US Dream: అమెరికాలో స్థిరపడాలనే ఆశతో.. పంజాబీ పెద్ద ప్లానే వేశాడు.. కానీ చివరి నిమిషంలో..
ABN , First Publish Date - 2022-12-15T11:37:00+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో (Amercia) స్థిరపడాలనే కల నిజం చేసుకునేందుకు పంజాబ్ రాష్ట్రానికి చెందిన జస్వీందర్ సింగ్ (26) పెద్ద ప్లానే వేశాడు.
ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో (Amercia) స్థిరపడాలనే కల నిజం చేసుకునేందుకు పంజాబ్ రాష్ట్రానికి చెందిన జస్వీందర్ సింగ్ (26) పెద్ద ప్లానే వేశాడు. ఆ దేశంలో నివసిస్తున్న తన కవల సోదరుడు (Twin Brother) చనిపోయాడని, అంత్యక్రియలకు (Funeral) హాజరు కావాలని వీసాకు (Visa) దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం ఏకంగా అతని సోదరుడు అగ్రరాజ్యంలో నివసిస్తున్నట్లు ధృవపత్రాలు కూడా సృష్టించాడు. ఆ ఫేక్ ట్విన్ స్థానంలో యూఎస్‌లో (US) స్థిరపడాలనేది మనోడి ప్లాన్. కానీ, చివరి నిమిషంలో వీసా ఇంటర్వ్యూ సమయంలో అమెరికన్ ఎంబసీకి (American Embassy) దొరికిపోయాడు. దాంతో రాయబార కార్యాలయం అతడి అక్రమ దరఖాస్తు, నకిలీ పత్రాల గురించి ఢిల్లీ పోలీసులకు (Delhi Police) సమాచారం ఇచ్చింది. ఎంబసీ సమాచారంతో పోలీసులు జస్వీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని మరో మిత్రుడు అతడికి సహకరించినట్లు నిర్ధారించారు. అతడితో కలిసి జస్వీందర్‌కు ఫేక్ డాక్యుమెంట్లు సరఫరా చేసిన అగ్రరాజ్యంలోని అతని పరిచయస్థుడి వివరాలను కూడా కనుగొనట్లు పోలీసులు తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని పాటియాలకు (Patiala) చెందిన జస్వీందర్ ఈ నెల 6వ తేదీన వీసా ఇంటర్వ్యూ (Visa Interview) కోసం ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీకి వచ్చాడు. ఇక తన ధృవపత్రాలలో తాను 2017 నుంచి పుణె క్రైం బ్రాంచీ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు తెలియజేశాడు. అంతేగాక ఇంటర్వ్యూ సమయంలో న్యూయార్క్‌లో (New York) చనిపోయిన తన సోదరుడు కుల్వీందర్ సింగ్ (Kulwinder Singh) ఆఖరి చూపులకు అవకాశం ఇవ్వాలని ఎంబసీ అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన సోదరుడికి ఎవరూ లేరని, అతనికి ఉన్న ఏకైక బంధం తానేనని కన్నీటిపర్యంతం అయ్యాడు. న్యూయార్క్‌లోని ప్లీజెంట్విల్లేలోని బీచర్ ఫ్లూక్స్ ఫునెరల్ హోమ్ వారి లేఖ, కల్వీందర్ అక్టోబర్ 24న చనిపోయినట్లు అధికారిక ధృవపత్రాన్ని కూడా ఎంబసీకి సమర్పించాడు.
అయితే, అధికారులకు కుల్వీందర్ ఫొటో అచ్చం జస్వీందర్లానే ఉండడంతో అనుమానం వచ్చింది. ఎంత కవలలు అయిన మాత్రాన ఎక్కడ ఏ చిన్న తేడా లేకుండా ఉండడం అధికారులకు అనుమానాన్ని మరింత పెంచింది. దాంతో వెంటనే న్యూయార్క్‌లో తన సోదరుడు చనిపోయిన ప్రాంతం పేరుపై జస్వీందర్ సమర్పించిన పత్రాల ఆధారంగా కూపీ లాగారు. అప్పుడు అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. అసలు ఆ ప్రాంతంలో కుల్వీందర్ పేరుతో ఎవరూ లేరని, అక్టోబర్ 24న ఆ పేరు గల వ్యక్తులేవరు చనిపోలేదని తెలుసుకున్నారు. వెంటనే ఎంబసీ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఈ విషయమై సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు జస్వీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నత నాటకాన్ని బయటపెట్టాడు. అనంతరం అతడిపై ఫ్రాడ్ కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.