Shashi Tharoor : సచిన్ పైలట్ బాటలో శశి థరూర్!

ABN , First Publish Date - 2022-11-24T19:33:46+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ‘స్నేహపూర్వకంగా’ బరిలో దిగిన శశి థరూర్ ఆ పార్టీలో తనకంటూ

Shashi Tharoor : సచిన్ పైలట్ బాటలో శశి థరూర్!
Shashi Tharoor, Sachin Pilot

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ‘స్నేహపూర్వకంగా’ బరిలో దిగిన శశి థరూర్ ఆ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాజస్థాన్‌ యువ నేత సచిన్ పైలట్ మాదిరిగా తనకంటూ కొందరు మద్దతుదారులను కూడగట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆయనకు మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ (Ashok Gehlot)ను గద్దె దించి, సచిన్ పైలట్ (Sachin Pilot)కు ఆ పదవిని ఇవ్వాలని పైలట్ వర్గం ఆ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తోంది. గుజ్జర్ నేత విజయ్ బైన్‌స్లా మాట్లాడుతూ, సచిన్ పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) నిరంతరాయంగా రాజస్థాన్‌లో జరుగుతుందని చెప్పారు. ఈ రెండు వర్గాల మధ్య పోరు చాలా కాలం నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితులు కేరళలో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు కాంగ్రెస్ (Congress) నేతలు వేర్వేరు గ్రూపులుగా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, అటువంటి నేతల్లో కొందరిని ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు శశి థరూర్ (Shashi Tharoor) భావిస్తున్నారని తెలుస్తోంది.

గుర్రుగా ఉన్న కేపీసీసీ చీఫ్

శశి థరూర్ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు. అయితే కొన్ని మైళ్ళ దూరంలోని మలబార్‌లో ఆయన పర్యటిస్తున్నారు. నవంబరు 23న కన్నూరులో పర్యటించారు. ఇది కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే సుధాకరన్ స్వస్థలం. థరూర్ పర్యటనపై సుధాకరన్ గుర్రుగా ఉన్నారు. అయితే థరూర్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తనకు ఘన స్వాగతం పలికారని తెలిపారు. కొందరు ఒత్తిడి చేసినప్పటికీ వీరు తనను ఆదరించారని తెలిపారు.

మెగా ర్యాలీ

కొట్టాయం జిల్లాలోని ఎఝటుపెట్టలో డిసెంబరు 3న మెగా యూత్ కాంగ్రెస్ ర్యాలీ జరగబోతోంది. ఈ సభకు స్టార్ అట్రాక్షన్‌గా శశి థరూర్ హాజరవుతారు. ఇది కేరళవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గొప్ప ఊపునిస్తుందని చెప్తున్నారు. ఆయన మద్దతుదారు కే మురళీధరన్ మాట్లాడుతూ, ఈ సభను అడ్డుకోవడం ఓ కుట్ర అన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వెనుకకు తగ్గడానికి కారణాలు తనకు తెలుసునని, అయితే ఇది అంతర్గత వ్యవహారం కాబట్టి తాను దీని గురించి మాట్లాడబోనని చెప్పారు. కొందరు నేతల ఒత్తిళ్ళ మేరకే వారు వెనుకకు తగ్గారన్నారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నవారికి థరూర్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించడం మింగుడుపడటం లేదన్నారు. అయితే థరూర్‌ను వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు దీనిని అంగీకరించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనకు మద్దతివ్వవచ్చునని చెప్తున్నారు.

థరూర్ వర్గం

శశి థరూర్ తనంతట తాను తన నియోజకవర్గానికి వెలుపల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. దీనికి కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కేరళలో శక్తిమంతమైన నేతలు వేర్వేరు గ్రూపులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శశి థరూర్ వర్గం వచ్చిందని కొందరు అంటున్నారు.

