RSS HQ: ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు

ABN , First Publish Date - 2022-12-31T20:36:16+05:30 IST

నగరంలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి

RSS HQ: ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు
RSS

నాగ్‌పూర్: నగరంలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో ఉన్న ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తామంటూ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీస్ కంట్రోల్ రూముకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు కార్యాలయానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అంగుళం అంగుళం క్షుణ్ణంగా గాలించారు. చివరికి బాంబు లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బీడీడీఎస్ (Bomb Detection and Disposal Squad), డాగ్ స్క్వాడ్ కార్యాలయానికి చేరుకుని తనిఖీలు నిర్వహించినట్టు డీసీపీ (జోన్ 3) గోరఖ్ భమ్రే తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కార్యాలయ పరిసరాల్లో పెట్రోలింగ్‌ను పెంచినట్టు చెప్పారు. కంట్రోల్ రూముకు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

కార్యాలయం వద్ద ఇప్పటికే ఉన్న కేంద్ర రిజర్వు బలగాలు, నాగ్‌పూర్ పోలీసులకు తోడు అదనపు బలగాను మోహరించినట్టు డీసీపీ తెలిపారు. ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల కదలికలపై నిఘా వేసినట్టు పేర్కొన్నారు. ఆరెస్సెస్ కార్యాలయం వద్ద బలగాలను పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ బాంబు బెదిరింపునకు సంబంధించి నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.

Updated Date - 2022-12-31T20:36:18+05:30 IST