Maharashtra : పీఎం మోదీపై దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-12-21T16:51:06+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మోదీ మన దేశానికి జాతి పిత (Father of the Nation) అని పేర్కొన్నారు. మరి మహాత్మా గాంధీ సంగతి ఏమిటని ప్రశ్నించినపుడు ఆమె స్పందిస్తూ మోదీ నవ భారతానికి జాతి పిత అని వివరించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) సతీమణి అమృత ఫడ్నవీస్ ఇటీవల నాగ్‌పూర్‌లో రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జాతి పితగా అభివర్ణించారు. అయితే మహాత్మా గాంధీ ఏమవుతారని ప్రశ్నించినపుడు ఆమె బదులిస్తూ, మోదీ నవ భారత జాతి పిత అని చెప్పారు. ఇద్దరు జాతి పితలు ఉన్నారని, ఒకరు నాటి తరానికి, మరొకరు నేటి తరానికి జాతి పిత అని తెలిపారు.
మోదీని జాతి పితగా అభివర్ణించడం అమృతకు కొత్త కాదు. ఆమె 2019 సెప్టెంబరు 17న ఇచ్చిన ట్వీట్‌లో మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనను జాతి పితగా అభివర్ణించారు.