MCD Elections: గెలిచింది ఆప్... మేయర్ మాత్రం బీజేపీ నుంచి!.. రూల్స్ అలా ఉన్నాయి మరి!

ABN , First Publish Date - 2022-12-07T21:39:15+05:30 IST

పార్టీ ఫిరాయింపుల చట్టం ఎంసీడీ వార్డు మెంబర్లకు వర్తించదు.

MCD Elections: గెలిచింది ఆప్... మేయర్ మాత్రం బీజేపీ నుంచి!.. రూల్స్ అలా ఉన్నాయి మరి!
MCD Elections

న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 250 వార్డులకు గాను 134 వార్డులు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 104, కాంగ్రెస్ 9, ఇతరులు 3 వార్డుల్లో గెలుపొందారు. అయితే 134 స్థానాలు గెలుచుకున్నా మేయర్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచే గెలుస్తారనే గ్యారంటే లేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ రూల్స్ అలా ఉన్నాయి మరి.

ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ అభ్యర్ధిని నిలబెడితే బీజేపీ వ్యతిరేకించవచ్చు. అలాగే తన అభ్యర్ధిని నిలబెట్టవచ్చు. మేయర్ కోసం జరిగే ఎన్నికలో ఏ పార్టీపైన గెలిచిన వార్డ్ మెంబర్ అయినా అవతలి పార్టీ అభ్యర్థికి ఓటు వేయవచ్చు. పైగా పార్టీ ఫిరాయింపుల చట్టం ఎంసీడీ వార్డు మెంబర్లకు వర్తించదు. దీంతో ఆయా పార్టీల తరపున గెలిచిన సభ్యులంతా వారి పార్టీ బలపరిచిన మేయర్ అభ్యర్థికే ఓటెయ్యాలని లేదు. దీంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ ఏర్పడింది. చండీగఢ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అక్కడ బీజేపీ మేయర్ ఉన్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఐటీ విభాగం ఇంఛార్జ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేసి మరీ తెలిపారు. కాబట్టి ఢిల్లీ మేయర్‌పై ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చని తెలుస్తోంది.

మేయర్ పదవీకాలం ఏడాది మాత్రమే. ప్రస్తుతం ఎన్నుకునే మేయర్ పదవీకాలం నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఏప్రిల్‌లో పదవీకాలం ముగుస్తుంది. ప్రతి ఏడాది ఏప్రిల్‌లో కొత్త మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈసారికి మహిళా అభ్యర్థికి రిజర్వ్ చేశారు. మూడో ఏడాది దళిత అభ్యర్థికి రిజర్వ్ చేశారు.

ఈస్ట్, సౌత్, నార్త్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌గా (ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) మార్చాక ఈ నెలలో జరిగిన తొలి ఎన్నికలివి. గతంలో 272 వార్డులుండేవి. ముగ్గురు మేయర్లు ఉండేవారు. ఇప్పుడు 250 వార్డులతో పాటు ఒకే మేయర్ ఉంటారు.

Updated Date - 2022-12-07T21:39:22+05:30 IST