House Husband: పెళ్లాం సంపాదిస్తోంటే ఇంట్లో అంట్లు తోముతున్నాడని తిట్టినోళ్లే ఎక్కువ.. కానీ నా నిర్ణయం వెనుక..!

ABN , First Publish Date - 2022-11-26T12:31:58+05:30 IST

భార్య సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. అతనేమో ఇంట్లో పనులు చేస్తుంటాడు. పొద్దునే లేచి టీ చేయడం దగ్గరి నుంచి..

House Husband: పెళ్లాం సంపాదిస్తోంటే ఇంట్లో అంట్లు తోముతున్నాడని తిట్టినోళ్లే ఎక్కువ.. కానీ నా నిర్ణయం వెనుక..!

సిగ్గు లేదు.. పెళ్లాం సంపాదిస్తోంటే ఇంట్లో అంట్లు తోముకుంటున్నావా..? భార్య సంపాదన మీద బతుకుతున్నావా..? మగాడివై ఉండి ఇవేం పనులు.. మన ఇళ్లల్లో ఎక్కడైనా ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉందా..? ఇళ్లల్లోనే కాదు.. సమాజంలో ఎక్కడైనా చూశామా..? పని చేయలేక బద్దకిస్తూ భార్యను ఉద్యోగానికి పంపిస్తావా..? అసలు ఆమెకైనా బుద్ధి ఉండొద్దూ..? భర్తతో ఇంట్లో చాకిరీ చేయిస్తూ తాను మాత్రం మహారాణిలా తిని మగరాయుడులా ఉంటుందా..? ఇంత చదువు చదివి ఇదేం పని..’.. ఇవీ ఓ వ్యక్తి గురించి అతడి బంధువులు తరచుగా అనే మాటలు. నిజమే.. అతడు ఉన్నత చదువులు చదివాడు.. కానీ ఉద్యోగాలేమీ చేయడం లేదు. భార్య సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. అతనేమో ఇంట్లో పనులు చేస్తుంటాడు. పొద్దునే లేచి టీ చేయడం దగ్గరి నుంచి.. మరుసటి రోజు టిఫిన్ కోసం రాత్రిళ్లు మిక్సీలో పిండి పట్టడం, కూరగాయలున్నాయో లేదో చూసుకోవడం వరకు వంటింట్లో అన్ని పనులను చేస్తుంటాడు. ఇతని గురించి విన్నవాళ్ళు ‘ఉద్యోగం పురుష లక్షణం అంటారు. కానీ ఇతనికేం పిచ్చి ఆడవాళ్ళలా చాకిరీ చేస్తున్నాడు’ అని అనుకుంటున్నారు. అసలు తను ఎందుకు ఇలా హౌస్ హస్బెండ్‌గా మారాడో.. అతడి మాటల్లోనే తెలుసుకుందాం..

సాధారణంగా మీరేం చేస్తుంటారు అని మగవాళ్ళని అడిగినపుడు ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నానని, ఒకవేళ ఉద్యోగం చేయకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని అందరూ బదులిస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం హౌస్ హస్బెండ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నానని ఎలాంటి సంకోచం లేకుండా చెబుతాను. నేనెందుకు హౌస్ హస్బెండ్‌గా మారాను? ఎవరు ఎన్ని మాటలన్నా ఇలాగే ఉండటానికి ఎందుకు ఇష్టపడుతున్నాను.. నా నిర్ణయం వెనుక కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే నేను నా చిన్నతనం నుండి ఇప్పటివరకు గడిపిన జీవితం గురించి మీరు తెలుసుకోవాలి.

