Currency Notes : ‘కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తొలగించండి’
ABN , First Publish Date - 2022-12-28T20:56:34+05:30 IST
భారత దేశ కరెన్సీ నోట్ల నుంచి మహాత్మా గాంధీ (Mahatma Gandhi) బొమ్మను తొలగించాలని ఆయన ముని మనుమడు
న్యూఢిల్లీ : భారత దేశ కరెన్సీ నోట్ల నుంచి మహాత్మా గాంధీ (Mahatma Gandhi) బొమ్మను తొలగించాలని ఆయన ముని మనుమడు తుషార్ గాంధీ (Tushar Gandhi) వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల విడుదల చేసిన ఈ-నోట్‌లో మహాత్మా గాంధీ ఫొటో లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వెలిబుచ్చారు.
భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) ఇటీవల భారత దేశ డిజిటల్ కరెన్సీ CBDCని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ-నోట్‌లో మహాత్మా గాంధీ బొమ్మ లేదనే సంగతి కూడా తెలిసిందే. గాంధీజీ బొమ్మ లేకపోవడంపై తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కాగితపు కరెన్సీ నోటులో కూడా గాంధీజీ బొమ్మను తీసేయాలని వ్యంగ్యంగా అన్నారు.
తుషార్ డిసెంబరు 26న ఇచ్చిన ట్వీట్‌లో, కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీపైన బాపూజీ బొమ్మను చేర్చనందుకు ఆర్బీఐకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. ఇక ‘దయచేసి ఆయన బొమ్మను కాగితపు కరెన్సీ నుంచి కూడా తొలగించండి’ అని పేర్కొన్నారు.
నగదు ఆధారిత భారత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుపీని ప్రవేశపెట్టింది. దీనినే ఈ-రుపీ అని కూడా అంటారు. ప్రయోగాత్మకంగా దీనిని ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో డిసెంబరులో ఆర్బీఐ ప్రవేశపెట్టింది.