Rushikonda : సీఎం కోసమే రుషికొండపై నిర్మాణాలు!

ABN , First Publish Date - 2022-10-28T02:30:21+05:30 IST

రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలు ముఖ్యమంత్రి కోసమేనని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌

Rushikonda : సీఎం కోసమే రుషికొండపై నిర్మాణాలు!

వాటిలో ఆయన ఉంటే తప్పేంటి?

పరిశ్రమల మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యలు

విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలు ముఖ్యమంత్రి కోసమేనని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తేల్చిచెప్పారు. అక్కడ టూరిజం కోసం నిర్మాణాలు జరుగుతున్నాయని.. వాటిలో సీఎం ఉంటే తప్పేంటని విశాఖలో ప్రశ్నించారు. ‘సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా ఉండొచ్చు. మిలీనియం టవర్స్‌లో కూడా ఉండొచ్చు. ఆయన ప్రభుత్వ నిర్మాణంలో ఉండడానికి వీల్లేదని ఎవరైనా చెప్పగలరా? చెప్పమనండి. విశాఖలో ప్రభుత్వపరంగా ఎలాంటి నిర్మాణాలు జరిగినా సీఎం ఉండడానికే కడుతున్నారు.. అమ్మో.. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని భయపడుతున్నారు. తలకిందులుగా తపస్సు చేసినా.. చంద్రబాబు కాదు.. పవన్‌ కల్యాణ్‌ తాత దిగివచ్చినా విశాఖ పరిపాలనా రాజధాని కావడాన్ని ఎవరూ ఆపలేరు. విశాఖలో ఏ కొండ మీదా నిర్మాణాలు లేవా? రుషికొండ మీద ఒక గెస్ట్‌హౌస్‌ కట్టినంత మాత్రాన రాజధాని ఇక్కడకు వచ్చేస్తుందా? రుషికొండ మీద నిర్మాణాలు జరిగితే తప్పేంటి? చెట్లు కొట్టి, బిల్డింగులు కడుతున్నారంటున్నారు.

చెట్ల మీద ఇళ్లు కట్టలేం కదా’ అని వ్యాఖ్యానించారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుచేయకుండా అడ్డుకోవడం ద్వారా ఉత్తరాంధ్రకు టీడీపీ నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. రైతుల పేరిట ఈ ప్రాంతంపై దండయాత్ర చేయాలనుకున్న పాదయాత్ర ఆగిపోవడంతో టీడీపీ నేతలు కొత్తగా ఇలాంటి ఎత్తుగడలు ప్రారంభించారన్నారు.

Updated Date - 2022-10-28T02:30:45+05:30 IST