KTR letter: కష్టపడి చదవండి.. కలల్ని నిజం చేసుకోండి

ABN , First Publish Date - 2022-12-05T10:45:06+05:30 IST

తెలంగాణ (Telangana)లో కొలువుల కుంభమేళా కొనసాగుతున్నదని, కష్టపడి చదివి, కలల్ని నిజం చేసుకోవాలని రాష్ట్ర మునిసిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌(Minister KTR) యువతకు

KTR letter: కష్టపడి చదవండి.. కలల్ని నిజం చేసుకోండి
యువతకు లేఖ

యువతకు మంత్రి కేటీఆర్‌ లేఖ

రాష్ట్రంలో కొలువుల కుంభమేళా

గురుకుల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు

95% స్థానికులకే ఉద్యోగాలు: కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ (Telangana)లో కొలువుల కుంభమేళా కొనసాగుతున్నదని, కష్టపడి చదివి, కలల్ని నిజం చేసుకోవాలని రాష్ట్ర మునిసిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌(Minister KTR) యువతకు సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 2.25 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు చెప్పారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం యువతకు లేఖ రాశారు. మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదని, సంఘర్షణకు ప్రతిరూపమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌(Chief Minister KCR) నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుందని పేర్కొన్నారు. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న రాష్ట్రం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టో (Manifesto)లో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే పూర్తి చేశామన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక, 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టినట్టు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే సుమారు 32వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు జారీ అయ్యాయని చెప్పారు. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నామన్నారు. మొత్తంగా 2.25 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను అతితక్కువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుందని తెలిపారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకే దక్కుతున్నాయన్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఫలించిందని చెప్పారు.

త్వరలో మరో 10 వేల మంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ

నిరుద్యోగ యువత కోసం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే, ఏళ్ల తరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పనిచేస్తున్న వివిధ ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్టు మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించనున్నట్టు ప్రకటించారు. భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడం కోసం టీఎ్‌సపీఎస్సీతోనే కాకుండా పోలీస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు, గురుకుల విద్యా సంస్థలతో ప్రత్యేక బోర్డులను ఏర్పాట్టు చేసినట్టు తెలిపారు. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసినట్టు ఆ లేఖలో ప్రస్తావించారు.

ప్రైవేట్‌ రంగంలోనూ ఉపాధి అవకాశాలు

ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ప్రైవేట్‌ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించినట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇప్పటిదాకా సుమారు 17 లక్షల మందికి పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించినట్టు తెలిపారు. అలాగే.. ఆవిష్కరణల ఆలోచనలతో ఉన్న ఔత్సాహిక యువత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా స్టార్టప్‌ ఈకో సిస్టంను తీసుకువచ్చినట్టు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల తరఫున నిరుద్యోగులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగపర్వం నడుస్తున్నదని, ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుందన్నారు.

Updated Date - 2022-12-05T10:45:38+05:30 IST