North Korea: శత్రుదేశ సినిమా చూశారని.. విద్యార్థులను బహిరంగంగా కాల్చి చంపారు!

ABN , First Publish Date - 2022-12-06T19:48:07+05:30 IST

దాయాది దేశాలైన ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సౌత్ కొరియా(South Korea) ను

North Korea: శత్రుదేశ సినిమా చూశారని.. విద్యార్థులను బహిరంగంగా కాల్చి చంపారు!

ప్యోంగ్యాంగ్: దాయాది దేశాలైన ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సౌత్ కొరియా(South Korea) ను లక్ష్యంగా నార్త్ కొరియా (North Korea) చేపడుతున్న క్షిపణి పరీక్షలకు అంతేలేదు. ఇక, ఆ దేశంలో ఉండే ఆంక్షల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అక్కడి ప్రజలు ధరించే దుస్తులు, హెయిర్ స్టైల్ సహా ప్రజల జీవన విధానం అంతా ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ చెప్పినట్టుగానే ఉండాలి. కిమ్ తండ్రి, మాజీ అధినేత అయిన కిమ్ జాంగ్ చనిపోయి పదేళ్లు అయిన సందర్భంగా ఇటీవల జారీ చేసిన ఆంక్షలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయి. 11 రోజులు సంతాప దినాలు ప్రకటించిన కిమ్ ఆ రోజుల్లో ప్రజలెవ్వరూ నవ్వకూడదని, సంతోషంగా ఉండకూడదని, మద్యం తాగకూడదని ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ప్రపంచాన్ని మరోమారు షాక్‌కు గురిచేసింది. సౌత్ కొరియా సినిమాను చూడడంతోపాటు దానిని స్నేహితులతో పంచుకున్నందుకు ఇద్దరు హైస్కూల్ విద్యార్థులకు మరణశిక్ష విధించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశంలో దక్షిణ కొరియా డ్రామాలు చూడడం చట్టం ప్రకారం శిక్షార్హం. విద్యార్థులకు మరణశిక్ష విధించిన విషయాన్ని ‘రేడియో ఫ్రీ ఆసియా’ వెల్లడించింది.

చైనాతో సరిహద్దులు పంచుకునే నార్త్ కొరియా ప్రావిన్స్‌లో ర్యాంగాంగ్‌కు చెందిన టీనేజర్లు అక్టోబరు మొదట్లో హైస్కూల్‌లో కలుసుకున్నారు. అక్కడ వారు పలు కొరియన్, అమెరికన్ డ్రామా షోలు చూశారు. విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులిద్దరినీ ప్రజల ముందుకు బహిరంగంగా తీసుకొచ్చి తుపాకితో కాల్చి చంపి మరణశిక్ష అమలు చేశారు.

Updated Date - 2022-12-06T19:48:08+05:30 IST