Viral News: విమానం టాయిలెట్లో ప్రసవించిన మహిళ.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!
ABN , First Publish Date - 2022-12-16T11:30:55+05:30 IST
ఈక్వెడార్ (Ecuador) నుంచి స్పెయిన్ (Spain) వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈక్వెడార్ (Ecuador) నుంచి స్పెయిన్ (Spain) వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కేఎల్ఎం రాయల్ డచ్ విమానంలో (KLM Royal Dutch flight) బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళకు తాను గర్భవతి అనే విషయం బిడ్డను ప్రసవించే వరకు తెలియకపోవడం. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమర (Tamara) అనే మహిళ స్పెయిన్ వెళ్లేందుకు ఈక్వెడార్‌లో కేఎల్ఎం రాయల్ డచ్ విమానం ఎక్కింది. అలా విమానం గాల్లో ఉండగానే ఉన్నట్టుండి ఆమెకు కడుపులో నొప్పిగా అనిపించడంతో వాష్ రూమ్‌కు (Washroom) వెళ్లింది. అక్కడే బిడ్డను ప్రసవించింది.
అదే విమానంలో ఉన్న ఆస్ట్రియాకు (Austria) చెందిన ఇద్దరు వైద్యులు, విమాన సిబ్బంది ఆమెకు సాయం చేశారు. అయితే, బిడ్డను జన్మనిచ్చే వరకు తమరకు తాను ప్రెగ్నెంట్ (Pregnant) అనే విషయం తెలియదట. ఈ విషయం తెలిసి విమాన సిబ్బందితో పాటు అందులోని ప్రయాణికులు విస్తుపోయారు. ఇక విమానం ఆమస్టర్డామ్లో (Amsterdam) ల్యాండ్ కాగానే తమర, ఆమె బిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కాగా, తన బిడ్డకు మాక్సిమిలియానో (Maximiliano) అని నామకరణం చేసినట్లు తమర తెలిపింది.