Himachal CM Sukhwinder : హిమాచల్‌ సీఎం సుఖ్వీందర్‌

ABN , First Publish Date - 2022-12-11T01:22:01+05:30 IST

మంచుకొండల రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ డ్రామాకు తెరపడింది. ఆ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరో తేలిపోయింది. అధికారం తమకే దక్కాలంటూ ధిక్కార ధోరణితో మాట్లాడిన రాచ కుటుంబానికి చెందిన ప్రతిభాసింగ్‌ను కాదని..

Himachal CM Sukhwinder : హిమాచల్‌ సీఎం సుఖ్వీందర్‌

రాజ కుటుంబానికి చెందిన ప్రతిభాను కాదని ఎంపిక..

40 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది మద్దతు ఆయనకే

తాజా ఎన్నికల్లో ప్రచార కమిటీ సారథి

సీఎం రేసు నుంచి తప్పుకొన్న ప్రతిభా

శిమ్లా/న్యూఢిల్లీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మంచుకొండల రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ డ్రామాకు తెరపడింది. ఆ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరో తేలిపోయింది. అధికారం తమకే దక్కాలంటూ ధిక్కార ధోరణితో మాట్లాడిన రాచ కుటుంబానికి చెందిన ప్రతిభాసింగ్‌ను కాదని.. సాధారణ నేపథ్యం ఉన్న సుఖ్వీందర్‌ సుఖు (58)ను అనూహ్య రీతిలో సీఎంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. మొత్తం 40 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 25 మందిపైగా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ విషయం తెలిసి సీఎల్పీ భేటీకి ముందే ప్రతిభా రేసు నుంచి తప్పుకొన్నారు. తాజా ఎన్నికల్లో సుఖ్వీందర్‌ ప్రచార కమిటీ సారథిగా పనిచేశారు. హమీర్పూర్‌ జిలా నదౌన్‌ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీకి సన్నిహితులు. సుఖ్వీందర్‌ ప్రమాణ స్వీకారం ఆదివారం ఉంటుందని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కాగా, సీనియర్‌ నేత ముఖేష్‌ అగ్నిహోత్రితో పాటు మరొక డిప్యూటీ సీఎంను నియమించునున్నట్లు తెలుస్తోంది. రెండో డిప్యూటీ సీఎంగా ప్రతిభా కుమారుడు విక్రమాదిత్య పేరు వినిపిస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఖర్గేతో పాటు రాహుల్‌, ప్రియాంక హాజరుకానున్నారు.

ప్రతిభా వర్గం పట్టుబట్టినా..

సుఖును సీఎం చేయడాన్ని అధిష్ఠానం పరిశీలకులు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగేల్‌, రాష్ట్ర ఇన్‌ఛార్జి రాజీవ్‌ శుక్లా, హర్యానా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ వద్ద ప్రతిభాసింగ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఓ దశలో ముఖేష్‌ను సీఎం చేయాలని ప్రతిభా వర్గీయులు ప్రతిపాదించినా ఫలితం లేకపోయింది. నిర్ణయం జరిగిపోవడం, కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామనడంతో ప్రతిభా మెత్తబడ్డారు. అయితే, ఆమె మద్దతుదారులు శిమ్లాలో అధిష్ఠానం పరిశీలకులు బస చేసిన హోటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. గేట్లను మూసివేశారు. అధిష్ఠానం అమ్ముడుపోయిందంటూ ఆరోపణలు చేశారు. తర్వాత శాంతించారు.

విద్యార్థి నాయకుడి నుంచి సీఎంగా..

హిమాచల్‌ప్రదేశ్‌ వర్సిటీలో ఎన్‌ఎ్‌సయూఐ సారథిగా 1980ల చివర్లో సుఖు ప్రస్థానం ప్రారంభమైంది. న్యాయ విద్య అనంతరం రాజకీయ నాయకుడిగా మారారు. 2000లో రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2008లో రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా నాయకుడిగా, పార్టీ కార్యకర్తల మనసు చూరగొన్నారు. సిమ్లా మునిసపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా, దాదాపు ఆరున్నర సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు.

విధేయతతోనే అధిష్ఠానం మొగ్గు?

హిమాచల్‌ కాంగ్రెస్‌పై వీరభద్రసింగ్‌ కుటుంబానిది తిరుగులేని ఆధిపత్యం. వీరిది రాజ కుటుంబం. సుఖ్వీందర్‌ది సాధారణ నేపథ్యం. అయినా అధిష్ఠానం విధేయుడిగా భావించి సీఎం చేయనుంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుక్షణమే సీఎం పదవి తమకే దక్కాలని, తమ కుటుంబాన్ని పక్కనపెడితే ఉపద్రవమే అంటూ అల్టిమేటం తరహాలో ప్రతిభా మాట్లాడారు. సుఖ్వీందర్‌ మాత్రం హై కమాండ్‌ నిర్ణయమే శిరోధార్యం అన్న మాటకు కట్టుబడ్డారు.

Updated Date - 2022-12-11T01:22:02+05:30 IST