ట్విటర్ పక్షి పయనమెటు?

ABN , First Publish Date - 2022-11-16T07:25:42+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో ట్విటర్ అత్యంత ప్రభావంతమైనది, భారత్ తో సహా కొన్ని వర్ధమాన దేశాలలో సామాన్యులలో ఫేస్‌బుక్ ప్రాచుర్యం పొందినా రాజకీయ, సామాజిక, ఆర్ధిక వర్గాలకు చెందిన ప్రముఖులలో అత్యధికులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ట్విటర్ ను వినియోగించడానికే ఇష్టపడతారు.

ట్విటర్ పక్షి పయనమెటు?

ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో ట్విటర్ అత్యంత ప్రభావంతమైనది, భారత్ తో సహా కొన్ని వర్ధమాన దేశాలలో సామాన్యులలో ఫేస్‌బుక్ ప్రాచుర్యం పొందినా రాజకీయ, సామాజిక, ఆర్ధిక వర్గాలకు చెందిన ప్రముఖులలో అత్యధికులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ట్విటర్ ను వినియోగించడానికే ఇష్టపడతారు. సామాజిక మాధ్యమాల వాడకంపై విశేష అభిరుచి చూపుతున్న భారత్, ట్విటర్ కు ప్రపంచంలో మూడవ పెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి కెక్కింది. కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు అన్నీ విధిగా ట్విటర్ ను వినియోగించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ ప్రొత్సహిస్తూ వస్తోంది. తత్ఫలితంగానే కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలోని మంత్రిత్వ శాఖలు అన్నీ ఇప్పుడు తమ సమాచారాన్ని ట్విటర్ ద్వారానే వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో మోదీ, రాష్ట్రాలలో కెటీఆర్, రేవంత్ రెడ్డి, నారా లోకేశ్, విజయసాయిరెడ్డి మొదలైనవారి ట్వీట్ల ఆధారితంగా వార్తలు పెరిగిపోతున్నాయి.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేసిన పోరాటంలో ట్విటర్ ఒకింత నిర్మాణాత్మక పాత్ర వహించింది. దీంతో కేంద్రం ఆ సామాజిక మాధ్యమాన్ని కట్టడి చేసే యత్నాలు చేసి సఫలమయింది. తమ రాజకీయ, సైద్ధాంతిక విధానాలకు భిన్నంగా ఉన్న వారెవరు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించకుండా తన అధికార పలుకుబడిని వినియోగించి ట్విటర్ ను నియంత్రిస్తుందన్న ఆరోపణలు మోదీ సర్కార్ పై ప్రబలంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ ప్రచారం చేయడంలో ప్రత్యర్ధులకు అందనంత ఎత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎలాగైతేనేం ట్విట్టర్ ను తన గుప్పిటలోకి తీసుకోగలిగింది. ఒక్క మన దేశమే కాదు, నైజీరియా, టర్కీ మొదలైన దేశాల ఒత్తిడికి కూడా ట్విటర్ తలవంచిన విషయాన్ని విస్మరించరాదు. సమాచార వ్యవహారాలపై నియంత్రణతో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండే గల్ఫ్ దేశాలు కొన్నింటికి ట్విటర్ సంస్ధలో భారీ పెట్టుబడులు ఉన్నాయనే విషయాన్ని కూడ గుర్తుంచుకోవాలి. గల్ఫ్ దేశాల పెట్టుబడులపై సాక్షాత్తు అమెరికా అధ్యక్ష శ్వేత భవనమే సందేహాలు వ్యక్తం చేసిన విషయాన్ని గమనించాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ అసత్య ప్రచారాలకు ట్విటర్ ను ఏ విధంగా దుర్వినియోగం చేసి అభాసుపాలయ్యారనే విషయాన్ని కూడ మరిచిపోరాదు. ఇక రాజకీయ విభేదాలు రచ్చకెక్కి వ్యక్తిగత నిందలు, తిట్ల వరకు కూడ ట్విటర్ వేదికగా మారి అసహ్యం, జుగుప్సాకర స్ధితికి చేరుకున్న విషయాన్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ఎంపీల (ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల) సందేశాలను గమనిస్తే తెలుస్తుంది.

