Rahul Gandhi: చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ సర్కార్ నిద్రపోతోంది..

ABN , First Publish Date - 2022-12-16T18:32:47+05:30 IST

పొరుగు దేశమైన చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని దాచిపెడుతోందని, నిద్రపోతున్నట్టు కనిపిస్తోందని ..

Rahul Gandhi: చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ సర్కార్ నిద్రపోతోంది..

జైపూర్: పొరుగు దేశమైన చైనా (China) యుద్ధానికి (War) సిద్ధమవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని దాచిపెడుతోందని, నిద్రపోతున్నట్టు కనిపిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో గత శుక్రవారం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో యాత్ర సాగిస్తున్న రాహుల్ శుక్రవారంనాడు నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును దాచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చైనా చొరబాట్లకు మాత్రమే పరిమితం కాకుండా యుద్ధానికి సన్నద్ధమవుతోందని చెప్పారు. కేంద్రం మాత్రం చైనాకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా లేదన్నారు.

భారత్‌కు చెందిన 200 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తమ అధీనంలోకి తీసుకుందని రాహుల్ ఆరోపించారు. ''చైనా నుంచి ముప్పు ఉందని నాకు చాలా స్పష్టంగా అనిపిస్తోంది. గత రెండుమూడేళ్లుగా ఈ విషయం చాలా స్పష్టంగా చెబుతూ వస్తున్నా. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పు విషయాన్ని దాచిపెట్టడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ జరక్కూడదు'' అని రాహుల్ అన్నారు.

బీజేపీ వ్యక్తిగతంగా తన ప్రతిష్టను, కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఒక పద్ధతి ప్రకారం ప్రచారం సాగిస్తోందంటూ రాహుల్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సైద్ధాంతిక విలువలకు కట్టుబడిన పార్టీ అని, ఫాసిజానికి పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు.

వేగంగా స్పందించిన బీజేపీ...

చైనా యుద్ధానికి సన్నద్ధమవుతున్నా, కేంద్రం నిమ్మకు నీరెత్తుతున్నట్టు వ్యవహరిస్తోందంటూ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై బీజేపీ వెంటనే స్పందించింది. భారత సాయుధ బలగాల శౌర్యాన్ని రాహుల్ అనుమానిస్తున్నారంటూ విరుచుకుపడింది. యూనిఫాంలో ఉన్న భారత బలగాలు చైనా సైనికులపై ఎలా విరుచుకుపడ్డారనేది ఒక్క రాహుల్ గాంధీ మినహా ప్రతి భారతీయుడు వీక్షించి, గర్వించారని, చైనీయులతో కుదుర్చుకున్న ఎంఓయూ కారణంగానే రాహుల్ ప్రతిసారి మన బలగాల శక్తిసామర్థ్యాలను సందేహిస్తుంటారని, ఆయన కుటుంబం చైనీయుల ఆదరాభిమానాలు పొందుతూ, ఆర్‌‌జీ ఫౌండేషన్‌కు నిధులు అందుకుంటోందని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ఒక ట్వీట్‌లో విమర్శించారు.

Updated Date - 2022-12-16T18:32:49+05:30 IST