Ghulam Nabi Azad: ఆజాద్ యూ టర్న్... తిరిగి కాంగ్రెస్‌లోకి!

ABN , First Publish Date - 2022-12-30T19:01:34+05:30 IST

డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్‌ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు.

Ghulam Nabi Azad: ఆజాద్ యూ టర్న్... తిరిగి కాంగ్రెస్‌లోకి!
Ghulam Nabi Azad may rejoin Congress Party

న్యూఢిల్లీ: డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్‌ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించి రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కోగలిగేది కాంగ్రెస్ ఒక్కటేనని, తాను కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం కాదని, పార్టీ వ్యవస్థలో ఉన్న లోపాలతో మాత్రమే విభేదిస్తున్నానంటూ ఆజాద్ వ్యాఖ్యానించడంతో అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో భారత్ జోడో యాత్రకు రావాలంటూ దిగ్విజయ్ సింగ్ ఆయనకు ఆహ్వానం కూడా పంపారు. జీ23 అసమ్మతి నేతల్లో ఉన్న బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్, హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ హుడా నేరుగా గులాం నబీ ఆజాద్‌‌ను కలిసి ఆహ్వానం పలికారు. ఆజాద్ క్యాంప్ నుంచి కూడా నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వెళ్లారు.

అతి త్వరలో భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించనుంది. ఆ సమయంలో గులాం నబీ ఆజాద్ తన పార్టీ క్యాడర్‌తో యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అంబికా సోని కూడా ఆజాద్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీని వీడేటప్పుడు గులాం నబీ ఆజాద్ రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు పరిపక్వత లేదని, ఆయన వ్యక్తిగత సహాయకులే పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. తనలాంటి అనుభవం ఉన్న సీనియర్ నేతలను పక్కన పెట్టేస్తున్నారని విమర్శించారు. పార్టీలో సంప్రదింపుల విధానాన్ని రాహుల్ తుంగలో తొక్కారని, ఏ మాత్రం అనుభవం లేని భజనపరులతో కొత్త కోటరీ వచ్చిందని ఆజాద్ విమర్శించారు.

52 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన ఆజాద్‌.. ఆగస్టు 26న ఆ పార్టీ వీడారు. తమ డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాల మీద నిర్మితమైందని చెప్పారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ సిద్ధాంతాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీలోని ఆజాద్‌కు, తన పేరుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

కాంగ్రెస్‌లో ఆజాద్ ప్రస్థానం

73 సంవత్సరాల ఆజాద్ 1949లో జమ్ముకశ్మీర్‌లోని డోడా జిల్లాలోని సోటి గ్రామంలో జన్మించారు. కాంగ్రెస్‌లో చేరి కీలక నేతగా మారి 2006లో సొంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు లోక్‌సభ, ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో మరింత ఉన్నత స్థానానికి ఎదిగారు. 1982 నుంచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారి కేంద్రమంత్రి అయ్యారు. 2006, 2008లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం జరగడాన్ని చాలామంది ‘ద్రోహం’గా అభివర్ణించారు. కాంగ్రెస్‌లోని బలమైన గాంధీ కుటుంబంపై తిరుగుబావుటా ఎగరువేసి, 23 మంది నేతలతో కలిసి జి23 గ్రూపు ఏర్పాటు చేసి గ్రాండ్ ఓల్డ్ పార్టీపై తిరుగుబాటు చేసిన నేతగా ఆజాద్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

ఆజాద్ 1970 మధ్యలో కాంగ్రెస్‌లో చేరారు. 1973 నుంచి 1975 వరకు జమ్ముకశ్మీర్‌లోని భలెస్సాలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 1975-76లో జమ్మూకశ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగారు. మహారాష్ట్రలోని వాసిమ్ నుంచి 1980లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1982లో ఇందిరాగాంధీ హయాంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ దిగ్గజాలైన రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి వారితో కలిసి పనిచేశారు. 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి వారు తనకు ఆదర్శమని ఆజాద్ చెబుతారు.

Updated Date - 2022-12-30T19:08:36+05:30 IST