Lalu Prasad Yadav: సింగపూర్ చేరిన లాలూ..కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె ఆచార్య

ABN , First Publish Date - 2022-11-27T17:57:25+05:30 IST

Lalu Welcomed By Daughter Who is Donating Kidney To Him,సింగపూర్ చేరిన లాలూ..కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె ఆచార్య

Lalu Prasad Yadav: సింగపూర్ చేరిన లాలూ..కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె ఆచార్య

న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) సింగపూర్ చేరుకోవడంతో ఆయన కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) భావోద్వేగంతో ట్వీట్ చేశారు. 74 ఏళ్ల లాలూ ప్రసాద్ పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. శనివారం ఆయన సింగపూర్ చేరుకోవడానికి ముందు అక్కడే నివాసం ఉంటున్న ఆచార్య తన కిడ్నీని డొనేట్ చేసేందుకు మందుకు వచ్చారు. ''తండ్రి దగ్గర ఉన్న ప్రతిక్షణం సంతోషం మన సమీపంలోనే ఉటుంది. ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలో మా తండ్రిగారు నాకు నేర్పించారు. సమాజంలోని పేద, అణగారిన, దోపిడీకి గురవుతున్న వారికి హక్కులు కల్పించారు'' అని లాలూ సింగపూర్‌ చేరుకోగానే వీడియోతో కూడిన ట్వీ‌ట్‌ను ఆమె పోస్ట్ చేశారు. వీల్ చైర్‌లో ఉన్న లాలూకు ఆమె పాదాభివందనం చేస్తున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది.

తన తండ్రికి బాసటగా ఆమె ఇంతకుముందు కూడా పలు ట్వీట్లు చేశారు. తన కిడ్నీని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. "మా తండ్రికి నేను ఇస్తున్నది కేవలం ఒక చిన్న కండరం ముక్క మాత్రమే. ఆయన కోసం ఏదైనా చేస్తాను. ఆయన పూర్తి ఆరోగ్యంతో రావాలని అందరూ ప్రార్థించండి'' అని మరో ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. డిసెంబర్ 5వ తేదీన లాలూకు శస్త్రచికిత్స జరుగనుంది.

పశుగ్రాసం కుంభకోణంలో ప్రస్తుతం బెయిలుపై ఉన్న లాలూ ప్రసాద్ గత నెలలో కొన్ని చెకప్‌ల కోసం సింగపూర్ వెళ్లి అక్టోబర్ 24న తిరిగి వచ్చేశారు. మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న లాలూ కుమార్తె భారతిని ఆయనతో కలిసి సింగపూర్ వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు శనివారంనాడు ఆమోదం తెలిపింది.

Updated Date - 2022-11-27T17:57:27+05:30 IST