Caught On Camera: ఎంత కక్ష ఉంటే మాత్రం.. ఇంత దారుణంగా చంపుతారా?

ABN , First Publish Date - 2022-12-06T17:07:15+05:30 IST

ఎంత కక్ష ఉంటే మాత్రం.. ఇంత దారుణంగా చంపుతారా? హైదరాబాద్: ‘మాయమై పోతున్నాడమ్మా.. మనిషన్నవాడు.

Caught On Camera: ఎంత కక్ష ఉంటే మాత్రం.. ఇంత దారుణంగా చంపుతారా?

హైదరాబాద్: ‘మాయమై పోతున్నాడమ్మా.. మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు..’ అంటూ తెలంగాణ కవి డాక్టర్ అందెశ్రీ (Ande Sri) బాధపడ్డాడు. ఆయన ఆవేదన ముమ్మాటికి నిజం. మానవత్వం ఆవిరైపోయి మనిషి మాత్రమే మిగిలి ఉన్నాడని చెప్పేందుకు బోల్డన్ని ఉదాహరణలు. సంకుచిత ధోరణి మనిషిలోని మానవత్వాన్ని మంటకలిపేస్తుంటే.. పాలపుంతల్లోని రహస్యాలను ఛేదిస్తున్న సైన్స్ మనిషిలోని మూఢత్వాన్ని ఛేదించలేక బేల చూపులు చూస్తోంది. భూవివాదాలు, ఆస్తి గొడవలు, డబ్బు కోసం ఆపేక్ష, వివాహేతర సంబంధాలు.. కారణం ఏదైతేనేం మనిషి రాక్షసుడిగా మారిపోతున్నాడు. విచక్షణ జ్ఞానాన్ని మరిచి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. బంధాలు, బంధుత్వాలను సైతం పక్కనపెట్టి ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లోని కేపీ అగ్రహార ప్రాంతంలో ఓ చోట 30 ఏళ్ల యువకుడు కూర్చుని ఉన్నాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటింది. అదే సమయంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు అతడి దగ్గరికొచ్చారు. వారి మధ్య ఏదో వాగ్వివాదం జరిగింది. అంతే, గుంపులోని ఓ మహిళ పరిగెత్తుకుంటూ రోడ్డు పక్కకి వెళ్లి పెద్ద రాయిని వెతికి పట్టుకొచ్చింది. మిగతా వారు ఆ వ్యక్తిని నేలపై పడేసి గట్టిగా పట్టుకున్నారు.

పట్టుకొచ్చిన రాయితో ఆ మహిళ యువకుడి తలపై మోదింది. ఆ తర్వాత మరో వ్యక్తి పెద్ద రాయి పట్టుకొచ్చి యువకుడి తలపై మోదాడు. అలా ఒక్కసారి కాదు, పలుమార్లు అలా మోదుతూనే ఉన్నాడు. ఆ తర్వాత మరో మహిళ కూడా రాయి తీసుకొచ్చి బాధితుడి తలపై బలంగా పడేసింది. అర్ధరాత్రి కావడంతో యువకుడి ఆర్తనాదాలు గాల్లో కలిసిపోయాయి. అయితే, ఈ ఘటన మాత్రం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది.

ఈ గందరగోళంతో చుట్టుపక్కల వారికి మెలకువ వచ్చి బయటకు రావడంతో నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బాధితుడిని బాదామి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుల్లో ఇప్పటి వరకు ఎవరినీ గుర్తించలేదు. ఈ గొడవకు కారణం ఏంటో, బాధితుడితో నిందితులకు ఉన్న వివాదం ఏంటో తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

తల నరికి సెల్ఫీ..

selfie.jpg

ఒళ్లు గగుర్పొడిచే మరో ఘటన ఝార్ఖండ్‌ (Jharkhand)లోని కుంతి జిల్లాలో జరిగింది. భూ వివాదంలో 20 ఏళ్ల యువకుడు తన కజిన్ తల నరికి దానితో సెల్ఫీలు కూడా తీసుకున్నాడు. రెండు పదుల వయసు కూడా దాటని ఆ యువకుడిలో అంత కాఠిన్యం ఎలా వచ్చిందో అంతు చిక్కడం లేదు. జిల్లాలోని ముర్హు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. ఈ నెల 2న బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు, అతడి భార్య సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 1న కను ముండా (24) ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అతడి కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం బాధితుడి తండ్రి ఇంటికి వచ్చాడు. ఇంట్లో కుమారుడు లేకపోవడంతో చుట్టుపక్కల వారిని ఆరా తీశాడు. వారు చెప్పింది విని ఆయన షాకయ్యాడు. మీ మేనల్లుడు సాగర్ ముండా తన స్నేహితులతో కలిసి వచ్చి కనును కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు చెప్పడంతో నిర్ఘాంతపోయాడు. కుమారుడి కోసం ఆ రోజంతా గాలించినా ఫలితం లేకపోవడంతో తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి ప్రశ్నించారు. వారు చెప్పింది విని పోలీసులే షాకయ్యారు. వారిచ్చిన సమాచారం మేరకు కుమంగ్ గోప్లా అడవిలో కనుముండా మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని దుల్వా తుంగ్రి ప్రాంతంలో తలను గుర్తించి పోలీసులు తెలిపారు. బాధితుడి తల తెగనరికిన తర్వాత ప్రధాన నిందితుడు దానితో సెల్ఫీ కూడా తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

బాధితుడిది సహా నిందితుల నుంచి 5 ఫోన్లు, రెండు ఆయుధాలు, గొడ్డలి, ఎస్‌యూవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కుటుంబాల మధ్య దీర్ఘకాలంగా భూ వివాదం ఉందని, ఈ హత్యకు అదే కారణమని పోలీసులు పేర్కొన్నారు.

మహిళలపై మట్టిపోసి...

mandasa.jpg

శ్రీకాకుళం (Srikakulam) జిల్లా మందస మండలంలోని హరిపురంలో గత నెలలో ఇలాంటి ఘటనే జరిగింది. కుటుంబ ఆస్తిలో న్యాయంగా తమకు చెందాల్సిన వాటా కోసం పోరాడుతున్న తల్లీకుమార్తెపై ట్రాక్టర్‌తో మట్టిపోసి సజీవ సమాధి చేసేందుకు యత్నించారు నిందితులు. బాధితుల కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి మట్టి తొలగించి వారిని రక్షించారు.

Updated Date - 2022-12-06T19:10:26+05:30 IST

Read more