Nirmala Sitharaman: నిలకడగా నిర్మలా సీతారామన్‌ ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-12-26T19:20:11+05:30 IST

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఎయిమ్స్ వైద్య వర్గాల ద్వారా తెలిసింది.

Nirmala Sitharaman: నిలకడగా నిర్మలా సీతారామన్‌ ఆరోగ్యం
Union Finance Minister Nirmala Sitharaman

ఢిల్లీ: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఎయిమ్స్ వైద్య వర్గాల ద్వారా తెలిసింది. పొట్టలో ఇన్ఫెక్షన్‌తో పాటు రొటీన్ చెకప్ కోసం ఆమె ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు.

ఆమె కొద్ది రోజులుగా కేంద్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. పారిశ్రామిక, వ్యాపార, కార్మిక సంఘాల నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఫిబ్రవరి ఒకటిన ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిన్న ఆమె మాజీ ప్రధాని వాజ్‌పేయి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. చెన్నైలో జరిగిన డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ 35వ స్నాతకోత్సవంలో కూడా ఆమె పాల్గొన్నారు.

నిర్మలా సీతారామన్ వయసు 63. 1959 ఆగస్ట్ 18న ఆమె తమిళనాడు తిరుచారాపల్లిలో జన్మించారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. ఆమె భర్త టీవీ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్. ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మీడియా సలహాదారుగా పనిచేశారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.

తొలిరోజుల్లో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే ఆడిటింగ్ సంస్థలో నిర్మలా సీతారామన్ సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ ఆమె పనిచేశారు. 2003 నుంచి 05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. 2010లో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి అధికార ప్రతినిధి బాధ్యతలను స్వీకరించారు.

నిర్మలా సీతారామన్ గతంలో రక్షణ శాఖను కూడా నిర్వహించారు. రక్షణ శాఖను నిర్వహించిన తొలి మహిళా మంత్రిగా ఆమె రికార్డులకెక్కారు. 2019 నుంచి ఆమె ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022లో ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. సాధారణ సేల్స్‌ మేనేజర్‌ నుంచి అంచెలంచెలుగా ఆమె కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖను నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-12-26T19:24:00+05:30 IST