Telugu Expat: సౌదీలో దయనీయ స్థితిలో తెలుగు ప్రవాసీ మృతి.. 10రోజుల తర్వాత దొరికిన మృతదేహం

ABN , First Publish Date - 2022-11-30T07:10:45+05:30 IST

రోడ్లు ఊడ్చడానికి వచ్చిన అతడు జీతం తక్కువ అని పారిపోయి ఖర్జూరపు తోటలలో పనికి వెళ్ళాడు. విధి వక్రించడంతో తోటలో పనిచేస్తుండగానే గుండెపోటుతో చనిపోయాడు.

Telugu Expat: సౌదీలో దయనీయ స్థితిలో తెలుగు ప్రవాసీ మృతి.. 10రోజుల తర్వాత దొరికిన మృతదేహం

ఖర్జూరపు తీపి ఆశలో జీవితం బలి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): రోడ్లు ఊడ్చడానికి వచ్చిన అతడు.. ఆ పనికి జీతం తక్కువ అని పారిపోయి ఖర్జూరపు తోటలలో పనికి కుదిరాడు. అయితే దురదృష్టవశాత్తు అతడు అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. పది రోజులకు దుర్వాసన వస్తే గానీ అతడు మరణించిన విషయం బయటపడలేదు. దీంతో మరణించిన మనిషిని గుర్తించి.. అధికారిక ప్రక్రియలు పూర్తి చేసే సరికి నెలన్నెర సమయం పట్టింది. దీంతో నెలన్నరత తర్వాత స్ధానికంగా అతడి అంత్యక్రియలు జరిగాయి.

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మండలం మల్లారం గ్రామానికి చెందిన శేఖ్ చాంద్ పాషా అనే వ్యక్తి ఉపాధి కొరకు లక్షన్నర రూపాయాల అప్పు చేసి సౌదీ అరేబియాలోని మదీన మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేయడానికి ఇటీవలే వచ్చాడు. అయితే అక్కడ పని నచ్చక పారిపోయాడు. అనంతరం ఖర్జూర తోటలో పనికి కుదిరాడు. తోటలో కలుపు మొక్కలు తీసే పనిలో ఉండగా.. అతడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అతడు అక్టోబర్ 16న మృతి చెందాడు. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో ఖర్జూరపు పండ్ల కోతలు పూర్తయ్యాయి. సాధారణంగా ఈ సమయంలో తోటల వద్ద ఎవరూ ఉండరు. అప్పుడప్పుడూ కలుపు తీస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎవరూ తోటల వైపు చూడకపోవడంతో చాంద్ పాషా మృతదేహాం కుళ్ళిపోయింది. దాదాపు 10 రోజులకు అటుగా వెళ్లిన వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

చనిపోయింది ఎవరేనే విషయాన్ని తేల్చడంలో జాప్యం జరిగింది. తర్వాత కుటుంబ సభ్యులకు అధికారిక ప్రక్రియ ఏమీ తెలియకపోవడంతో ఈ జాప్యం మరింత పెరిగింది. సౌదీ అరేబియాలోని జి.డబ్లూ.సి.ఏ సభ్యులు పెరుక రాజేందర్, అబ్దుల్ రఫీఖ్‌ల తోడ్పాటుతో జెద్ధాలోని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సామాజిక కార్యకర్త ఫారూఖ్.. గత రెండు వారాలుగా నిరంతర కృషి ఫలితంగా మంగళవారంనాడు మున్సిపాలిటీ అధికారులు మదీనలో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2022-11-30T15:33:36+05:30 IST