Kashmir Files : అతిథిని గౌరవించే దేశానికొచ్చి అలా మాట్లాడటానికి సిగ్గుండాలి : ఇజ్రాయెల్ దౌత్యవేత్త

ABN , First Publish Date - 2022-11-29T18:30:52+05:30 IST

కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) సినిమా కేవలం ప్రోపగాండా, వల్గర్ అని అనుచితంగా మాట్లాడిన నడవ్ లపిడ్

Kashmir Files : అతిథిని గౌరవించే దేశానికొచ్చి అలా మాట్లాడటానికి సిగ్గుండాలి : ఇజ్రాయెల్ దౌత్యవేత్త
Kashmir Files

న్యూఢిల్లీ : కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) సినిమా కేవలం ప్రోపగాండా, వల్గర్ అని అనుచితంగా మాట్లాడిన నడవ్ లపిడ్ (Nadav Lapid)పై భారత దేశానికి ఇజ్రాయెల్ రాయబారి నఓర్ గిలన్ (Naor Gilon) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి, ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలన్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) జ్యూరీ చీఫ్‌గా గౌరవించి, ఇచ్చిన ఆహ్వానాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

ఇజ్రాయెల్‌కు చెందిన స్క్రీన్ రైటర్, డైరెక్టర్ నడవ్ లపిడ్ ఈ ఉత్సవాల జ్యూరీ చైర్‌పర్సన్. ఆయన సోమవారం ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా మాట్లాడుతూ, కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోటీలో పాల్గొన్న 15 సినిమాల్లో 14 సినిమాలపై జ్యూరీ సభ్యులు సవివరంగా చర్చించారని, 15వ సినిమా (కశ్మీర్ ఫైల్స్) తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. అది తమకు వల్గర్ ప్రోపగాండాగా కనిపించిందన్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక ఉత్సవాల్లో కళాత్మక పోటీ విభాగంలో ప్రదర్శించడానికి తగినది కాదన్నారు.

1990వ దశకంలో కశ్మీరు లోయలో అనేక మంది కశ్మీరీ పండిట్లు ప్రాణాలు కోల్పోవడం, అక్కడి నుంచి పారిపోవడం గురించి వివరిస్తూ కశ్మీరు ఫైల్స్ సినిమాను తీసిన సంగతి తెలిసిందే.

నడవ్ లపిడ్ వ్యాఖ్యలపై భారత దేశానికి ఇజ్రాయెల్ రాయబారి నఓర్ గిలన్ మంగళవారం ఘాటుగా స్పందించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాను విమర్శించిన నడవ్ లపిడ్‌కు బహిరంగ లేఖ రాస్తున్నానని గిలన్ ట్విటర్ వేదికగా తెలిపారు. భారత దేశంలోని సోదర, సోదరీమణులు తన భావాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆంగ్లంలో ఈ ట్వీట్ చేస్తున్నానని, అందుకే దీనిని హిబ్రూ భాషలో రాయడం లేదని పేర్కొన్నారు. తన లేఖ సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి తాను చివర్లో చెప్పవలసినదానిని ముందుగా చెబుతానని తెలిపారు. ‘‘నువ్వు సిగ్గుపడాలి. ఎందుకంటే...’’ అని మొదట పేర్కొన్నారు.

