Sonia Gandhi Vs Dhankar : సోనియా గాంధీ వ్యాఖ్యలపై స్పందనకు అదే కారణం : జగదీప్ ధన్‌కర్

ABN , First Publish Date - 2022-12-23T15:26:31+05:30 IST

కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gandhi) వ్యాఖ్యలపై తాను ఎందుకు స్పందించినదీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్

Sonia Gandhi Vs Dhankar : సోనియా గాంధీ వ్యాఖ్యలపై స్పందనకు అదే కారణం : జగదీప్ ధన్‌కర్
Sonia Gandhi, Jagdeep Dhankar

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gandhi) వ్యాఖ్యలపై తాను ఎందుకు స్పందించినదీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ (Jagdeep Dhankhar) శుక్రవారం వివరించారు. న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని, అధికారాన్ని తగ్గించే ప్రయత్నంలో మంత్రులు, రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఏకమయ్యారని ఆమె చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించి ఉండకపోతే, తాను తన ప్రమాణాన్ని తిరస్కరించినట్లు అయి ఉండేదని, తనకుగల రాజ్యాంగపరమైన బాధ్యతను నిర్వహించడంలో విఫలమైనట్లు అయి ఉండేదని తెలిపారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

సోనియా గాంధీ (Sonia Gandhi) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె డిసెంబరు 21న మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది ఇబ్బందిపెట్టే కొత్త పరిణామమని తెలిపారు. ప్రజల దృష్టిలో న్యాయ వ్యవస్థ విలువను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. మంత్రులు, ఓ అత్యున్నత స్థాయి రాజ్యాంగబద్ధ అధికారి వివిధ కారణాలను చూపుతూ న్యాయ వ్యవస్థపై దాడి చేస్తూ ప్రసంగించేందుకు ఉద్యుక్తులయ్యారని ఆరోపించారు.

ధన్‌కర్ డిసెంబరు 22న మాట్లాడుతూ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అత్యున్నత స్థాయి రాజ్యాంగ పదవులను నిర్వహించేవారిని పక్షపాత వైఖరులకు ఆపాదించవద్దని రాజకీయ నేతలను కోరారు. న్యాయ వ్యవస్థ (Judiciary) ఔన్నత్యాన్ని తగ్గించడమనేది తన ఆలోచనకు అతీతమైనదని చెప్పారు. సోనియా వ్యాఖ్యలు తన అభిప్రాయాలకు చాలా దూరంగా ఉన్నాయన్నారు.

సీనియర్ కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ రాజ్యసభలో శుక్రవారం ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయనతోపాటు అదే పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) కూడా మాట్లాడారు. ఖర్గే మాట్లాడుతూ, ఓ లోక్ సభ సభ్యురాలు (సోనియా గాంధీ) బయట ఏదో మాట్లాడితే, దాని గురించి రాజ్యసభలో చర్చించకూడదని తెలిపారు. ఈ విషయంలో రాజ్యసభ (Rajya Sabha) చైర్మన్ వ్యాఖ్యలు చేస్తే, అది దురదృష్టకరమన్నారు. ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. ఈ సభలో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని, ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి, రాజ్యసభ నేత పీయూష్ గోయల్ (Piyush Goyal) మాట్లాడుతూ, రాజ్యసభ, అత్యున్నత స్థాయి రాజ్యాంగ అధికారి, పార్లమెంటు ఉభయ సభలు ఎన్నుకున్న, ఈ దేశానికి ఉప రాష్ట్రపతి ప్రతిష్ఠ, ఔన్నత్యాలపై దాడి జరిగిన విషయాన్ని ఖర్గే చెప్పాలన్నారు.

జగదీప్ ధన్‌కర్ స్పందిస్తూ, న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు అధికార పార్టీ రాజ్యసభ చైర్మన్‌ను, ఉప రాష్ట్రపతిని చేర్చుకోవచ్చునని అత్యంత తీవ్ర స్థాయిలో ఉన్న వ్యాఖ్యలపైనే తాను స్పందించానని అన్నారు. తాను స్పందించి ఉండకపోతే, గౌరవ, మర్యాదలను కోల్పోయే పరిస్థితులు వచ్చి ఉండేవన్నారు. న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ సూచనల మేరకు హానికరమైన, నష్టదాయకమైన ప్రణాళికను అమలు చేసే పక్షంగా రాజ్యసభ చైర్మన్ మారిపోయారనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం జరిగి ఉండేదన్నారు. న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించడమంటే ప్రజాస్వామ్యానికి మృత్యు ఘంటిక అని వివరించారు. ఈ పక్షపాత యుద్ధం మన మధ్యనే పరిష్కారం కావాలన్నారు. తాను మాజీ సెక్రటరీ జనరల్స్‌తోనూ, ఈ అంశంపై పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరితోనూ పెద్ద ఎత్తున సంప్రదించానని తెలిపారు. సోనియా గాంధీ వ్యాఖ్యలపై స్పందించకపోతే, తాను చేసిన ప్రమాణాన్ని తిరస్కరించినవాడినవుతానని, రాజ్యాంగపరమైన బాధ్యతల నుంచి తప్పించుకున్నట్లు అవుతుందని తుది నిర్ణయానికి వచ్చానని తెలిపారు.

Updated Date - 2022-12-23T15:26:37+05:30 IST