Contractor Suicide: సర్కార్ నెత్తిన మరో పిడుగు

ABN , First Publish Date - 2022-12-31T16:41:34+05:30 IST

ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల్లో అవినీతిపై కాంగ్రెస్ ఏకధాటి ప్రచారం చేస్తుండంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న..

Contractor Suicide: సర్కార్ నెత్తిన మరో పిడుగు

బెంగళూరు: ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల్లో అవినీతిపై కాంగ్రెస్ ఏకధాటి ప్రచారం చేస్తుండంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) ప్రభుత్వం మరోసారి చిక్కుల్లో పడింది. కర్ణాటకలోని తుంకూరు జిల్లాకు చెందిన మరో కాంట్రాక్టరు (Contractor) ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. అతనిని టీఎన్ ప్రసాద్ అనే కాంట్రాక్టరు (50)గా పోలీసులు గుర్తించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.16 కోట్లు విలువ చేసే ప్రభుత్వ కాంట్రాక్టును పూర్తి చేసే బాధ్యతను అతనికి ప్రభుత్వం అప్పగించింది.

కాగా, ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాకపోవడం, రుణాలు ఇచ్చిన వారి వద్ద నుంచి ఒత్తిళ్లు కారణంగా కాంట్రాక్టరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తు్న్నారు. తాను జీర్ణోద్ధరణ చేస్తున్న ఇన్‌స్పెక్షన్ బంగ్లాలోనే కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. ''కాంట్రాక్టరు ప్రసాద్ గత గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద అసహజ మరణంగా శుక్రవారంనాడు కేసు నమోదు చేశాం. సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం. తన మరణానికి ఎవరూ కారణం కాదని ఆ సూసైడ్ నోటులో అతను రాశాడు'' అని కేసు పరిశోధనా అధికారి ఒకరు తెలిపారు.

కాగా, కాంట్రాక్టర్ ప్రసాద్ పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్నాడని, వాటిని తీర్చేందుకు 5 నెలల క్రితం తన ఇంటిని కూడా అమ్ముకున్నాడని కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు బలరామ్ తెలిపారు. ''బిల్లులు చాలా కాలంగా క్లియర్ కాలేదు. ఇదే విషయం నాకు ఫోను చేసి చెప్పాడు. అప్పుడు చాలా డిప్రషన్‌లో మాట్లాడుతున్నట్టు అనిపించింది. కింద నుంచి పైఅధికారుల వరకూ అందరి వద్దకూ వెళ్లి బిల్లులు క్లియర్ చేయమని కోరినప్పటికీ జాప్యం జరుగుతోందని నాదగ్గర వాపోయాడు. అయితే ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటాడని మాత్రం అనుకోలేదు'' అని ప్రసాద్ సన్నిహితుడు ఒకరు తెలిపారు.

కాంగ్రెస్ ఫైర్...

బొమ్మై సర్కార్‌లో ఏ కాంట్రాక్టులు కావాలన్నా 40 శాతం కమిషన్లు ఇస్తే పనైపోతుందంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా విస్తృత ప్రచారం సాగిస్తోంది. 'పేసీఎం' పోస్టర్లు, ప్రచారంతో ప్రజల్లోకి దూసుకువెళ్తోంది. అయితే, ఇది కాంగ్రెస్ దుష్ట పన్నామని, రాజకీయ దురుద్దేశాలతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందంటూ బొమ్మై ప్రభుత్వం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. ఇటీవలనే ఒక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర వివాదం కావడంతో గత ఏప్రిల్‌లో మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు.

Updated Date - 2022-12-31T16:41:36+05:30 IST