‘‘భారతీయ సంస్క‌తిలో అతిథిని దైవంగా భావిస్తారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల జడ్జీల ప్యానెల్‌కు అధ్యక్షత వహించాలని భారత దేశం మిమ్మల్ని ఆహ్వానించింది. ఆ ఆహ్వానాన్ని మీరు దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా మీకు భారతీయులు ఇచ్చిన ఆతిథ్యం, మీమీద వారు పెట్టుకున్న నమ్మకం, మీకు ఇచ్చిన గౌరవాలను మీరు దుర్వినియోగం చేశారు’’ అని నడవ్ లపిడ్‌పై ఇజ్రాయెల్ రాయబారి గిలన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణను వివరిస్తూ ఫౌదా (@FaudaOfficial) అనే టీవీ సీరియర్‌ను అవి ఇస్సాచరాఫ్ (@issacharoff), లియోర్ రజ్ (@lioraz) నిర్మించారు. రజ్, అవిలను ఈ చలన చిత్రోత్సవాలకు భారత దేశం ఆహ్వానించింది. ఈ విషయాన్ని గిలన్ ప్రస్తావిస్తూ, ‘‘ఫౌదా, ఇజ్రాయెల్ పట్ల తమ ప్రేమాభిమానాలను ఆనందంగా వ్యక్తం చేయడం కోసం లియోర్ రజ్, ఇస్సాచరాఫ్‌లను మన భారతీయ మిత్రులు ఆహ్వానించారు. మిమ్మల్ని ఓ ఇజ్రాయెలీగా, నన్ను ఓ రాయబారిగా ఆహ్వానించడానికిగల కారణాల్లో ఇదొకటి అయి ఉండవచ్చు’’నని తెలిపారు.

‘‘మీ ప్రవర్తనను ‘సమర్థించుకోవడం’ కోసం మీరు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని అర్థమవుతోంది. కానీ, ‘మనం ఒకే విధమైన శత్రువుతో పోరాడుతున్నాం, మనకు దుర్మార్గమైన పొరుగు దేశం ఉంది’ అని, అందువల్ల మన రెండు దేశాల మధ్య సారూప్యత ఉంది అని వేదికపైన మంత్రి, నేను అన్నట్లు మీరు ఆ తర్వాత వై నెట్ న్యూస్‌కు ఎందుకు చెప్పారో అర్థంకావడం లేదు’’ అని తెలిపారు.

‘‘మన దేశాల మధ్య సారూప్యతలు, సాన్నిహిత్యం గురించి మేమిద్దరం మాట్లాడాం. ఇజ్రాయెల్ ఓ హై టెక్ దేశంకావడం, సినీ పరిశ్రమతో హైటెక్‌ను అనుసంధానం చేయడానికి అవకాశం ఉండటం వల్ల తన ఇజ్రాయెల్ పర్యటన గురించి మంత్రి గారు చెప్పారు. భారతీయ సినిమాలు చూస్తూ పెరిగామని నేను చెప్పాను. గొప్ప సినీ సంస్కృతి ఉన్న భారత దేశం (ఫౌదా వంటి అనేక ) ఇజ్రాయెలీ కంటెంట్‌ను వినియోగిస్తున్నందుకు తాము ఎంతో రుణపడి ఉన్నామని కూడా నేను చెప్పాను’’ అని తెలిపారు.

తాను సినిమా రంగంలో నిపుణుడిని కాదని, అయినప్పటికీ లోతుగా అధ్యయనం చేయకుండా చారిత్రక సంఘటనలపై మాట్లాడటం అవివేకమని తనకు తెలుసునని తెలిపారు. ఆ చారిత్రక సంఘటనల గాయం ఇప్పటికీ వేధిస్తోందని, దీనివల్ల బాధపడుతున్నవారు ఇప్పటికీ మన చుట్టూ ఉన్నారని, మూల్యం చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ కొబ్బి షోషాని స్పందిస్తూ, కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినపుడు తనకు కన్నీళ్ళు వచ్చాయన్నారు. ఈ సినిమాను చూడటం తేలికైన విషయం కాదన్నారు. దీనిని ఇజ్రాయెల్‌లో కూడా ప్రదర్శించారని అనుకుంటున్నానన్నారు. తాము యూదులమని, తాము కూడా అనేక కష్టాలకు గురయ్యామని చెప్పారు. ఇతరుల బాధలను కూడా మనం పంచుకోవాలని తెలిపారు.

ఆయన వ్యక్తిగతం : జ్యూరీ మెంబర్

ఇదిలావుండగా, నడవ్ లపిడ్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ బోర్డు ప్రకటించింది. జ్యూరీ మెంబర్ సుదీప్తో సేన్ ఇచ్చిన ట్వీట్‌లో, నడవ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, అవి జ్యూరీ సమష్టి అభిప్రాయాలు కాదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-29T18:31:16+05:30 IST