Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు... భారత్ స్పందన...

ABN , First Publish Date - 2022-11-03T20:42:15+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)పై కాల్పుల ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ పేర్కొంది.

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు... భారత్ స్పందన...
Arindam Bagchi

న్యూఢిల్లీ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)పై కాల్పుల ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ పేర్కొంది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి (Arindam Bagchi) గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఈ సంఘటన ఇప్పుడే జరిగిందన్నారు. దీనిపై తాము నిశితంగా దృష్టిపెట్టినట్లు తెలిపారు. జరుగుతున్న పరిణామాలను నిరంతరం పరిశీలిస్తామన్నారు. ఇది ఇప్పుడే జరిగిన సంఘటన కాబట్టి ఇంతకన్నా చెప్పడానికేమీ లేదన్నారు.

ఇదిలావుండగా, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు (Justin Trudeau) ఈ ఘటనపై స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ఇమ్రాన్ ఖాన్, ఆయన మద్దతుదారులపై దాడి సమర్థనీయం కాదన్నారు. ఈ హింసాకాండను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇటువంటివాటికి రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో, మన సమాజంలో చోటు లేదన్నారు. ఇమ్రాన్ సహా గాయపడినవారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

వీథుల్లోకి తరలివచ్చిన ఇమ్రాన్ మద్దతుదారులు

ఇమ్రాన్ ఖాన్‌పై దాడిని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు వీథుల్లోకి తరలివచ్చారు. పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ రాణా సనావుల్లా నివాసం వెలుపల కూడా ఇమ్రాన్ మద్దతుదారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

పీటీఐ నేత డాక్టర్ షహబాజ్ గిల్ ఇచ్చిన ట్వీట్‌లో, ఇమ్రాన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు మహమ్మద్ నవీద్ (Mohammad Naveed) నుంచి నేరాంగీకార స్టేట్‌మెంట్‌ను కొందరు వ్యక్తులు తీసుకున్నారన్నారు. ఆ స్టేట్‌మెంట్‌ను స్పెషల్ మీడియాలో, పీటీవీలో ప్రసారం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో మీకు ఏమైనా అర్థమవుతోందా? అని ప్రశ్నించారు. దీనికి అబ్జర్వేషనల్ కలర్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇది కచ్చితంగా హత్యాయత్నమేనని ఆరోపించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు.

అసలేం జరిగింది?

పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, ఆయనతోపాటు మరికొందరు పీటీఐ నేతలపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆయన రెండు కాళ్ళకు తూటాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆయన మేనేజర్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపిన తర్వాత పారిపోతున్న వ్యక్తి (మహమ్మద్ నవీద్)ని ఆ సభలో పాల్గొన్నవారు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆ నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా, తాను ఈ నేరాన్ని ఒంటరిగానే చేశానని, ఇతరుల ప్రమేయం లేదని చెప్పాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నందుకే ఆయనను కాల్చి చంపాలనుకున్నానని చెప్పాడు.

ఇమ్రాన్ స్పందన

ఇదిలావుండగా, ఇమ్రాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన మాట్లాడుతూ, తనకు అల్లా నూతన జీవితాన్ని ఇచ్చాడని చెప్పారు. పీటీఐ నేత ఫవద్ చౌదరి స్పందిస్తూ, ఇది కేవలం ఇమ్రాన్ ఖాన్‌పై దాడి కాదని, యావత్తు పాకిస్థాన్‌పై జరిగిన దాడి అని పేర్కొన్నారు.

పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఇచ్చిన ట్వీట్‌లో, ఇమ్రాన్ ఖాన్‌ కాలిలో తూటాలు తగిలి గాయపడ్డారని, ఆయన విషమ పరిస్థితిలో లేరని తెలుస్తోందని చెప్పారు. ఈ దాడి చాలా విచారకరమని, భయానకమని, పిరికిపంద చర్య అని తెలిపారు. గాయపడినవారందరినీ అల్లా దీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఇమ్రాన్ ఖాన్ సభపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈ సంఘటనపై తక్షణం నివేదిక సమర్పించాలని ఇంటీరియర్ మినిస్టర్‌ను కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇమ్రాన్ ఖాన్ తదితరులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు, భద్రత కోసం పంజాబ్ ప్రభుత్వానికి సాధ్యమైన అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో హింసకు చోటు లేదన్నారు.

Updated Date - 2022-11-03T20:42:20+05:30 IST