RBI Rupee : రూపాయికి రెక్కలు!

ABN , First Publish Date - 2022-12-20T01:08:54+05:30 IST

రూపాయి.. ఇప్పటి వరకూ ఇండియాకే పరిమితం! కానీ, ఇప్పుడు అంతర్జాతీయ కరెన్సీగా మారుతోంది! రాబోయే రోజుల్లో డాలర్‌, పౌండ్‌ తదితరాల సరసన నిలవనుంది! ఇతర దేశాల్లోని సంక్షోభం మనకు వరంగా మారుతోంది! ఇప్పటికే రష్యా, శ్రీలంక, మారిషస్‌ దేశాలతో రూపాయిల్లోనే ఆర్థిక లావాదేవీలకు మార్గం

RBI Rupee : రూపాయికి రెక్కలు!

అంతర్జాతీయ కరెన్సీ దిశగా పయనం

రష్యా, శ్రీలంక, మారిషస్‌లతో

రూపాయిల్లోనే మారకానికి ఆర్బీఐ అంగీకారం

మన బ్యాంకులు, ఆయా దేశాల బ్యాంకుల

మధ్య ఇప్పటికే 18 ఖాతాలు ఓపెన్‌

తమకూ కావాలంటున్న మరిన్ని దేశాలు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, శ్రీలంక ఆర్థిక

సంక్షోభంతోనే రూపీ మారకం దిశగా అడుగు

(సెంట్రల్‌ డెస్క్‌)

రూపాయి.. ఇప్పటి వరకూ ఇండియాకే పరిమితం! కానీ, ఇప్పుడు అంతర్జాతీయ కరెన్సీగా మారుతోంది! రాబోయే రోజుల్లో డాలర్‌, పౌండ్‌ తదితరాల సరసన నిలవనుంది! ఇతర దేశాల్లోని సంక్షోభం మనకు వరంగా మారుతోంది! ఇప్పటికే రష్యా, శ్రీలంక, మారిషస్‌ దేశాలతో రూపాయిల్లోనే ఆర్థిక లావాదేవీలకు మార్గం సుగమం కాగా.. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్‌, తజక్‌స్థాన్‌, క్యూబా, లగ్జెంబర్గ్‌, సుడాన్‌, గల్ఫ్‌, ఆఫ్రికన్‌ దేశాల మధ్య కూడా రూపాయిల్లో చెల్లింపులు జరగనున్నాయి! ఆయా దేశాలు కూడా రూపాయిల్లో చెల్లింపులకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్బీఐని కోరుతున్నాయి కూడా. ఎక్కువ దేశాల మధ్య రూపాయిల్లోనే లావాదేవీలు జరిగితే.. మన రూపాయి కూడా అంతర్జాతీయ కరెన్సీ కానుంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలోపేతం కావడమే కాదు.. భారతదేశ వాణిజ్య లోటు కూడా తగ్గుముఖం పట్టనుంది. వివిధ దేశాల మధ్య ఎగుమతి, దిగుమతులు జరుగుతుంటాయి కదా! అందుకు, ఆయా దేశాల ఎగుమతి, దిగుమతిదారుల మధ్య చెల్లింపులు జరుగుతుంటాయి కదా! కానీ, మన దేశంలో రూపాయి; రష్యాలో రూబుల్‌, చైనాలో యెన్‌ ఇలా రకరకాల కరెన్సీలు ఉంటాయి. వాటి మధ్య చెల్లింపులు సాధ్యం కాదు. అందుకే, డాలర్‌, పౌండ్‌ తదితర అంతర్జాతీయ కరెన్సీల ద్వారా ఇప్పటి వరకూ ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. మరికొన్ని దేశాలు వస్తు మార్పిడి పద్ధతిని కూడా అమలు చేస్తుంటాయి. ఉదాహరణకు, ఇరాన్‌ మనకు చమురును పంపిస్తుంది. అందుకు ప్రతిగా మనం ఆ దేశానికి గోధుమలను ఎగుమతి చేస్తాం.

