Rahul Gandhi: గుజరాత్‌లో కాంగ్రెస్‌దే విజయం: రాహుల్
ABN , First Publish Date - 2022-10-31T21:15:52+05:30 IST
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) క్లీన్ స్వీప్
హైదరాబాద్: త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటనలతోనే సంచలనం సృష్టిస్తోంది తప్ప దాని ప్రభావం ఏమీ లేదని కొట్టిపడేశారు. ‘ఆప్’కు కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో మద్దతు ఇస్తోందన్న విమర్శలను రాహుల్ కొట్టిపడేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో (Bharat Jodo) యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావవంతంగా పోటీ చేస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీది అంతా ‘గాలే’నని, క్షేత్రస్థాయిలో దాని ప్రభావం ఏమాత్రమూ లేదని తేల్చి చెప్పారు. ప్రకటనలతోనే అది సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలో రెండు భావజాలల మధ్యే పోరు జరుగుతోందని అన్నారు. అందులో ఒకటి దేశాన్ని విభజించాలని చూస్తుంటే, మరోటి దేశాన్ని ఒక్కటి చేయాలని భావిస్తోందన్నారు. ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందన్నారు. ఆరెస్సెస్, బీజేపీ భావజాలాన్ని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ సామరస్యంగా పనిచేయాలని రాహుల్ సూచించారు.