హైద్రాబాద్ నుంచి వాషింగ్టన్ దాకా, యువ సామాజిక కార్యకర్తలు ఎందరో ట్విటర్ ను సామాజిక సంక్షేమ చర్యల కొరకు సమర్ధంగా సద్వినియోగం చేసుకొంటోన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా సమాచార మార్పిడి, అభిప్రాయాల వ్యక్తీకరణకు ట్విటర్ ఒక అనువైన వేదికగా ఉందనే విషయాన్ని అందరూ ఆంగీకరించి తీరాలి. ఒక ప్రైవేటు సంస్ధ యాజమాన్యం మారడం అనేది పూర్తిగా అంతర్గత వ్యవహారమే. అయినా ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల సంఘం దీనిపై స్పందించిందంటే ట్విటర్ ప్రాధాన్యం అవగతమవుతుంది.

ఈ నేపథ్యంలో విభిన్న వ్యాపారాలు చేసే కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ ను కైవసం చేసుకోవడం పై దుమారం రేగుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు గట్టి మద్దతుదారుడినని చెప్పుకునే మస్క్ ట్విటర్ ను కైవసం చేసుకున్న వెంటనే పక్షికి స్వేచ్ఛ లభించిందని పోస్ట్ చేసిన వ్యాఖ్య అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మానవతా వాదానికి మద్దతుగా తాను ట్విటర్ ను కొనుగోలు చేసానని కూడ ఆయన చెప్పుకొచ్చాడు. స్వేచ్ఛాయుత రాజకీయ అలోచనలు, ద్వేషపూరితమైన ప్రకటనలు పరస్పర వైరుధ్యాలు. ఒక వ్యాపారవేత్తగా విభిన్న వ్యాపారాలు చేసే మస్క్ అంతర్జాతీయంగా వివిధ దేశాలలో ట్విటర్ ను ఎంత వరకు స్వేచ్ఛగా ఎగరినిస్తాడనేది అనుమానమే.

ట్విటర్ లో ఇక అన్నీ ఉచితం కాదని మస్క్ చెప్పడం గమనార్హం. ఒక వ్యాపారవేత్త అయిన మస్క్ ట్విటర్ లో వాణిజ్య ప్రకటనల కంటే వినియోగదారుల నుంచి కొన్ని సేవలకు రుసుం వసూలు చేయడానికి ప్రాధాన్యమిస్తానని చెప్పడం కూడా అయోమయాన్ని సృష్టించింది. నిర్ణీత రుసుం చెల్లించడం ద్వారా విద్వేషాన్ని, అసత్యాలను, విభజన వాదాలను ఇక స్వేచ్ఛాయుతంగా ప్రచారం చేసుకోవడానికి కూడ ట్విటర్ మరింత బలమైన వేదికగా మారే అవకాశం ఉంది. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంఘం అధినేత వోకర్ టుర్క్ ఇదే విషయమై మస్క్ కు లేఖ రాస్తూ తన ఆందోళనను తెలియజేసారు. ద్వేషం, హింసా నియంత్రణతో పాటుగా ఆంగ్లేతర భాషలలోని ట్విటర్ సారాంశాల పై దృష్టి సారించవల్సిన అవశ్యకతను కూడ ఆయన ఎత్తి చూపాడు. ట్విటర్ రుసుం ప్రతిపాదన పై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నా మస్క్ పట్టించుకోవడం లేదు, తనను దినమంతా దూషించినా దానికి డబ్బు చెల్లించవల్సిందేనంటూ మస్క్ ఖండితంగా చెప్పాడు.

వాస్తవ మూల్యం కంటే అధికంగా 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ట్విటర్ ను మానవతా పూరిత సహాయానికి, భావ ప్రకటన స్వేచ్ఛ కు వేదికగా మారుస్తానని మస్క్ చెబుతున్నా ఆయన అసలు ఉద్దేశమేమిటో మున్ముందు గానీ తెలియదు. భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా ఒక వ్యాపార సంస్ధ ఏకాధిపత్యంలోకి వెళ్ళడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. సమాచార, భావ వ్యక్తీకరణ రంగాలలోకి రాజకీయ ప్రొత్సాహంతో బడా వ్యాపార సంస్ధలు ప్రవేశిస్తే సమాజం ఎదుర్కొనే దుష్ప్రభావాలు అసంఖ్యాకం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-11-16T07:27:55+05:30 IST