భారత్‌-రష్యా మధ్య 12 వోస్ట్రో ఖాతాలు

ఇటీవల రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చినప్పుడు రష్యాతో వాణిజ్యంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా అతి తక్కువ ధరకు చమురు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చింది. అయితే, ఆంక్షల కారణంగా డాలర్లలో చెల్లింపులకు అవకాశం లేకపోవడంతో వోస్ట్రో ఖాతాల (రూపీ ట్రేడింగ్‌కు బ్యాంకుల్లో ప్రత్యేకంగా తెరిచే ఖాతాలు)ద్వారా రూపాయలు-రూబుల్స్‌లోనే వాణిజ్యం చేయాలని భారత్‌-రష్యా నిర్ణయించాయి. రష్యాతో వాణిజ్యానికి 12 వోస్ట్రో ఖాతాలను తెరిచేందుకు ఆర్బీఐ అంగీకరించింది. తొలుత, ఈ ఏడాది జూలైలో మన దేశంలో బ్రాంచీలున్న రష్యాలోని ప్రముఖ బ్యాంకులైన ఎస్‌బెర్‌ బ్యాంక్‌, వీటీబీ బ్యాంకులు వోస్ట్రో ఖాతాలు తెరిచాయి. అమెరికా, యూరప్‌ దేశాల నుంచి ఆంక్షల భయంతో వోస్ట్రో ఖాతాలు తెరిచేందుకు ఎస్బీఐ తొలుత నిరాకరించింది. కానీ, ఆ తర్వాత ఎస్బీఐ సహా పలు బ్యాంకులు రష్యా బ్యాంకులతో కలిసి వోస్ట్రో ఖాతాలు తెరిచాయి. ప్రస్తుతం రష్యా, భారత్‌ బ్యాంకుల మధ్య 12 వోస్ట్రో ఖాతాలున్నాయి. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు వాణిజ్య లావాదేవీలు జరపడానికి తగినంత విదేశీ మారక ద్రవ్యం లేదు. ఈ నేపథ్యంలో, రూపాయిల్లో అంతర్జాతీయ చెల్లింపులు జరుపుతామని, తమ దేశంలో విదేశీ కరెన్సీగా రూపాయికి అనుమతి ఇవ్వాలంటూ భారత్‌కు శ్రీలంక విజ్ఞప్తి చేసింది. దాంతో, ఐదు వోస్ట్రో ఖాతాలు తెరిచేందుకు ఇటీవల ఆర్బీఐ అనుమతి తెలిపింది. ఫలితంగా, పది వేల డాలర్లు అంటే దాదాపు రూ.8.2 లక్షల వరకూ శ్రీలంక పౌరులు రూపాయిల రూపంలో తమ వద్ద ఉంచకోవచ్చు. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ల బదులు రూపాయిల్లోనే పరస్పరం చెల్లింపులు చేసుకోవచ్చు. దాంతో, శ్రీలంకతో ఐదు; మారిషస్‌ బ్యాంకుతో ఒక వోస్ట్రో ఖాతాలను తెరిచింది. వెరసి, భారత్‌లోని తమ బ్రాంచీల్లో 18 విదేశీ బ్యాంకులు వోస్ట్రో ఖాతాలను తెరిచాయి.

ఆఫ్రికన్‌ దేశాల్లోనూ డాలర్లకు కొరత

ఆఫ్రికన్‌ దేశాల్లో కూడా డాలర్లకు కొరత ఏర్పడుతోంది. దాంతో, అవి కూడా రూపాయిల్లో చెల్లింపులు చేయాలని భావిస్తున్నాయి. ఏటా ఈజిప్టు నుంచి 3520 మిలియన్‌ డాలర్లు; అల్గేరియా నుంచి వెయ్యి మిలియన్‌ డాలర్లు; అంగోలా నుంచి దాదాపు 2700 మిలియన్‌ డాలర్ల వస్తువులను భారత్‌ దిగుమతి చేసుకుంటుంది. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌ నుంచి ఏటా దాదాపు 2000 మిలియన్‌ డాలర్ల (రూ.16,500 కోట్లు) సరుకులు దిగుమతి అవుతాయి. డాలర్ల కొరత కారణంగా రూపాయిల్లోనే చెల్లింపులకు అనుమతించాలని ఆయా దేశాలు కోరుతున్నాయి. ఇందుకు ఆర్బీఐ ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే, రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలని భావిస్తున్న భారత్‌.. ఆయా దేశాలకు అనుమతి ఇచ్చేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని వాణిజ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. డాలర్లు లేని దేశాలతో రూపీ మారకం చేయాలని ఈ ఏడాది జూలై నుంచే భారత్‌ పావులు కదుపుతోంది. దీనిని ఇప్పుడు వేగవంతం చేస్తోంది. మన దేశానికి యూఏఈ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. దాంతో, ఆ దేశంతో రూపీ చెల్లింపుల విధానం దిశగా ఆర్బీఐ ఇప్పటికే విధాన పత్రాన్ని తయారు చేసింది కూడా. ఇరు దేశాల సెంట్రల్‌ బ్యాంకుల మధ్య దీనిపై సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించామని, వోస్ట్రో ఖాతాలు తెరవాలంటూ ఇప్పటికే పలువురు ఎగుమతి, దిగుమతిదారులు బ్యాంకులను సంప్రదిస్తున్నారని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ తెలిపారు.

ఏమిటీ వోస్ట్రో ఖాతా!?

వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు జరపడానికి ఏర్పాటు చేసే ఖాతానే వోస్ట్రో అకౌంట్‌ అంటారు. విదే శీ బ్యాంకుతో ఆర్థిక లావాదేవీలు జరపడానికి స్థానిక బ్యాంకు లేదా బ్రాంచీల్లో వీటిని తెరుస్తారు. ఎగుమతి, దిగుమతులు చేసినప్పుడు వాటికి ఎంత చెల్లించాలో రూపాయిల్లోనే ఇన్వాయిస్‌లు తయారు చేస్తారు. అప్పటి మార్కెట్లోని ఎక్స్‌చేంజ్‌ రేట్ల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. ఇన్వాయి్‌సల ప్రకారం ఆయా మొత్తాలను వారి వారి వోస్ట్రో ఖాతాల్లో జమ చేస్తారు.

గతంలోనూ...

వివిధ దేశాలతో రూపాయిల్లో మారకం ఇప్పుడు కొత్తేమీ కాదు. 1960ల్లోనే ఖతార్‌, యూఏఈ, కువైత్‌, ఒమాన్‌ దేశాలతో రూపాయిల్లోనే లావాదేవీలు జరిగేవి. తూర్పు యూరప్‌ దేశాలతో కూడా భారత్‌కు ఇటువంటి ఒప్పందమే ఉండేది. అయితే, కారణాలు తెలియదు కానీ.. ఆ దశకం మధ్యలోనే ఈ విధానానికి చరమ గీతం పాడారు.

Updated Date - 2022-12-20T01:08:55+05:30 IST