clean.jpg

మా అమ్మా నాన్నలకు మేము ముగ్గరం పిల్లలం. ఒక అన్నయ్య, ఒక అక్క వీరి తరువాత నేను. నేనే చిన్నవాడిని. చిన్నప్పటి నుండి మా ఇంట్లో మా నాన్న ఉద్యోగం చేస్తే మా అమ్మ ఇల్లు చక్కబెట్టేది. నేను ఇవన్నీ చూస్తూ పెరిగాను. చిన్నతనంలో సినిమాలు చూసినపుడు సినిమాలో ఏ రోల్ నచ్చినా.. జీవితంలో పెద్దాయ్యాక నేనూ అలానే జీవించాలని అనుకునేవాడిని. హీరో అవ్వాలని.. క్రికెటర్, డాక్టర్ కావాలని ఇలా చాలా రకాలుగా కలలు కనేవాడిని. అయితే ఇలా హౌస్ హస్బెండ్‌గా మారతానని నేను కూడా అస్సలు ఊహించలేదు. పాట్నాలో హాస్టల్‌లో ఉంటూనే ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్నాను. ఆ తరువాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదో తరగతి, హోలీ మిషన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ తరువాత మా నాన్నతో కలసి థైరాయిడ్ చెకింగ్ కోసం బిహార్ నుండి ఢిల్లీ వెళ్ళాను. అయితే మా నాన్న నన్ను అక్కడే వదిలి తను మాత్రమే తిరిగి వెళ్ళాడు. ఢిల్లీలో దయాళ్ సింగ్ మార్నింగ్ కాలేజీలో అడ్మిషన్ దొరకడంతో అక్కడ హాస్టల్ జీవితం మొదలయ్యింది. సెకెండ్ ఇయర్ మాత్రం కె.ఎమ్.సిలో చేరాను. బి.ఎ ఆనర్స్ హిందీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడే పీజీ కూడా పూర్తి చేశాను.

పీజీ చేస్తున్నప్పుడు ఒకరోజు నా ఫ్రెండ్‌తో కలసి బస్ స్టాప్‌లో నిలుచుకున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ప్రెండ్ అక్కడికి వచ్చింది. ఆమెతో పాటు ఓ అమ్మాయి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే మా మధ్య పరిచయం ఏర్పడింది. ఫోన్ నంబర్లు మార్చుకున్నాము. మా మధ్య దగ్గరితనం పెరిగి ఒకరినొకరం ఇష్టపడ్డాం. పెద్దవాళ్ళకు చెబితే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఒప్పుకున్నారు. దాంతో మా వివాహం 2018 నవంబర్ 8న జరిగింది. దీంతో ఇద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాం. నా భార్య నాకంటే బాగా చదువుతుంది. తనకు కెరీర్ విషయంలో నాకంటే ఆసక్తి ఎక్కువ. తను 2016-17 సంవత్సరంలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసింది. దాని ఫలితాలు 2018లో వచ్చాయి. నా భార్య మెయిన్స్‌లో కూడా ఉత్తీర్ణత సాధించింది. అప్పుడు మేమిద్దం గెస్ట్ టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నాం. అలా రెండేళ్ళు గడిచాక 2020 సంవత్సరంలో తనకు ఇంటర్వ్యూ కోసం పిలుపొచ్చింది. అందులో కూడా సెలెక్ట్ అవడంతో ఆమెకు ప్రొఫెసర్ పోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. 2021లో ఉద్యోగంలో చేరింది.

serve.jpg

ఉద్యోగంలో చేరాక నా భార్యకు ఉరుకుల పరుగల జీవితం మొదలైంది. ఉదయాన్నే లేచి టిఫిన్, వంట, ఇంటి పని చేసి ఆఫీస్‌కు వెళ్ళేది. మళ్ళీ ఇంటికి వచ్చాక పనులలో పడిపోయేది. తను పడుతున్న కష్టం చూసి నాకు కొన్ని పనులు అప్పగించమని అడిగాను. ఆ తరువాత నేను చేస్తున్న గెస్ట్ టీచర్ ఉద్యోగం వదిలేసి పూర్తిగా ఇంటిని చూసుకోవడం మొదలుపెట్టాను. పూర్తిగా ఇంటి బాధ్యతల్లో దిగాక కానీ నాకు అర్థం కాలేదు అదంత సులభం కాదని. యూట్యూబ్‌లోనూ, ఇతర వెబ్సైట్స్‌లోనూ చూసి వంట చేయడం.. ఇంటిని సృజనాత్మకంగా చక్కబెట్టడం వంటివి నేర్చుకున్నాను. నన్ను ఎందరో ఎన్నో మాటలు అంటారు. ఎగతాళి చేసి మాట్లాడతారు. కానీ నేను అవన్నీ పట్టించుకోను. ఆడవాళ్లు మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు.. మగవారు ఆడవారిలా ఇంటిని చక్కబెట్టడంలో ఎందుకు సిగ్గుపడాలి. ఈ పనిని నేను పూర్తిగా ఇష్టంగా చేస్తున్నప్పుడు ఒకరి మాటలు ఎందుకు పట్టించుకోవాలి. అందుకే నేను హౌస్ హస్బెండ్‌గా ఉండటానికి ఏమత్రం సంకోచించను. ఇలా తన అంతరంగాన్ని పంచుకున్నారు ఓ హౌస్ హస్బెండ్.

Updated Date - 2022-11-26T12:32:00+05:30 IST