Kuwait: 127 మంది ప్రవాసులు అరెస్ట్!

ABN , First Publish Date - 2022-11-06T12:02:02+05:30 IST

గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై (Expats) ఉక్కుపాదం మోపుతోంది.

Kuwait: 127 మంది ప్రవాసులు అరెస్ట్!

వైత్ సిటీ: గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై (Expats) ఉక్కుపాదం మోపుతోంది. అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior), పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) అధికారులు, కువైత్ పోలీసులు (Kuwait Police) ప్రవాసులు అధికంగా ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కార్మిక, రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనలతో పాటు ఇతర నేరాలకు పాల్పడే ప్రవాసులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. ఇదే కోవలో శుక్రవారం సాల్మి (Salmi) ప్రాంతంలో పీఏఎం, అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో 127 మంది వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కార్మిక చట్టం (Labor law) ఉల్లంఘనకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, వీరిలో 93 మంది కార్మికులు అర్టికల్ 18 వీసా (Article 18 visa), 19 మంది కార్మికులు అర్టికల్ 20 వీసా (Article 20 visa)పై ఉన్నారు. మరో 15 మంది యజమానుల నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నవారు అని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా యజమానులు, ప్రవాస కార్మికులకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ అధికారులు కీలక సూచనలు చేశారు. యాజమాన్యం, కార్మికులు తప్పనిసరిగా కార్మిక చట్టాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మిక, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే ప్రవాసులను ఉపేక్షించబోమని, నేర తీవ్రతను బట్టి దేశ బహిష్కరణ కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు.

Updated Date - 2022-11-06T12:33:34+05:30 IST