ఇది కూడా చదవండి..

Viral Video: బర్త్ డే రోజు తండ్రికి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొడుకు.. మనుసును కట్టేపడేస్తున్న ఎమోషనల్ వీడియో!


ఘజియాబాద్‌లోని కైలా భట్టా ప్రాంతంలో నివసిస్తున్న రుబీనాకు ఇమ్రాన్ సైఫీ అనే వ్యక్తితో 2017లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 4 సంవత్సరాల పాప ఉంది. పెళ్లై ఐదేళ్లు అవుతున్నా భర్త, అత్తమామలు రుబీనాను కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. శారీరకంగా, మానసికంగా ఆమెను హింసిస్తున్నారు. దీంతో ఆ మహిళ కట్నం వేధింపుల విషయమై గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అత్తింటి వారు రాజీ కుదుర్చుకుని రుబీనాను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఉద్యోగం సాకుతో రాజస్తాన్ బయల్దేరి భార్యను పుట్టింట్లో విడిచిపెట్టాడు. ఆ సమయంలో అత్తమామలు ఆమె నగలు, ఇతర వస్తువులను తీసుకున్నారు. 


కొన్ని రోజులు పోయిన తర్వాత రుబీనాకు ఇమ్రాన్ ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. షాకైన రుబీనా తిరిగి ఫోన్ చేసినా అతను స్పందించలేదు. దీంతో రుబీనా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తమామలతో పాటు మొత్తం ఐదుగురిపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-10-15T21:18:40+05:30 IST