Gujarat polls: 15 కిలోమీటర్లు పరుగెత్తి, అడవుల్లో తలదాచుకున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

ABN , First Publish Date - 2022-12-05T15:53:58+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోవడం..

Gujarat polls: 15 కిలోమీటర్లు పరుగెత్తి, అడవుల్లో తలదాచుకున్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడీ (Kanti Kharadi) ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోవడం సంచలనం అయింది. ఆయన జాడ తెలియడం లేదంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ట్వీట్ కూడా చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం కాంతి ఖారాడీ మీడియా ముందు ప్రత్యక్షమై తనకు ఎదురైన అనుభవాన్ని తెలియజేశారు. బీజేపీ ప్రత్యర్థి నేత, ఆయన అనుచరులు కొందరు కత్తులతో దాడికి దిగడంతో తాను రాత్రంతా అడవుల్లోనే తలదాచుకున్నానని చెప్పారు. బనస్‌కాంతలోని దాంతాలో రీఎలక్షన్ జరపాలని ఆయన డిమాండ్ చేసారు. దాంతా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి లధు పరగిపై ఎఫ్ఐఆర్ కూడా ఆయన నమోదు చేశారు. రెండో విడత పోలింగ్ జరుగుతున్న 93 స్థానాల్లో దాంతా నియోజకవర్గం కూడా ఉంది.

''రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బీజేపీ నేత, అతనికి చెందిన 150 మంది గూండాలు కత్తులతో నాపై దాడికి వచ్చారు. చంపుతారనే భయంతో అడవుల్లోకి పారిపోయాను. పోలీసులు వచ్చేంతవరకూ మూడు, నాలుగు గంటలు అక్కడే తలదాచుకున్నాను. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరాను'' అని తనపై జరిగిన దాడి ఘటనను కాంతి ఖరాడి వివరించారు. ఓటర్లను కలుసుకునేందుకు వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి, అతని గూండాలు తన కారును అడ్డుకుని, తనను చుట్టుముట్టారని చెప్పారు. కారు వెనక్కి తిప్పుతుండగా మరో కారు వెనక నుంచి అడ్డుకుందని, దాంతో తాను కారు విడిచిపెట్టి పారిపోయాయని చెప్పారు. 10 నుండి 15 కిలోమీటర్లు అడవుల్లోకి పరుగులు తీశాననితెలిపారు. గతంలో కూడా బీజేపీ అభ్యర్థి తనను బెదరించాడని, తనకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

రాహుల్ ట్వీట్...

దీనికి ముందు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖరాడీ మిస్సింగ్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ''కాంగ్రెస్ గిరిజన నేత, దాంతా అసెంబ్లీ అభ్యర్థి కాంతిభాయ్ ఖరాడీపై బీజేపీ గూండాలు పాశవికంగా దాడి చేశారు. ఇప్పుడు ఆయన కనిపించడం లేదు. అదనంగా పారామిలటరీ బలగాలను మోహరించాలని తాము డిమాండ్ చేసినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. బీజేపీకి మేము భయపడేది లేదు, గట్టిగా పోరాడుతూనే ఉంటాం'' అని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. బీజేపీ ఓటమి భయంతోనే ఖరాడీపై దాడికి దిగిందని గుజరాత్ కాంగ్రెస్ నేత జిగ్నేష్ మేవాని మరో ట్వీట్‌లో విమర్శించారు. ఖరాడీ కారుని అడ్డుకుని ఆయనను చంపేందుకు ప్లాన్ చేశారని, వాహనాన్ని తలకిందులు చేశారని, ఇప్పటికీ కాంతీభాయ్ జాడ తెలియడం లేదని ఆ ట్వీట్‌లో జిగ్నేష్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ స్పందించలేదు.

Updated Date - 2022-12-05T15:56:01+05:30 IST