BJP Meet: గుజరాత్ ముగిసింది.. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మోదీ ఫోకస్

ABN , First Publish Date - 2022-12-05T14:13:45+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాక ముందే, ఇంకా ఫలితాలు కూడా రాకముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేశారు.

BJP Meet: గుజరాత్ ముగిసింది.. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మోదీ ఫోకస్
PM Narendra Modi

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాక ముందే, ఇంకా ఫలితాలు కూడా రాకముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేశారు. గుజరాత్ రెండో విడత ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లో ఓటేసిన మోదీ ఆ తర్వాత హస్తినకు చేరుకున్నారు. న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహిస్తున్నారు. బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లు హాజరైన ఈ సమావేశంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథులు ఫోకస్ చేయనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఏఏ అంశాలను ఎన్నికల ప్రచారం చేయాలనే విషయంపై చర్చిస్తున్నారు.

తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి-బీజేపీ మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పులా ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేస్తే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. రెండు పార్టీల మధ్య ఎన్నడూ లేనంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టఫ్ ఫైట్ ఇవ్వడంతో టీఆర్ఎస్ ఆశ్చర్యంలో పడింది. మునుగోడులో మెజార్టీ ఆశించనంత మేర రాలేదని స్వయంగా మంత్రి కేటీఆర్ ఒప్పుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మునుగోడులాగే టీఆర్ఎస్‌ను ఢీ కొంటామని కమలనాథులంటున్నారు. బీజేపీ క్యాడర్‌ను ఎన్నికల సమరానికి సన్నద్ధంగా ఉంచేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు. కింది స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రిశశిధర్ రెడ్డి లాంటి నాయకులను ఆకర్షించడంలో కమలనాథులు విజయవంతమౌతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కీలక నేతల వలసలు మరింతగా ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్‌ను ఢీకొట్టేది తామే అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మునుగోడులో తమ పోరాట పటిమను ఉదాహరణగా చూపిస్తున్నారు. రాష్ట్ర నేతల వ్యూహాలతో పాటు బీజేపీ అధినాయకత్వం పైఎత్తులు టీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-05T14:26:07+05:30 IST