Xi Jinping step down: జిన్‌పింగ్ గద్దె దిగు.. చైనాలో పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం

ABN , First Publish Date - 2022-11-27T18:28:20+05:30 IST

ప్రపంచమంతా కరోనా భయం నుంచి బయటపడి పూర్వ స్థితికి చేరుకుంటున్న వేళ.. చైనాను కరోనా మహమ్మారి

Xi Jinping step down: జిన్‌పింగ్ గద్దె దిగు.. చైనాలో పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం
China

బీజింగ్: ప్రపంచమంతా కరోనా భయం నుంచి బయటపడి పూర్వ స్థితికి చేరుకుంటున్న వేళ.. చైనాను కరోనా మహమ్మారి (Corona Virus) భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత నాలుగైదు నెలలుగా చాలా నగరాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ‘జీరో కొవిడ్ పాలసీ’ని అనుసరిస్తున్న చైనా (China) ఒక్క కేసు కనిపించినా సరే ఆ ప్రాంతంలో కఠిన ఆంక్షలు విధించడంతోపాటు లాక్‌డౌన్ అమలు చేస్తోంది. దీంతో నెలల తరబడి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇది ప్రజాగ్రహానికి కారణమైంది.

తాజాగా, గత గురువారం వాయవ్య చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలోని ఉరుమ్‌కీలో ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్నిప్రమాదం జరిగి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాక్‌డౌన్‌ (Lockdown)లో మగ్గిపోతున్న ప్రజల ఆగ్రహానికి ఇది మరింత కారణమైంది. భవనంలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయడం వల్ల లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని, చివరికి శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ చనిపోయిన వారికి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున జనం భవనం వద్దకు చేరుకున్నారు. ఆంక్షలను తోసిరాజని పూలు, పండ్లతో ఆ ప్రాంతానికి చేరుకుని చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.

పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన జనాన్ని అదుపు చేయలేని పోలీసులు వారిని చెదరగొట్టేందుకు పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. దీంతో మరింత రెచ్చిపోయి నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జిన్ పింగ్ స్టెప్‌డౌన్.. కమ్యూనిస్ట్ పార్టీ స్టెప్ డౌన్’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, ఈ నిరసనలు ఇతర నగరాలకు కూడా వ్యాపించాయి. ఆయా నగరాల్లోనూ మృతులకు నివాళులు అర్పిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులను మోహరిస్తున్నారు.

కరోనా ఆంక్షల కారణంగానే భవనంలోని వారు రక్షించుకునే మార్గం లేక మృత్యువాత పడ్డారని, మంటలను అదుపు చేసేందుకు వచ్చిన సహాయక సిబ్బందికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని చెబుతున్నారు. దీంతో మంటలను అదుపు చేసేందుకు వారికి మూడు గంటల సమయం పట్టిందని ఆరోపించారు. ఇళ్లకు గొలుసులతో తాళాలు వేయడం వల్ల లోపలున్న వారికి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నిరసనకారులు చేస్తున్న ఆరోపణలను అధికారులు కొట్టిపడేశారు. ప్రమాదం జరిగిన భవనం వద్ద ఎలాంటి ఆంక్షలు అమల్లో లేవని స్పష్టం చేశారు. కాగా, షింజియాంగ్‌లో 100 రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉంది. దాదాపు 10 మిలియన్ల మంది ఉయిఘర్లు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక, కరోనా ఆంక్షల కారణంగా ఉరుమ్కిలోని నాలుగు మిలియన్లమంది మూడు నెలలకు పైగా ఇళ్లకే పరిమితమయ్యారు.

Updated Date - 2022-11-27T18:28:21+05:30 IST