Jharkhand : సంక్షోభ సమయంలో సీఎం హేమంత్ సొరేన్ సరికొత్త ఎత్తుగడ

ABN , First Publish Date - 2022-11-06T18:17:10+05:30 IST

అక్రమ గనుల తవ్వకం కేసులో ఇరుక్కున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ (Hemant Soren) సరికొత్త వ్యూహంతో

Jharkhand : సంక్షోభ సమయంలో సీఎం హేమంత్ సొరేన్ సరికొత్త ఎత్తుగడ
Jharkhand CM Hemant Soren

రాంచీ : అక్రమ గనుల తవ్వకం కేసులో ఇరుక్కున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ (Hemant Soren) సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు. డొమిసిల్ పాలసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ కోటాలకు సంబంధించిన బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. గిరిజనుల భావోద్వేగాలకు సంబంధించిన స్థానికత, రిజర్వేషన్ల అంశాలను చేపట్టడం వల్ల రాజకీయ పార్టీల మధ్య వివాదాలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు.

జేఎంఎం చీఫ్, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ పేరు మీద ఓ స్టోన్ చిప్స్ మైనింగ్ లీజ్ ఉందని, తనకు తానే ఈ లీజ్ ఇచ్చుకున్నారని, ఆయన లాభదాయక పదవిని అనుభవిస్తున్నారని బీజేపీ గతంలో జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయిస్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును గవర్నర్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. కమిషన్ దీనిపై దర్యాప్తు జరిపి, సొరేన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ఆగస్టు నెలాఖరులో సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అయితే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. మరోవైపు తమ సమక్షంలో నవంబరు 3న హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినప్పటికీ, ఆయన హాజరుకాలేదు.

దీనిపై సొరేన్ స్పందిస్తూ, తాను తప్పు చేసి ఉంటే తనను తానే శిక్షించుకుంటానని చెప్పారు. తనకు సమన్లు పంపించడానికి బదులు తనను అరెస్ట్ చేయాలని ఈడీని సవాల్ చేశారు. మరోవైపు ఆయన అనేక ప్రజాప్రయోజనకరమైన ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులకు పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని, ‘‘మీ ప్రభుత్వం-మీ గుమ్మం దగ్గరే’’నని ప్రకటిస్తున్నారు.

తాజా ప్రకటనలో, నవంబరు 11 మళ్లీ ఓ చరిత్రాత్మక దినం అవుతుందని సొరేన్ చెప్పారు. రెండేళ్ళ క్రితం సర్న ఆదివాసీ రెలిజియన్ కోడ్ ఆమోదం పొందిందన్నారు. ఈ ఏడాదిలో ఖటియాన్ (భూమి రికార్డులు) డొమిసిల్ పాలసీని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ కోటాల పెంపు బిల్లును ఆమోదించబోతున్నామని చెప్పారు.

రాష్ట్రంలో స్థానికతను నిర్వచించే డొమిసిల్ పాలసీ గిరిజనుల భావోద్వేగాలకు సంబంధించిన సమస్య. ఇది రాజకీయంగా వివాదాస్పద అంశం కూడా. రాష్ట్రవాసిగా ఓ వ్యక్తిని నిర్ణయించాలంటే 1932ను ఆధార సంవత్సరంగా పరిగణించాలని డొమిసిల్ పాలసీ బిల్లు చెప్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను పెంచుతామని ఎన్నికల్లో జేఎంఎం హామీ ఇచ్చింది.

ముఖ్యమంత్రి ప్రకటనలు రాష్ట్రంలో సుదీర్ఘ కాలంపాటు ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసమే ఆయన ఈ ప్రకటనలు చేస్తున్నారంటున్నారు.

Updated Date - 2022-11-06T18:17:16+05:30 IST