US Visa: వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు.. భారత విద్యార్థులకు భారీ ఊరట

ABN , First Publish Date - 2022-12-25T07:45:33+05:30 IST

తాజా కొవిడ్‌ కలకలం.. అమెరికా వీసా ఇంటర్వ్యూ మినహాయింపు పొడిగింపునకు పరోక్షంగా కారణమైంది.

US Visa: వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు.. భారత విద్యార్థులకు భారీ ఊరట

2023 డిసెంబరు 31 దాక పొడిగించిన అమెరికా

కొవిడ్‌ తాజా కలకలంతో నిర్ణయం.. భారత విద్యార్థులకు ఊరట

వాషింగ్టన్‌, డిసెంబరు 24: తాజా కొవిడ్‌ కలకలం.. అమెరికా వీసా ఇంటర్వ్యూ మినహాయింపు పొడిగింపునకు పరోక్షంగా కారణమైంది. చైనా, కొన్ని దేశాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో అగ్రరాజ్యం వీసాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట వలసేతర వీసా కేటగిరీల్లో వ్యక్తిగత ఇంటర్వ్యూ మినహాయింపును మరో ఏడాది పాటు పొడిగించింది. అంటే 2023 డిసెంబరు 31 దాకా మినహాయింపును కొనసాగించనుంది. ఇంటర్వ్యూ మినహాయింపుతో వీసా నిరీక్షణ సమయం బాగా తగ్గనుంది. ఇంటర్య్యూ మినహాయింపునకు ‘నిర్దిష్ట వలసేతర’ అంటూ అమెరికా వర్గీకరించిన వీసా కేటగిరీల్లో తాత్కాలిక వ్యవసాయ-వ్యవసాయేతర కార్మికులు (హెచ్‌-2), విద్యార్థులు (ఎఫ్‌, ఎం), అకడమిక్‌ ఎక్స్ఛేంజీ విజిటర్స్‌ (అకడమిక్‌ జె), ప్రత్యేక వృత్తి నిపుణులు (హెచ్‌1బి), శిక్షణ, ప్రత్యేక విద్య సందర్శకులు (హెచ్‌3), ఒక సంస్థ నుంచి మరోదానికి బదిలీ అయ్యేవారు (ఎల్‌) తదితరాలు ఉన్నాయి. వీసా ఉండి.. నాలుగేళ్లలోగా పునరుద్ధరణకు వెళ్లాలని భావించేవారికీ ఇంటర్వ్యూ మినహాయింపు వర్తించనుంది. అమెరికా తాజా నిర్ణయంతో భారత విద్యార్థులు, వృత్తి నిపుణులకు లబ్ధి చేకూరనుంది.

Updated Date - 2022-12-25T07:45:35+05:30 IST