Mohan Babu: కలెక్షన్ కింగ్ నట ప్రస్థానానికి 47 వసంతాలు

ABN , First Publish Date - 2022-11-22T18:37:27+05:30 IST

ఓ సామాన్య వ్య‌క్తి నుండి కలెక్షన్ కింగ్‌గా ఎదిగి.. తెలుగు ప్రేక్ష‌కుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు మంచు మోహన్ బాబు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా..

Mohan Babu: కలెక్షన్ కింగ్ నట ప్రస్థానానికి 47 వసంతాలు
Manchu Mohan Babu

ఓ సామాన్య వ్య‌క్తి నుండి కలెక్షన్ కింగ్‌గా ఎదిగి.. తెలుగు ప్రేక్ష‌కుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu). నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా.. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్, హీరో, క్యారక్టర్ నటుడు.. ఇలా ఎన్నో పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల అభిమానం చుర‌గొన్న‌ నటప్రపూర్ణ మోహన్ బాబు సినిమా ప్రస్థానం 2022 నవంబరు 24 నాటికి 47 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా ఆయనకి తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood) నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Mohan-Babu-4.jpg

చిత్తూరుజిల్లా మోదుగులపాలెం గ్రామంలో జన్మించిన‌ ఆయన ప్రాధమిక విద్య యర్పేడు, తిరుపతిలలో సాగింది. చిన్నప్పటి నుండి నాటకాలఫై ప్రత్యేక అభిమానం కలిగిన భక్తవత్సలం నాయుడు నటనపై ఆసక్తి పెంచుకుని, తన కల నేరవేర్చుకోవటానికి మ‌ద్రాసుకు వెళ్లారు. అక్కడ కొన్నాళ్ళు వై.యం.సి.ఏ. కాలేజీలో ఫిజికల్ ట్రైనీగా పనిచేశారు. కానీ నటుడు అవ్వాలనే కోరిక ఆయన్ని నిలకడగా నిలబడనియ్యక పరుగులెత్తించింది. అవకాశాల కోసం ఎండా, వానా, ఆకలి దప్పికలు లెక్కచేయక అహర్నిశలు శ్రమించారు. అలా ఆయన దర్శకుడు లక్ష్మి దీపక్ దగ్గర పనిచేశారు. 1975లో దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కొత్త నటీనటులతో నిర్మించ తలపెట్టిన ‘స్వర్గం-నరకం’ చిత్రం కోసం జరిగిన ఆడిషన్‌లో భక్తవత్సలం దాసరి దృష్టిని ఆకర్షించి నటునిగా తొలి అవకాశం సంపాదించారు. దాసరే భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా వెండితెరకు పరిచయం చేశారు. ఆ చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు 573 చిత్రాలకు పైగా నటించి నవరసాలు పండించాడు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అందులో అల్లుడుగారు, అసెంబ్లీ రౌడి , రౌడీ గారి పెళ్ళాం చిత్రాలు ఆయనని హీరోగా నిలబెట్టగా.. ఆ తరవాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ , మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా, కలెక్షన్ కింగ్‌గా మోహన్ బాబు పేరు తెచ్చుకున్నాడు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ‘పెదరాయుడు’ ఇండస్ట్రి హిట్‌గా నిలిస్తే.. శ్రీ రాములయ్య , అడవిలో అన్న చిత్రాలతో మోహన్ బాబు తనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. వీటితో దాదాపు 216 చిత్రాల్లో ప్రధాన పాత్రలో ఆయన నటించాడు. (47 Years to Mohan babu Cine Career)

Mohan-Babu-3.jpg

1983లో శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్ స్థాపించి నిర్మాతగా మారి 72కి పైగా చిత్రాలు నిర్మించి, సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నాడు. సినీరంగానికే పరిమితం కాకుండా 1992 లో విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్.. ఇలా అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందాడు. ‘నటప్రపూర్ణ, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్’ వంటి వాటితో పాటు ‘యాక్టర్ ఆఫ్ ది మిలీనియం’ వంటి పలు బిరుదులు పొందారు. వీటితో పాటు తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇచ్చింది. ఇవే కాకుండా నటవాచస్పతి, 2015 లో స్వర్ణకనకం. 2016లో నవరస నటరత్నం అవార్డులు పొందారు. 1995 లో యన్.టి.ఆర్ (NT Ramarao) ప్రోద్బలంతో 2001 వ‌ర‌కు రాజ్యసభ ఎమ్.పి. గా పనిచేశారు.

Mohan-Babu-2.jpg

క‌ళని, కళాకారులను అమితంగా అభిమానించే మోహన్ బాబు ఇప్పటికీ తన సొంత బ్యానర్‌లో సినిమాలు నిర్మించ‌డంతో పాటు.. ఆయ‌నే హీరోగా, ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తూ పలు సినిమాల్లో న‌టిస్తున్నారు. తన తండ్రి నటుడిగా 47 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు విష్ణు (Manchu Vishnu) ట్విట్టర్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-11-22T18:58:32+05:30 IST