Srikakulam : స్థలం కోసం సజీవంగా పాతిపెట్టబోయారు

ABN , First Publish Date - 2022-11-08T05:08:02+05:30 IST

ఆస్తి కోసం సొంత పిన్ని, చెల్లెలిపైనే వైసీపీ నేత, ఆయన సోదరులు హత్యాయత్నం చేశారు. ట్రాక్టర్లతో కంకర వేసి మహిళలను

Srikakulam : స్థలం కోసం సజీవంగా పాతిపెట్టబోయారు

ఆస్తి కోసం పిన్ని, చెల్లెలిపైనే ఘాతుకం

ట్రాక్టర్‌తో ఎర్రకంకర పోసి హత్యాయత్నం

సిక్కోలులో వైసీపీ నేత, సోదరుల దారుణం

ఏళ్ల తరబడి వివాదంగా ఉన్న భూమి ఆక్రమణ

హరిపురం, నవంబరు 7: ఆస్తి కోసం సొంత పిన్ని, చెల్లెలిపైనే వైసీపీ నేత, ఆయన సోదరులు హత్యాయత్నం చేశారు. ట్రాక్టర్లతో కంకర వేసి మహిళలను చంపేందుకు ప్రయత్నించారు. ఈ అమానుష ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో సోమవారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. కొట్ర దాలమ్మ, ఈమె కూతురు మజ్జి సావిత్రికి వారసత్వంగా లభించిన స్థలం ఇంటి పక్కనే ఉంది. వారి సమీప బంధువులైన కొట్ర దామోదరం కొడుకు కొట్ర రామారావు, కొట్ర సీతారాం కొడుకులు కొట్ర ప్రకాశరావు, కొట్ర ఆనందరావు దీన్ని ఆక్రమించుకున్నారు. దీనిపై బాధిత మహిళలు 2009 నుంచి పోరాటం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, పెద్దమనుషులతో పంచాయితీ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. తమ ఇంటిపక్కనే ఉన్న వారి స్థలంలో సోమవారం కొట్ర రామారావు, కొట్ర ప్రకాశరావు, కొట్ర ఆనందరావు అక్రమ నిర్మాణం చేపట్టి కంకర నింపుతుండటంతో మహిళలిద్దరు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. దీంతో ఆ ముగ్గురు ట్రాక్టర్‌తో వరసకు పిన్ని, చెల్లెలు అయిన ఆ మహిళలపై కంకరను వేయించి చంపేందుకు యత్నించారు. సగం వరకు కంకరలో కూరుకుపోయిన మహిళలు భోరున విలపిస్తూ కేకలు పెట్టడంతో స్థానిక యువకులు పరుగు పరుగున వచ్చి పారలతో మట్టిని తొలగించి వారిని రక్షించారు. కొట్ర రామారావు గత సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడిగా పోటీచేసి ఓడిపోయారు. గ్రామంలో ఆయన వైసీపీ కీలక నాయకుడు. అనంతరం బాధిత మహిళలు మందస పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేసి ఘటనకు కారణమైన ముగ్గురిని అరెస్టు చేశారు.

ఏళ్లుగా పోరాటం..

కొట్ర సీతారాం, కొట్ర దామోదరం, కొట్ర నారాయణ, కొట్ర లక్ష్మీనారాయణలు అన్నదమ్ములు. వీరిలో ముగ్గురు ఇప్పటికే మృతిచెందగా.. కొట్ర లక్ష్మీనారాయణ జీవించి ఉన్నారు. వారసత్వంగా వచ్చిన భూములు నలుగురికీ సమానంగా వాటాలు రావాలి. కానీ, తన భర్త మృతిచెందాక తనకు కొడుకుల్లేరని, నీకెందుకు భూములంటూ కొట్ర దామోదరం కొడుకు కొట్ర రామారావు, కొట్ర సీతారాం కొడుకులు కొట్ర ప్రకాశరావు, కొట్ర ఆనందరావు అన్యాయం చేస్తున్నారని బాధిత మహిళ కొట్ర దాలమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అన్నయ్యలే తమ భూమిని అక్రమించి వాటా ఇవ్వకుండా దారుణానికి పాల్పడుతున్నారని దాలమ్మ కుమార్తె సావిత్రి భోరున విలపించింది. భూముల్లో వాటా కోసం నాలుగేళ్ల క్రితం తల్లి, కుమార్తె హరిపురం కూడలిలో నిరశనదీక్ష చేశారు. అప్పట్లో పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో దీక్ష విరమించారు. సోమవారం ఆ స్థలంలో నిర్మాణాలు చేపడుతుండగా దాలమ్మ, సావిత్రి అడ్డుకున్నారు. దీంతో ఆక్రమణదారులు కంకరవేసి చంపేందుకు యత్నించారు.

Updated Date - 2022-11-08T05:08:05+05:30 IST