BJP: మోదీపై పాకిస్థాన్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ
ABN , First Publish Date - 2022-12-16T23:25:48+05:30 IST
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) గుజరాత్ కసాయి అంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావుల్ భుట్టో (Bilawal Bhutto) చేసిన వ్యాఖ్యలకు బీజేపీ (BJP) నేతలు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) గుజరాత్ కసాయి అంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావుల్ భుట్టో (Bilawal Bhutto) చేసిన వ్యాఖ్యలకు బీజేపీ (BJP) నేతలు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. 1971లో భారత సైన్యం చేతిలో పాకిస్థాన్ ఓడినందుకు ఇంకా భుట్టో బాధలోనే ఉన్నట్టుందని కేంద్ర మంత్రులు చురకలంటించారు. పాకిస్థాన్ మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలో పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీస్ వద్ద బీజేపీ నేతలు నిరసనకు దిగారు. భుట్టో వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. భుట్టో వ్యాఖ్యలు సిగ్గుచేటంటూ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. శనివారం రోజు రాజధాని నగరాల్లో పాక్ మంత్రి భుట్టో దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడని.. కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడన్న పాక్ మంత్రి భుట్టో వ్యాఖ్యలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.