నేడు అనంతుని దీపోత్సవం

ABN , First Publish Date - 2022-11-23T00:12:08+05:30 IST

పద్మనాభంలోని అనంతపద్మనాభుని దీపోత్సవం బుధవారం నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా కార్తీక బహుళ రాత్రి గల అమావాస్య రోజున సాయంత్రం 5.30 గం.లకు ఉత్సవాన్ని ప్రారంభిస్తారు.

నేడు అనంతుని దీపోత్సవం
దీపోత్సవం నిర్వహించే పద్మనాభుని మెట్ల మార్గం

సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం

పద్మనాభం, నవంబరు 22: పద్మనాభంలోని అనంతపద్మనాభుని దీపోత్సవం బుధవారం నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా కార్తీక బహుళ రాత్రి గల అమావాస్య రోజున సాయంత్రం 5.30 గం.లకు ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. కార్తీక మాసంలో సాయంసంధ్య వేళ తైల దీపాలంకరణ చేస్తే సర్వపాపహరణం, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ఈ పవిత్ర దీపోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు. గిరి మెట్ల నుంచి శిఖరం వరకు సుమారు 1,286 మెట్లకు ఇరువైపులా ప్రమిదలలో నూనె దీపాలను వెలిగిస్తారు. ఇప్పటికే మెట్ల మార్గంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. అనంతుని ఉత్సవ విగ్రహాలను నిలిపే ప్రథమ పావంచా వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. కుంతీ మాధవస్వామి, నారాయణేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి ఆలయాలకు విద్యుద్దీపాలంకరణ చేసి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. నూనె దీపాలను వెలిగించడానికి అవసరమైన ప్రమిదలను, ఒత్తులను సిద్ధం చేశారు. సీఐ ఎన్‌.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు జరిగాయి. వాహనాల పార్కింగ్‌ స్థలాలను చదును చేయించారు.

ఇదీ దీపోత్సవ చరిత్ర

ద్రాక్షారామం నుంచి 1939లో ఇక్కడకు వచ్చిన చేకూరి సత్యనారాయణరాజు, బుల్లి సత్యనారాయణరాజు, లక్ష్మణమూర్తిరాజు సోదరులు అనంతుని గిరికి దక్షిణ నైరుతి భాగంలో అప్పటి విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి అలక్‌నారాయణగజపతిరాజు సహకారంతో ఆశ్రమం ఏర్పాటు చేశారు. వారిని స్థానికులు యాగం రాజులుగా పిలిచేవారు. 1941లో చైత్రశుద్ధ నవమి నుంచి 41 రోజుల పాటు వారు యజ్ఞం నిర్వహించారు. ఇందుకోసం ద్రాక్షారామం నుంచి త్రిపుర సుందరీదేవీ విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించారు. యాగం ఆఖరి రోజున అనంతుని గిరి మెట్లకు దీపోత్సవం నిర్వహించేవారు. అప్పటినుంచి సంప్రదాయంగా ఈ ఉత్సవం కొనసాగింది. అయితే నిర్వాహకుల వంశంలోని ముఖ్యుల మరణంతో 70 ఏళ్ల క్రితం నిలిచిపోయింది. కాగా 1987లో అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు రాకుధూటి అనంతకృష్ణమాచార్యులు(పెదబాబు) చొరవతో ఏర్పడిన భక్త బృందం దీపోత్సవాన్ని పునఃప్రారంభించింది. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది ఈఓ కీర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉత్సవనిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి.

ఉత్సవానికి చేరుకునే మార్గమిదీ

అనంతుని దీపోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా విశాఖపట్నం, గాజువాక తదితర ప్రాంతాల నుంచి సింహాచలం మీదుగా 700 నంబరు మెట్రో బస్సులు, పల్లెవెలుగు బస్సులలో పద్మనాభం చేరుకోవచ్చు. తగరపువలస, ఆనందపురంల మీదుగా ఆటోల ద్వారా రావచ్చు. విజయనగరం నుంచి సింహాలం నడిచే బస్సుల్లో పద్మనాభం చేరుకోవచ్చు.

Updated Date - 2022-11-23T00:12:10+05:30 IST