‘యూ’ అవసరం

కాంగ్రెస్ మిత్రపక్షం ముస్లిం లీగ్‌ నేతలతో చర్చించిన తర్వాత శశి థరూర్ మాట్లాడుతూ, విభజన లేదా గ్రూపులు కట్టేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు కొందరు తనను విమర్శిస్తున్నారన్నారు. గ్రూపులు కట్టాలనే ఉద్దేశం, ఆసక్తి తమకు లేవన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే ‘ఏ’, ‘ఐ’ గ్రూపులు ఉన్నాయన్నారు. ఇక ‘ఓ’, ‘వీ’ అనే ఆల్ఫాబెట్స్‌తో సరికొత్త గ్రూపులను జత చేయనక్కర్లేదన్నారు. ఇంకా ఏదైనా అక్షరం కావాలనుకుంటే, అది ‘యూ’ (యునైటెడ్) మాత్రమేనని చెప్పారు. అందరికీ కావలసినది ఇదేనని చెప్పారు. మిత్ర పక్ష నేతతో ఇద్దరు యూడీఎఫ్ ఎంపీలు సమావేశమవడంలో పెద్ద విషయం ఏముందో తనకు అర్థం కావడం లేదన్నారు.

వేచి చూస్తున్న ఏఐసీసీ

థరూర్ మలబార్ పర్యటనపై స్పందించేందుకు ఏఐసీసీ నేతలు తిరస్కరించారు. పరిస్థితి అంత వరకు రాలేదని కాంగ్రెస్ పార్టీ కేరళ ఇన్‌ఛార్జి తారిక్ అన్వర్ చెప్పారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే కేపీసీసీ పరిష్కరించగలదన్నారు. ఆయన శుక్రవారం కొజిక్కోడ్‌లో పర్యటిస్తారు. పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అవసరమైతే పార్టీ నేతలతో సమావేశమవుతానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. థరూర్ శైలిని వ్యతిరేకిస్తున్న నేతలు తమ గోడును అన్వర్‌కు చెప్పుకునే అవకాశం ఉంది.

అధిష్ఠానం దృష్టికి...

కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, థరూర్ పట్ల తమ అభ్యంతరాలను పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే తెలియజేశామన్నారు. అయితే లిఖితపూర్వకంగా ఏమీ అందజేయలేదని, అలా ఇవ్వాలని అధిష్ఠానం తమను కోరలేదని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ ప్రచారానికి థరూర్ సహకరించడం లేదని చెప్పారు.

‘‘గడచిన 14 ఏళ్ళలో థరూర్ ఎన్నడూ పార్టీ కార్యకర్తలతో సన్నిహితంగా మెలగలేదు. ఆయన గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగానే అందరూ పరిగణించేవారు. ఆయన స్వతంత్రంగా వ్యవహరించేవారు. రాష్ట్ర నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకునేవారు కాదు. ఈ నేపథ్యంలో ఆయన మలబార్‌లో పర్యటిస్తుండటం పార్టీ కార్యకర్తలను ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా గాంధీ కుటుంబంతో ఆయన సంబంధాలు మునుపటి మాదిరిగా లేకపోవడంతో ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో చెప్పుకోదగ్గ స్థానం దక్కకపోవచ్చు’’నని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా థరూర్ ప్రవర్తిస్తే, ఆయనను పార్టీ అధిష్ఠానం కట్టడి చేస్తుందనే ధీమాతో ఆయన వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఆయనను వ్యతిరేకిస్తున్న ప్రముఖ కాంగ్రెస్ నేతల్లో కేసీ వేణుగోపాల్, కొడిక్కున్నిల్ సురేశ్ ఉన్నారు. వీరికి మద్దతుగా ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ నిలుస్తున్నారు.

అటు కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతోనూ సత్సంబంధాలు లేని శశి థరూర్ కేరళ ముఖ్యమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం సాధ్యం కాదనే ధీమా ఆయన వ్యతిరేక వర్గాల్లో వ్యక్తమవుతోంది. అంతేకాకుండా కాంగ్రెస్‌లో తిరుగుబాటును యూడీఎఫ్ కూటమి పక్షాలు సమర్థించబోవనే నమ్మకం కనిపిస్తోంది. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పని చేయాలని తాము కోరుకుంటున్నామని ఈ కూటమిలోని ఓ పార్టీ నేత చెప్పారు. ఇదిలావుండగా, శశి థరూర్ ప్రజాకర్షణగల నేత అని సామాన్య కార్యకర్తలు భావిస్తున్నారు.

Updated Date - 2022-11-24T19:33:54+05:30 IST